53 మంది కూలీలకు గాయాలు
ABN, Publish Date - Nov 12 , 2024 | 11:28 PM
ఉమ్మడి పాలమూరులో మంగళవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో 53 మంది కూలీలు గాయపడ్డారు.
- కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద బొలెరో బోల్తా
- 35 మందికి గాయాలు, వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలు
- ముగ్గురి పరిస్థితి విషమం, హైదరాబాద్‌కు తరలింపు
- జడ్చర్ల మండలంలో మరో ప్రమాదం
- 18 మందికి గాయాలు
కొత్తకోట/ జడ్చర్ల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పాలమూరులో మంగళవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో 53 మంది కూలీలు గాయపడ్డారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని బూత్కూర్ గ్రామానికి చెందిన 35 మంది మహిళా కూలీలు పని కోసం మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలోని వర్నె, ముత్యాలంపల్లి, వెంకంపల్లి గ్రామాలకు బొలెరో వాహనంలో బయలు దేరారు. జాతీయ రహదారిపై కనిమెట్ట గ్రామ శివారులో వాహనం టైర్ పంక్చరై బోల్తా పడింది. సమీపంలో ధాన్యం తూకాలు వేస్తున్న హమాలీలు గమనించి, కూలీలను వాహనంలో నుంచి బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించ డంతో పాటు, 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. దీంతో ఎస్‌ఐ మంజునాథ్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వనపర్తి జిల్లా ఆసుపత్రికి తర లించారు. తీవ్ర గాయాలైన అబ్దులమ్మ, రేణుకమ్మ, జయమ్మ, సావిత్రి, చిట్టె మ్మలను మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ఎస్‌వీఎస్ ఆసుపత్రులకు తరలించారు. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న అబ్దులమ్మ, జయమ్మలను హైదరాబాద్‌కు, రేణుకమ్మను కర్నూల్ ఆసుపత్రికి తర లించారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు.
పెద్ద అదిరాల వద్ద ట్రాక్టర్ ట్రాలీ బోల్తా
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలం పెద్దఆదిరాల శివారులో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి, 18 మంది కూలీలు గాయపడ్డారు. పెద్ద అదిరాలకు చెందిన ఓ రైతు పొలంలో పత్తి తీసేందుకు 18 కూలీలు ట్రాక్టర్ ట్రాలీలో వస్తుండగా, గ్రామ శివారులో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో ట్రాలీలో ఉన్న కూలీలు గాయపడ్డారు. వారిని జడ్చర్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలు లలితమ్మ, సుజాత, అనిత, సుజాత, జంగమ్మ, కృష్ణవేణి, ఊర్మిళ, ఎల్లమ్మ, కృష్ణమ్మలను బీఆర్‌ఎస్ నాయకులు కోడ్గల్ యాదయ్య, రఘుపతిరెడ్డి, శంకర్‌నాయక్, రామలింగారెడ్డి, సురేశ్, యాదయ్యతో పాటు పలువురు నాయకులు పరామర్శించారు.
Updated Date - Nov 12 , 2024 | 11:28 PM