దేవదేవుడికి దళితుల సేవ
ABN, Publish Date - Nov 07 , 2024 | 11:27 PM
దేవదేవుడైన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి సేవలో దళితులు తరాతరాలుగా తరిస్తున్నారు.
- చిన్న వడ్డెమాన్‌లోని ప్రత్యేక గదిలో ఉద్దాల తయారీ
- దీపావళి అమావాస్య నుంచి పని ప్రారంభం
- రెండు పూటలా స్నానం, ఒంటి పూట భోజనం
- ఉద్దాలను దర్శించుకున్న తర్వాతే స్వామి సన్నిధికి భక్తులు
చిన్నచింతకుంట, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : దేవదేవుడైన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి సేవలో దళితులు తరాతరాలుగా తరిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలో అమ్మా పూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి క్షేత్రంలో వేంక టేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొన సాగుతున్నాయి. ఉత్సవాల్లో తొలి ఘట్టమైన అలం కారోత్సవం ఈనెల ఆరున ముగిసింది. ఆ తర్వాత ప్రధాన ఘట్టమైన ఉద్దాలోత్సవం ఈ నెల ఎనిమిదిన జరుగనున్నది. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్త య్యాయి. ఉత్సవం కోసం ఉద్దాలను (పాదుకలు) చిన్న చింతకుంట మండలంలోని చిన్నవడ్డెమాన్‌కు చెందిన దళితులు సిద్ధం చేస్తున్నారు.
నియమ నిష్ఠలతో ఉద్దాల తయారీ
ఆనవాయితీ ప్రకారం చిన్న వడ్డెమాన్ గ్రామంలోని ప్రత్యేక గదిలో దీపావళి అమావాస్య రోజు ఉద్దాల తయారీ ప్రారంభం అయ్యింది. గ్రామానికి చెందిన 60 మంది దళితులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమాన్ని వారు అత్యంత నియమ నిష్ఠలతో కొనసాగిస్తారు. రోజుకు ఒక్క సారి మాత్రమే భోజనం చేస్తారు. రెండు పూటలా స్నానం చేస్తారు. ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచి గ్రామ సమీపంలోని ఊక చెట్టు వాగులో పవిత్ర స్నానం చేస్తారు. అనంతరం గ్రామంలోని ఉద్దాల తయారీ గదికి చేరుకుంటారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, పని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల సమ యంలో భోజనం చేస్తారు. ఆ తర్వాత కొంత సేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ పని ప్రారంభిస్తారు. రాత్రి తొమ్మిది గంటల వరకు పనిలోనే ఉంటారు.
ఉద్దాలపై ఆసక్తికరమైన కథనాలు
ఉద్దాలోత్సవానికి సంబంధించి రెండు మూడు కథనాలు ప్రచారంలో ఉంది. కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మొట్టమొదటి సారిగా క్రీస్తుశకం 1265వ సంవత్సరంలో ప్రారంభం అయ్యా యి. ఆ సమయంలో వడ్డేమాన్, అమ్మాపూర్ సంస్థానా లను ఇమ్మడి తిమ్మారెడ్డి వంశస్తులు పరిపాలించే వారు. ఓ ఏడాది బ్రహ్మోత్సవాలకు రెండు నెలల ముందు కురుమూర్తి కొండల్లో ఒక ఆవును పులి చంపింది. ఈ విషయాన్ని చిన్న వడ్డెమాన్‌కు చెందిన దళితులకు స్వామి వారు కలలో కన్పించి తెలిపారు. ఆ ఆవు చర్మాని తీసుకొచ్చి తనకు పాదుకలు తయారు చేయాలని ఆదేశించారు. దీంతో వారు వాగులోని ఇసుకను తెచ్చి ఓ గదిలో కుప్పగా పోసి పూజలు చేశారు. కార్తీక అమావాస్య రోజు అర్ధరాత్రి సమయం లో స్వామి వచ్చి తన పాదాలను ఆ ఇసుకలో మోపి వెళ్లి పోయారు. ఆ ముద్రల ఆధారంగా వారు ఉద్దాలను తయారు చేశారు.
అలాగే మరో కథనం కూడా ఉంది. కృష్ణానది తీరాన స్వామి వారు విశ్రమించిన ప్పుడు ఆయనకు పాదరక్షలు లేకపోవడాన్ని గంగమ్మ గమనించింది. స్వామి వారికి ఉద్దాలను సమర్పించింది. ఆ తర్వాత స్వామి చిన్న వడ్డెమాన్‌కు చేరుకొని తనకు ప్రతీ ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉద్దాలను తయారు చేయాలని గ్రామస్థులను కోరారు. అందుకు దళితులు అంగీకరించారు. అప్పటి నుంచి ఆ పనిని కొనసాగిస్తున్నారు. వాటిని తయారు చేసేందుకు ఆవు చర్మం, వన్నెలాకు, తగరం, పచ్చపూజలు, ట్వైన్ దారం, మైనం, రేషం పట్టు తదితర సామగ్రిని వినియోగిస్తారు.
ఏడాది పాటు మండపంలోనే ఉద్దాలు
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాలోత్సవానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఆ ఒక్క రోజే దాదాపు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారు. భక్తులు మండపంలోని ఉద్దాలను దర్శించుకొని, ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే స్వామి వారి దర్శనానికి వెళ్తారు. అక్కడ దళితులే వంతుల వారీగా సేవలు అందిస్తారు. ఉద్దాలతో తలపై కొట్టించుకుంటే అనారోగ్య బాధలు, కుటుంబంలో అశాంతి తొలగిపోయి, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఏడాది పాటు ఆ ఉద్దాలను మండపంలోనే ఉంచుతారు.
Updated Date - Nov 07 , 2024 | 11:27 PM