ఎదురుచూపులు
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:32 PM
మహబూబ్‌నగర్ జిల్లాలో స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న మైనారిటీలు కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి మహబూబ్‌నగర్ జిల్లా మినహా మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా ఖాతాల్లో రుణాలు వంద శాతం జమ చేశారు.
మైనారిటీలకు ఏడాదిగా అందని స్వయం ఉపాధి రుణాలు
గత ప్రభుత్వ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాకు 402 యూనిట్లు మంజూరు
206 మంది లబ్ధిదారులకు అందజేత
తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో 196 మందికి నిలుపుదల
మైనారిటీ సంక్షేమ శాఖ వద్దే సొమ్ము
మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లాలో స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న మైనారిటీలు కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి మహబూబ్‌నగర్ జిల్లా మినహా మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా ఖాతాల్లో రుణాలు వంద శాతం జమ చేశారు. కానీ మహబూబ్‌నగర్ జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న 196 మందికి రుణాలు ఇవ్వలేదు. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు ఈ రుణాలు అందించలేకపోయారు. మంజూరైన రుణాలు మైనారిటీ సంక్షేమ శాఖలోనే ఉండిపోయాయి. దాంతో దరఖాస్తుదారులు రోజూ మైనారిటీ సంక్షేమ కార్యాలయం చుట్టూ తిరిగి వెళ్తున్నారు. అధికారులు రేపు మాపు వస్తాయని చెప్పి పంపిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాకు 838 యూనిట్లు మంజూరు
ఉమ్మడి జిల్లాలో మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా ఒక్కో లబ్ధిదారునికి రూ.లక్ష చొప్పున బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు ఇచ్చేందుకు 2022-23లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు 838 యూనిట్లకు గాను రూ.8.38 కోట్లు కేటాయించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు 402 యూనిట్లు మంజూరు కాగా, వాటిలో 206 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఎన్నికల కంటే ముందే రుణాలు వేశారు. మిగతా 196 మంది లబ్ధిదారులకు రుణాలు వేసే సమయానికి అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. దాంతో అవి పెండింగ్ పడ్డాయి. ఆ రుణాల కోసం లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
నాలుగు జిల్లాలకు వంద శాతం మంజూరు
మహబూబ్‌నగర్ మినహా మిగతా నాలుగు జిల్లాలకు వంద శాతం రుణాలను మంజూరు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు 116 యూనిట్లు మంజూరు కాగా, రూ.1.16 కోట్లు విడుదల చేశారు. ఎన్నికల కంటే ముందుగానే దరఖాస్తులు స్వీకరించి, అర్హులను ఎంపిక చేసి రుణాలను గ్రౌండింగ్ చేశారు. వనపర్తి జిల్లాకు 100, జోగులాంబ గద్వాల 114, నారాయణపేట జిల్లాకు 106 యూనిట్లు కేటాయించగా, అధికారులు వంద శాతం గ్రౌండింగ్ చేశారు.
ఏడాది నుంచి తిరుగుతున్నా..
మైనారిటీ రుణం రూ.లక్ష కోసం దరఖాస్తు చేసుకున్నా. వీరన్నపేటలో నాకు చిన్న దుకాణం ఉంది. రుణం వస్తే సామగ్రి తెచ్చి పెద్ద దుకాణం చేద్దామని ఎదురు చూస్తున్నా. ఏడాది అయ్యింది. ఇంకా రుణం రాలేదు. అధికారులను అడిగితే రేపు మాపు అంటున్నారు.
- ఖలీల్, మర్లు
జనరల్ స్టోర్ కోసం దరఖాస్తు చేసుకున్నా..
జనరల్ స్టోర్‌లో సామగ్రి తెచ్చి పెడతామని రూ.లక్ష రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా. నాతో పాటు దరఖాస్తు చేసుకున్న చాలా మందికి రుణం వచ్చింది. నాకు మాత్రం రాలేదు.
- అజ్మతుల్లా, శివశక్తినగర్
ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం
జిల్లాలో 196 రుణాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికలయ్యాక ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఇవ్వలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, రుణ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో వేసేలా చూస్తాం.
- శంకరాచారి, మైనారిటీ వెల్ఫేర్ అధికారి, మహబూబ్‌నగర్
Updated Date - Dec 02 , 2024 | 11:32 PM