చెరువులకు జల కళ
ABN, Publish Date - Nov 09 , 2024 | 11:15 PM
ఈసారి వరుణ దేవుడు కరుణించడంతో చెరువులు జళకలను సంతరించుకున్నాయి.
- పెరుగునున్న యాసంగి సాగు
- ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
గట్టు, నవంబరు 9 (ఆంద్రజ్యోతి) : ఈసారి వరుణ దేవుడు కరుణించడంతో చెరువులు జళకలను సంతరించుకున్నాయి. మండలంలోని ప్రధాన నోటిఫైడ్ చెరువులతో పాటు నీటి కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. గత సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురువక పోవడంతో ప్రఽధాన నోటిఫైడ్ చెరువులన్నీ నీరు లేక వెలవెల పోయాయి. దీంతో ఆయకట్టు భూములు బీడువారాయి. గట్టు, మాచర్ల, సల్కాపురం చెరువులకు కూత వేటు దూరంలో నెట్టంపాడు ప్రధాన కాల్వ పారుతున్నా చెరువులకు ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఈ చెరువుల్నన వర్షపు నీటి పైనే ఆధారపడాల్సి ఉంది. ఈ సారి సమృద్ధిగా నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ అనంతరం రబీలో కూడా చెరువుల కింద పంటల సాగుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. దీంతో పాటు మూగ జీవాలు కూడా తాగు నీటి కోసం చింతించవలసిన అవసరం లేదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ప్రధానంగా గట్టు చెరువు, సల్కాపురం చెరువు, మాచర్ల చెరువు, కుచినెర్ల పాత చెరువు, కుచినెర్ల కొత్త చెరువు, బల్గెర చెరువులు మొత్తం ఆరు నోటిఫైడ్ చెరువులు ఉన్నాయి. గట్టు చెరువు కింద దాదాపు 300 ఎకరాల ఆయకట్టు ఉండగా, మాచర్ల చెరువు కింద 300 ఎకరాలు, సల్కాపురం చెరువు కింద 150 ఎకరాలు, బల్గెర చెరువు కింద 100 ఎకరాలు, కుచినెర్ల చెరువు కింద 200 ఎకరాల ఆయకట్టు పొలాలు ఉన్నాయి. ఇవే కాక నీటి కుంటల కింద కూడా ఆయకట్టు ఉన్నది.
Updated Date - Nov 09 , 2024 | 11:15 PM