తాలు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ABN, Publish Date - Nov 11 , 2024 | 11:25 PM
రైతు పండించిన ధాన్యంలో తాలు ఉంది, తేమశాతం ఎక్కువగా ఉంది, ధాన్యంలో మట్టి పెళ్లలు ఉన్నాయన్న నెపంతో ఇబ్బందికి గురి చేయొద్దని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ జిల్లా కార్యలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
మహబూబ్ నగర్ క్లాక్‌టవర్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రైతు పండించిన ధాన్యంలో తాలు ఉంది, తేమశాతం ఎక్కువగా ఉంది, ధాన్యంలో మట్టి పెళ్లలు ఉన్నాయన్న నెపంతో ఇబ్బందికి గురి చేయొద్దని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ జిల్లా కార్యలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారని, తాలు, తేమ, ఇతరత్ర ఆంక్షలు పెట్టి వారిని ఇబ్బంది పెట్టొదన్నారు. తమ పరిశీలనలో నాణ్యమైన ధాన్యానికి కూడా మిల్లర్లు కొర్రీలు పెడతూ వెనక్కు పంపుతున్నట్లు తెలిసిందన్నారు. ఏయే కేంద్రాలు ఏ మిల్లులకు కేటాయించారో ఆ మిల్లరే నేరుగా వచ్చి ధాన్యం తీసుకెళ్తే ఇబ్బందులు ఉండవన్నారు. తరుగు పేరుతో క్వింటాలుకు రెండున్నర కిలోలు తగ్గించినప్పటికీ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ విషయమై కలెక్టర్లు దృష్టి సారించాలని కోరారు. 500 బోనస్ ఏ ఒక్క రైతుకూ ఇవ్వలేదన్నారు. సన్న, దొడ్డు రకం అన్న తేడా లేకుండా ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మేరకు రైతు పండించిన అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సంచుల కొరత లేకుండా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేశామని, రూ.రెండు లక్షలు రైతు రుణమాఫీ చేశామని సీఎం ఇతర రాష్ట్రాలకు పోయి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మీ 11 నెలల పాలనలో ఏ ఒక్కరికైన కొత్త పింఛన్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. రూ.2,000 పింఛన్ రూ.4,000లకు పెంపు, గృహలక్ష్మి పథకం కింద రూ.ఐదు లక్షలు ఒక్కరికైనా ఇచ్చారా? అని అడిగారు. పాడి రైతులకు బిల్లులు చెల్లించడంలో జాప్యం ఏందుకని అన్నారు. వారు రోడ్డెక్కి ధర్నాలు చేయడం ప్రభుత్వానికి సిగ్గు చేటని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్ మాదిరిగానే వ్యవహరిస్తున్నరని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి నిధుల విషయంలో కేంద్రం ఏనాడూ జాప్యం చేయలేదన్నారు. ఆ పేరుతో నిధులు మళ్లింపు జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అభివృద్ధికి బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. సమావేశంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచెంద్రా రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Nov 11 , 2024 | 11:25 PM