ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చేయి చేయి కలిపారు..

ABN, Publish Date - Oct 20 , 2024 | 10:59 PM

చిన్నతనంలో అక్షరాలు దిద్ది, విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాల.. జీవిత పాఠాలు నేర్పించి, భవిష్యత్తుకు బాటలు వేసిన కళాశాల అభివృద్ధికి ఏదైనా చేయాలన్న తపన పూర్వ విద్యార్థులను ఏకం చేసింది.

కొల్లాపూర్‌లో ఆర్‌ఐడీ పాఠశాల భవన నిర్మాణం మరమ్మతులు

- విద్యాసంస్థల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల కృషి

- కొల్లాపూర్‌ రాణి ఇందిరాదేవి పేరున విద్యాసంస్థలు

- మౌలిక వసతుల కల్పనకు సిద్ధమైన ప్రణాళిక

- 97 ఏళ్ల క్రితం పాఠశాల, 50 ఏళ్ల క్రితం కళాశాల ఏర్పాటు

- నవంబరులో ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాట్లు

చిన్నతనంలో అక్షరాలు దిద్ది, విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాల.. జీవిత పాఠాలు నేర్పించి, భవిష్యత్తుకు బాటలు వేసిన కళాశాల అభివృద్ధికి ఏదైనా చేయాలన్న తపన పూర్వ విద్యార్థులను ఏకం చేసింది. సురభి సంస్థానాధీశుల కాలంలో రాణి ఇందిరా దేవి పేరున 94 ఏళ్ల కిత్రం ప్రారంభించిన పాఠశాల, 50 ఏళ్ల కిత్రం ఏర్పాటు చేసిన కళాశాలల పునర్నిర్మాణానికి సిద్ధమయ్యారు. స్ఫూర్తిదాయకమైన వారి సంకల్పంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం

- కొల్లాపూర్‌

తాము చదువుకున్న విద్యాసంస్థల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేయిచేయి కలిపారు. అందరూ ఒక్కటై ముందుకు సాగుతున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా, కొల్లాపూర్‌ పట్టణంలో సురభి సంస్థానాధీశుల కాలంలో 1930 సంవత్సరంలో రాణి ఇందిరాదేవి పేరున ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. స్వాతంత్ర్యానంతరం 1970లో ఆమె పేరునే కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ విద్యాసంస్థల్లో చదువుకున్న పలువురు ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. రాష్ట్ర స్థాయి ప్రముఖులుగా, ప్రజాప్రతినిధులుగా, రాజకీయ నాయకులుగా, విద్యావేత్తలుగా, సామాజికవేత్తలుగా, ఉన్నతోద్యోగులుగా దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. వారందరూ తమ పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు, ఆ నాటి రోజులను గుర్తు చేసుకునేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఆర్‌ఐడీ ఉన్నత పాఠశాల పేరున అలుమినీ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. పూర్వ విద్యార్థులతో పాటు, అప్పటి ఉపాధ్యాయులు, అధ్యాపకులను అందులో చేర్చారు.

విద్యాసంస్థల అభివృద్ధికి చర్యలు

తాము చదువుకున్న పాఠశాల గుర్తులు చెదిరిపోవొద్దని పూర్వ విద్యార్థులు సంకల్పించుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఆర్‌ఐడీ పాఠశాల భవనానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తున్నారు. అందుకోసం ఇదే పాఠశాలలో చదువుకొని రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రముఖుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి దాదాపు 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అలాగే మిగిలిన వారందరూ తమ శక్తి మేరకు ఆర్థికసాయం అందిస్తున్నారు. అందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతీ ఒక్కరూ వెయ్యి రూపాయలు చెల్లించి కమిటీలో సభ్యులుగా చేరుతున్నారు. పాఠశాల అభివృద్ధితో పాటు, అవసరమైన మౌలిక వసతులు, కల్పిస్తున్నారు. ఫర్నిచర్‌తో పాటు, కంప్యూటర్లను అందుబాటులోకి తెస్తున్నారు. కార్పొరేట్‌కు దీటుగా పాఠశాలను అభవివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు. అలాగే 50 ఏళ్లు పూర్తి చేసుకున్న జూనియర్‌ కళాశాల అభివృద్ధికి, అవసరమైన వసతులు కల్పించేందుకు వెనుకాడబోమని వారు చెప్తున్నారు. ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తాము చదువులో తొలి అడుగులు వేసిన విద్యాసంస్థలను అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటామని అంటున్నారు.

ఇక్కడ చదువుకొని... ఉన్నత స్థాయికి ఎదిగి...

ఆర్‌ఐడీ ఉన్నత పాఠశాలలో చదువుకున్న వారు ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రముఖులుగా ఉన్నారు. రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పాఠశాలలోనే చదువుకున్నారు. అలాగే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రముఖుడైన మై హోమ్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌ రాంగోపాల్‌రావు, రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ జనరల్‌ సెక్రటరీ మదన్‌మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే దివంగత కటికనేని మధుసూదన్‌రావు కూడా ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. వారితో పాటు మరెందరో విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగులుగా, విద్యావేత్తలుగా, క్రీడాకారులు, కవులు, కళాకారులుగా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. పాఠశాల, కళాశాలల అభివృద్ధికి వారందరూ ముందుకొచ్చారు.

ఆత్మీయ సమ్మేళనానికి భారీ ఏర్పాట్లు

రాణి ఇందిరాదేవి ఉన్నత పాఠశాలను స్థాపించి 94 సంవత్సరాలైంది. ఆర్‌ఐడీ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేసి 50 ఏళ్లు దాటింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు నవంబరు 26, 27, 28వ తేదీల్లో మూడు రోజుల పాటు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అందుకు కొల్లాపూర్‌ పట్టణంలో భారీ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Updated Date - Oct 20 , 2024 | 10:59 PM