పార్లమెంట్ ఎన్నికల బరిలో 50 మంది
ABN, Publish Date - Apr 29 , 2024 | 11:12 PM
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మరో అంకం నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. దాంతో పాలమూరు నియోజకవర్గం నుంచి 31 మంది, నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి 19 మంది బరిలో నిలిచారు.
పాలమూరు నియోజకవర్గం నుంచి 31 మంది
నాగర్‌కర్నూల్‌లో నుంచి 19 మంది పోటీ
రెండు నియోజకవర్గాల్లో ఆరుగురు నామినేషన్ల ఉపసంహరణ
అభ్యర్థుల లెక్క తేలడంతో ఉపందుకోనున్న ప్రచారం
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మరో అంకం నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. దాంతో పాలమూరు నియోజకవర్గం నుంచి 31 మంది, నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి 19 మంది బరిలో నిలిచారు. రెండు నియోజకవర్గాల్లో ఆరుగురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. 25వ తేదీతో గడువు ముగిసింది. ఆ తర్వాత రోజు అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించారు. మహబూబ్‌నగర్ పరిధిలో 42 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, అందులో ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు సోమవారం రోజు స్వతంత్ర అభ్యర్థులు మహ్మద్ ఇంతియాజ్, మహ్మద్ అబ్దుల్ రహీం, శ్రీకాంత్ పిల్లెల, కె.జంగయ్య తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 42 మందిలో పరిశీలనలో ఏడుగురు, ఉపసంహరణలో నలుగురు అభ్యర్థులు వైదొలగడంతో.. ఎన్నికల బరిలో 31 మంది నిలిచారు. కాంగ్రెస్ తరఫున సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి బరిలో నిలవగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోటీ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి ప్రస్తుత ఎంపీ మన్నె శ్రీనివా్‌సరెడ్డి బరిలో నిలిచారు. వచ్చే నెల 13న పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉండగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివా్‌సరెడ్డి వెనుకపడ్డారు. ఈ నెల 11 వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉండటంతో ఈ 13 రోజుల్లో ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాలని అభ్యర్థులు యోచిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పాలమూరులో నిర్వహించిన మూడు బహిరంగ సభల్లో, పార్లమెంట్ పరిధిలోని నాలుగు సమావేశాల్లో పాల్గొన్నారు. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారానికి కొంతమంది అగ్ర నాయకులు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ తరఫున ఇప్పటివరకు ఎవరూ రాకపోయినప్పటికీ.. ఇప్పుడు అభ్యర్థులు లెక్క తేలడంతో నరేంద్రమోదీ సభ పాలమూరులో ఉంటుందని సమాచారం. ఆయనతోపాటు మరికొంత మంది బీజేపీ అగ్ర నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివా్‌సరెడ్డి తరఫున ఇప్పటికే ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రోడ్‌షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. రానున్న రోజుల్లో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు హరీశ్‌రావు, కేటీఆర్ సమావేశాలు, ప్రచారానికి హాజరయ్యే అవకాశం ఉంది.
నాగర్‌కర్నూల్‌లో ఇద్దరు ఉపసంహరణ
నాగర్‌కర్నూల్(ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 21 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, సోమవారం ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దాంతో ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 19 మంది బరిలో నిలిచారని పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
Updated Date - Apr 29 , 2024 | 11:12 PM