ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి..
ABN, Publish Date - Nov 09 , 2024 | 11:04 PM
‘పుట్టింది వ్యవసాయ కుటుంబం. మొదటి నుంచి మా కుటుంబానికి కాంగ్రె్‌సతో అనుబంధం ఉండేది. ప్రజలకు ఏదో రకంగా సేవ చేయాలని మొదటి నుంచీ ఉండేది. న్యాయవాద వృత్తి ద్వారా వచ్చే ఆదాయంతో సేవా కార్యక్రమాలు చేపట్టాను. విద్యా సంబంధిత సాయాలు, దేవాలయాల అభివృద్ధి, వైద్య ఖర్చులు ఇవ్వడం చేసేవాడిని. ఆ సేవా గుణాన్నే ఈ రోజు వరకు కొనసాగిస్తున్నాను.
అందుకే ఉన్నతమైన, ఆదాయం తెచ్చే వృత్తిని వదులుకున్నా
పనితనం చూసే.. డీసీసీ బాధ్యతలు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు
విద్య, వైద్యం, ఉపాధి రంగాల అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నా
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ, ఇంటర్ కాలేజీల ఏర్పాటు
ఇండస్ట్రియల్ కారిడార్, గుడిబండ వద్ద డ్రైపోర్టు ఏర్పాటు లక్ష్యం
దేవరకద్రలో 100, కొత్తకోటలో 50 పడకల ఆస్పత్రులు, జానంపేటలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం
‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి
‘పుట్టింది వ్యవసాయ కుటుంబం. మొదటి నుంచి మా కుటుంబానికి కాంగ్రె్‌సతో అనుబంధం ఉండేది. ప్రజలకు ఏదో రకంగా సేవ చేయాలని మొదటి నుంచీ ఉండేది. న్యాయవాద వృత్తి ద్వారా వచ్చే ఆదాయంతో సేవా కార్యక్రమాలు చేపట్టాను. విద్యా సంబంధిత సాయాలు, దేవాలయాల అభివృద్ధి, వైద్య ఖర్చులు ఇవ్వడం చేసేవాడిని. ఆ సేవా గుణాన్నే ఈ రోజు వరకు కొనసాగిస్తున్నాను. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని ఉన్నతమైన జీవితం, మంచి ఆదాయాన్ని తెచ్చే న్యాయవాద వృత్తిని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరాను. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో.. పోటీ చేసిన మొదటిసారే విజయం సాధించాను. నా ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు ప్రాథమ్యాలుగా ముందుకు సాగుతున్నా’ అని అంటున్నారు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి శనివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
- మహబూబ్‌నగర్, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
కుటుంబ నేపథ్యం.. వృత్తి జీవితం ఎలా ఉండేది?
అమ్మానాన్న పద్మమ్మ, కృష్ణారెడ్డి. నాన్న సర్పంచుగా, సింగిల్ విండో డైరెక్టర్‌గా పని చేశారు. నేను 1999లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన తర్వాత 2006లో సొంతగా ప్రాక్టీస్ ప్రారంభించాను. ఆ వృత్తిలో మంచి సంపాదన, ఉన్నతమైన జీవితం ఉండేది. అక్కడ వచ్చిన డబ్బుల ద్వారా సేవా కార్యక్రమాలు ప్రారంభించాను. నా భార్య కవిత పూర్తిగా మద్దతు ఇచ్చేవారు. రాజకీయాల్లో రావాలని అనుకున్నప్పుడు కూడా ఎలాంటి అడ్డు చెప్పలేదు. కుమారుడు వినయ్ ప్రణీత్‌రెడ్డి అమెరికాలో చదువుతున్నాడు. కుమార్తె హైదరాబాద్‌లోనే చదువుతోంది. 2006లో ప్రాక్టీస్ తర్వాత నుంచే సేవా కార్యక్రమాలు చేసేవాడిని. 2014 వరకు రాజకీయాల ఆలోచనే లేదు. తర్వాత కొంతమంది మిత్రులు సూచించడంతో 2015లో నిర్ణయం తీసుకుని, జీఎంఆర్ సేవా సమితి ప్రారంభిం చాం. కుటుంబ నేపథ్యం కూడా కాంగ్రె్‌సదే కావడం, ఆ ఐడియాలజీ నచ్చి చిన్నారెడ్డి, జైపాల్‌రెడ్డి గారి వద్దకు తీసుకెళ్లారు. వారితోపాటు మిత్రుడు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి ప్రో త్సహించారు.
పార్టీలో తొందరగానే సమున్నత గౌరవం లభించింది కదా?
ఏదైనా మనకు ఇచ్చే టాస్క్‌ను సమర్థవంతంగా చేయడం బట్టి ఉంటుంది. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచనలతో నిత్యం అందుబాటులో ఉండి, అప్పటి ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశాను. మాజీ ఎమ్మెల్యే చేసే ఇసుక, నల్లమట్టి దందాలు, అక్రమ ఆస్తులపై పోరాటం చేశాను. బీఆర్‌ఎస్ హామీలను, వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాం. నిరుద్యోగ జంగ్ సైరన్‌ను 1.50 లక్షల మందితో విజయవంతం చేశాం. అచ్చంపేట నుంచి పాదయాత్ర, భారత్‌జోడో యాత్ర, తుక్కుగూడ, ఇంద్రవెల్లి సభలకు ప్రజలను తరలించాం. ఏ రోజూ డీసీసీ కావాలని అడగలేదు. పనిని గుర్తించి ఆ పదవి ఇచ్చారు. ఎన్నికల్లో పార్టీని సమర్థవంతంగా నడిపించి, హస్తం జెండా ఎగుర వేశాను. ఎమ్మెల్యే టికెట్ కూడా పని గుర్తించే ఇచ్చారు. 2018లో ఆశించినా దక్కలేదు. అయినప్పటికీ.. కష్టపడి పవన్‌కుమారెడ్డి కోసం పనిచేశాను. ఆ గుర్తింపుతో పోటీ చేసి గెలిచాను.
అభివృద్ధిలో మీ ప్రాథమ్యాలు ఎలా ఉన్నాయి?
నేను మొదటి నుంచీ విధ్య, వైద్యం, ఉపాధి, సాగునీరుపై ఎక్కువగా దృష్టి సారించాను. రానున్న రోజుల్లో వాటి లక్ష్యంగానే పని చేసుకుంటూ వెళ్తాను. ప్రతీవారం పనులపై రివ్యూ మీటింగ్స్ జరుగుతాయి. నిత్యం నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నాను. విద్యకు సంబంధించి దేవరకద్రలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయించాను. వచ్చే సంవత్సరం అందుబాటులోకి వస్తుంది. డిగ్రీ కాలేజీ తెప్పించాను. క్లాసులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది సొంత భవన నిర్మాణం పూర్తిచేస్తాం. మండలానికో జూనియర్ కాలేజీ ప్రతిపాదనలు పెట్టాం. సీసీ కుంట కాలేజీకి భవనం మంజూరు చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను సీఎ్‌సఆర్ ఫండ్స్‌తో కల్పిస్తున్నాం. కొత్తకోటలో బాలికల పాఠశాలను మంజూరు చేయిస్తాను. త్వరలో దేవరకద్రకు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కూడా రాబోతోంది. రూ.110 కోట్ల రికార్డు నిధులతో కురుమూర్తి స్వామి గుట్టకు ఎలివేటెడ్ ఘాట్ రోడ్డు నిర్మించబోతున్నాం.
వైద్యరంగ అభివృద్ధి ఎలా ఉండబోతోంది?
ఎన్నికల ముందు దేవరకద్రలో 100 పడకలు, కొత్తకోటలో 30 పడకల ఆస్పత్రికి ఆర్థికశాఖ అనుమతులు లేకుండా జీవోలు తెచ్చారు. కానీ నేను ఆర్థికశాఖ అనుమతితో జీవోలు తెచ్చి.. దేవరకద్రలో 100 పడకల ఆస్పత్రి, కొత్తకోటలో 50 పడకల ఆస్పత్రి ని ర్మించబోతున్నాం. సబ్ సెంటర్ల అప్‌గ్రేడేషన్‌కు ప్రయత్నిస్తున్నాం. మందులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాం. 65 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉన్న దృష్ట్యా జానంపేట వద్ద ట్రామాకేర్ ఏర్పాటు చేయబోతున్నాం.
ఉపాధి రంగంపై ఎలాంటి దృష్టి పెట్టారు?
కేవలం ప్రభుత్వ ఉద్యోగాలనే కాకుండా యువతకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నా యి. జాతీయ రహదారి ఉన్న నేపథ్యంలో ఇండస్ర్టియ ల్ కారిడార్‌ను కోరాం. సీఎం సానుకూలంగా ఉన్నా రు. అలాగే గుడిబండ వద్ద 400 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. రెండు జాతీయ రహదారుల మధ్య ఉండటంతో అక్కడ డ్రైపోర్టు ఏర్పాటు చేస్తే మూడు రాష్ర్టాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఆ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.
ఆయకట్టును ఎలా పెంచబోతున్నారు.. ప్రణాళికలు ఏంటి?
ఇప్పుడు నీరందుతున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే. పీఆర్‌ఎల్‌ఐ(పాలమూరు రంగారెడ్డి) కోసం రూ.28 వేల కోట్లు ఖర్చు చేసిన బీఆర్‌ఎస్.. ఒక్క గుంటకు కూడా నీరివ్వలేదు. కోయిల్‌సాగర్ కింద గతంలో 50 వేల ఎకరాలకు నీరిస్తామని, 10 వేల ఎకరాలకు ఇవ్వలేదు. రైతులను ఒప్పించి గ్రావిటీ కెనాల్స్‌ను పూర్తి చేయడం ద్వారా ఇప్పుడు 12 గ్రామాల్లోని 20 వేల ఎకరాలకు నీరందుతోంది. అజిలాపూర్ లిఫ్టు త్వరలో మంజూరు కాబోతోంది. చౌదర్‌పల్లి లిఫ్టు ద్వారా మన్యంకొండ గుట్టల్లో ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. వీటి ద్వారా 40 వేల ఎకరాలకు నీరందుతుంది. పేరూరును పునఃప్రారంభించాం. వచ్చే వర్షకాలం వరకు లిఫ్టు పనులు పూర్తి చేస్తాం. శంకరసముద్రం ఆర్‌అండ్‌ఆర్ సమస్యపై కలెక్టర్, నేను నివేదిక పంపించాం. త్వరలో సమస్య పరిష్కరించి.. గ్రావిటీ ద్వారా 21 వేల ఎకరాలకు నీరందిస్తాం. కోయిల్‌సాగర్ పనులు ఐవీఆర్‌సీఎల్ కాంట్రాక్టు ఏజెన్సీకి రద్దు చేయించి, వేరే వారికి ఇచ్చాం. దీని ద్వారా 18 వేల ఎకరాలకు నీరందుతుంది. కరివెన కాల్వలకు భూసేకరణ చేయలేదు. ఆ భూసేకరణ చేసి, మిగిలిన పనులు పూర్తి చేస్తాం.
ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎలా ఉంది?
ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది. దేవరకద్రలో 60 వేల కుటుంబాలు ఉంటే 43 వేల కుటుంబాలకు ప్రతినెలా 1.26 కోట్లు ప్రభుత్వం బిల్లు చెల్లిస్తోంది. ఒక్క రుణమాఫీ మా నియోజకవర్గంలో రూ. 197 కోట్లు అయ్యింది. మిగిలిన రుణమాఫీ త్వరలోనే అవుతుంది. రైతు భరోసా కింద కూడా పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది.
Updated Date - Nov 09 , 2024 | 11:04 PM