ధాన్యం కొనుగోళ్లలో పొరపాట్లకు తావివ్వొద్దు
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:11 PM
ఖరీఫ్ 2024-25 వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
- కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఖరీఫ్ 2024-25 వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టర్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో ధాన్యం సేకరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంతకుముందు లేని విధంగా సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించినందున, దొడ్డు రకం ధాన్యం కలువకుండా వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సన్నరకం ధాన్యాన్ని గుర్తించే విధంగా యంత్రంపై అవగాహన కల్పించారు. పొట్టు తీసిన తర్వాత గింజ పొడవు ఆరు మి.మీ కంటే తక్కువ గాను, వెడల్పు రెండు మి.మీ. మీటర్ల కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలన్నారు. సన్నరకం ధాన్యం గుర్తించే పూర్తి బాధ్యత వ్యవసాయ అధికారులదేనన్నారు. జిల్లాలో మొత్తం 59 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం వరి పంటకు మద్దతు ధర అనే పోస్టర్‌ను విడుదల చేశారు. అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, జిల్లా పౌరసరఫరా అధికారి స్వామికుమార్, జిల్లా మేనేజర్ విమల, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, జిల్లా రవాణా అధికారి వెంకటేశ్వరావు, ఎల్‌డీఎం అయ్యపురెడ్డి ఉన్నారు.
Updated Date - Nov 05 , 2024 | 11:11 PM