ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గట్టులో పెరుగుతున్న భూదందాలు

ABN, Publish Date - Nov 10 , 2024 | 11:05 PM

గట్టులో రోజురోజుకూ భూ దందాలు పెరిగిపోతున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయం కేంద్రంగా ఈ దందాలు సాగుతుండటం అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గట్టు తహసీల్దార్‌ కార్యాలయం

- కాసులు కురిపిస్తున్న ధరణి దరఖాస్తులు

- తహసీల్దార్‌ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న అక్రమాలు

గట్టు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : గట్టులో రోజురోజుకూ భూ దందాలు పెరిగిపోతున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయం కేంద్రంగా ఈ దందాలు సాగుతుండటం అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గట్టు ఎత్తిపోతలతో పాటు భారత్‌మాల రహదారి రావడంతో ఇక్కడి పొలాలకు భారీగా డిమాండ్‌ పెరగడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. బీడు భూములుగా వదలేసిన పొలాలకు సైతం ఎకరం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ధర పలుకుతుండటంతో దళారులు భూ దందాకు తెరలేపారు. దీంతో ప్రభుత్వ భూములతో పాటు పట్టా భూములు, మఠం భూములు, వలస వెళ్లిన వారి భూములు, ఎండోమెంట్‌ పరిధిలో ఉన్న భూములను గుట్టు చప్పుడు కాకుండా క్రయ విక్రయాలు జరుపుతూ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. నిత్యం కొందరు దళారులు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతూ భూముల లిటికేషన్లు తెలుసుకుంటూ పట్టాదారులకు గాని వారసులకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్న సంఘటనలు గట్టులో వెలుగు చూస్తున్నాయి.

పైరవీ కారులంతా నిత్యం కార్యాలయంలోనే..

వివిధ గ్రామాలకు చెందిన ఫైరవీ కారులంతా కార్యాలయం తెరువకముందే వాలిపోతున్నారు. పని కావల్సిన రైతులు నేరుగా అధికారుల దగ్గరకు వెళ్తే పనులు జరగడం లేదు. అదే ఫైరవీకారులు వెళ్తే చిటికలో పనులు చేసి పెడుతున్నారు. దీంతో ప్రజలు కూడా ఫైరవీకారులను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో వారు రైతులతో అందినకాడికి దండుకుంటున్నారు.

కాసులు కురిపిస్తున్న ధరణి..

ధరణిలో నమోదు కోసం వస్తున్న దరఖాస్తులు అధికారులకు, ఫైరవీకారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మిస్సింగ్‌ సర్వే నంబర్లు, పేర్లు తప్పుగా రావడం, భూములు తక్కువ, ఎక్కువగా నమోదు కావడం, ఒకరి భూమి మరొకరి పేరుపై నమోదు కావడం వంటి వాటిని సరి చేసుకోవడానికి ధరణిలో దరఖాస్తు పెట్టుకోవల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించి ఫైరవీకారులు అందిన కాడికి దండుకుంటున్నారు.

వారసులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్‌

మండల పరిధిలోని పెంచికల పాడు గ్రామంలో సర్వే నంబర్‌ 283/1, 282/1ఏ లోని రెండెకరాల 29 గుంటల భూమిని వృద్ధురాలిని మోసగించి రూ.40 లక్షల విలువ చేసే ఆస్తిని వారసులకు తెలియకుండా ఫైరవీకారులు, అధికారులు కుమ్ముకై గుట్టు చప్పుడు కాకుండా ఇతరులకు రిజిష్ట్రేషన్‌ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అసలైన వారసులు జరిగిన అన్యాయంపై అధికారుల ముందు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.

అన్ని పరిశీలించే రిజిస్ట్రేషన్‌ చేస్తాం..

రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అన్ని సక్రమంగా ఉన్నాయా? లేదా? అన్న విషయాలు పరిశీలించిన అనంతరమే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేస్తాం. పెంచికలపాడు రైతులకు సంబంధించి కూడా అన్ని పరిశీలించే రిజిస్ట్రేషన్‌ చేశాం. ఇందులో ఎలాంటి తప్పు లేదు. కార్యాలయంలోకి ఫైరవీకారులు, దళారులను రానివ్వం. రైతులు నేరుగా వచ్చి తమ పనులు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభుత్వం నిర్ధారించిన రుసుం చెల్లించి ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి.

తహసీల్దార్‌ సరితారాణి

Updated Date - Nov 10 , 2024 | 11:05 PM