ఆహార హక్కుకు.. భంగం కలిగిస్తే చర్యలు
ABN, Publish Date - Nov 12 , 2024 | 11:41 PM
ఆహార హక్కుకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని, అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలంగాణ ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
- కలెక్టర్ పనితీరు బాగుంది
- తెలంగాణ ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఆహార హక్కుకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని, అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలంగాణ ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 అమలుపై మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి తెలంగాణ ఆహార కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, రంగినేని శారద, బుక్యజ్యోతి, అదనపు కలెక్టర్ కే.సీతారామారావు, సంబంధిత శాఖ అధికారులు కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి హాజరయ్యారు. తొలుత పౌరసరఫరాలు, ఐసీడీఎస్, వెల్ఫేర్ హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకం, వైద్యశాఖ తదితర శాఖల అధికారులు, పాఠశాలల హెచ్‌ఎంలు, సంక్షే మ వసతి గృహ సంరక్షకులు, అంగన్‌వాడీ కార్యకర్తలతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గోలి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత చట్టం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే నేడు నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో అంగన్‌వాడీలు, వసతి గృహాలు, రేషన్ దుకాణాలను తనిఖీ చేశామన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలు, స్త్రీ శిశు సంక్షేమ, విద్యాశాఖ, వెల్ఫేర్ హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకంపై తదితర శాఖల అఽధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నామని తెలిపారు. జిల్లాలో తనిఖీలు చేసిన వివిధ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థుల రుచికరమైన భోజనం చేయడం గమనించామన్నారు. ఒకటి రెండు చోట్ల విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు లోపాలను సరి చేసుకుని నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించామని తెలిపారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లా డుతూ జాతీయ ఆహార భద్రత చట్టం-2013ను సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి చర్యలు తీసుకుంటుందని అన్నారు. మెనూ ప్రకారం హాస్టళ్లల్లో పౌష్టిక ఆహారం అందేలా పర్యవేక్షిస్తామన్నారు. వెల్దండ మండలంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో వసతులు లేవని ఫుడ్ కమిషన్ చైర్మన్ దృష్టికి రావడం పట్ల అక్కడి పరి స్థితులను వెంటనే పరిశీలించి నివేదికను సమర్పించాలని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెల్దండ తహసీ ల్దార్‌ను ఆదేశించారు.
Updated Date - Nov 12 , 2024 | 11:41 PM