కంపెనీలు, ఆర్గనైజర్ల దోపిడీని నియంత్రించాలి
ABN, Publish Date - Nov 12 , 2024 | 10:58 PM
విత్తన పత్తి సాగు చేస్తున్న రైతులను అటు కంపెనీలు, ఇటు ఆర్గనైజర్లు దోపిడీ చేయకుండా అధికారులు అడ్డుకట్ట వేయాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్‌కుమార్ కోరారు.
- ఎన్‌హెచ్‌పీఎస్ జిల్లా చైర్మన్ రంజిత్‌కుమార్
గద్వాల టౌన్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : విత్తన పత్తి సాగు చేస్తున్న రైతులను అటు కంపెనీలు, ఇటు ఆర్గనైజర్లు దోపిడీ చేయకుండా అధికారులు అడ్డుకట్ట వేయాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్‌కుమార్ కోరారు. పత్తి విత్తనాలను జీవోటీ ఫలితాలు వెల్లడైన తర్వాతే రైతుల నుంచి మొత్తం సరుకు తీసుకువెళ్లేలా కచ్చితమైన నిబంధన విధించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని పోరాట సమితి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో పండించిన సీడ్ పత్తిని తొలుత శ్యాంపిల్ తీసుకువెళ్లిన అనంతరం జీవోటీ ఫలితాలు వచ్చిన అనంతరమే మొత్తం సరుకు తీసుకువెళ్లే విధానం ఉండగా, ఇటీవల మొత్తం సరుకంతా ముందుగానే తీసుకువెళ్లి జీవోటీ ఫలితాలను తారుమారు చేస్తూ రైతులను ఆర్గనైజర్లు మోసగిస్తున్నారని ఆరోపించారు. రైతుల విత్తనాలు జీవోటీ పరీక్షలో అర్హత సాధించినా వాటిని ఫెయిల్ అయ్యావంటూ రైతులపై రుణభారం మోపగా, అనేకమంది భూములను కోల్పోయారని గుర్తు చేశారు. అదే విధంగా రైతులపై జిన్నింగ్ చార్జిలను మోపుతూ మోసగిస్తున్నారని, కేవలం లింట్ దూదికి మాత్రమే రైతుల నుంచి జిన్నింగ్ చార్జిలు వసూలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, కార్యదర్శి లవన్న, వివిధ మండలాల అధ్యక్షులు విష్ణు, బలరాంనాయుడు, శ్రీనివాస్ యాదవ్, ప్రేమరాజ్, వెంకట్రాములు, దయాకర్ ఉన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 10:58 PM