బాలికపై ప్రేమోన్మాది వేధింపులు
ABN, Publish Date - Nov 06 , 2024 | 11:30 PM
తన కూతురిపై ఓ ప్రేమోన్మాది వేధింపు లకు తట్టుకోలేక మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచే సుకున్నది.
- నా కూతురి జోలికి రావొద్దన్నా వినలే
- నిశ్చితార్థం జరిగినా వరుడికి ఫోన్‌కాల్‌లో బెదిరింపులు
- ప్రజాప్రతినిధుల సమక్షంలో పంచాయితీ పెట్టినా ఫలితం శూన్యం
- అవమానంతో బాలిక తండ్రి ఆత్మహత్య
గద్వాల క్రైం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : తన కూతురిపై ఓ ప్రేమోన్మాది వేధింపు లకు తట్టుకోలేక మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచే సుకున్నది. ఈ ఘటనకు సంబంధించి స్ధాని కుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గద్వాల పట్టణంలోని తెలుగుపేట కాలనీకి చెందిన ఓ యువకుడు జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన బాలికను కొన్ని రోజులుగా ప్రేమపేరుతో వేధించసాగాడు. అదే క్రమం లో బాలిక పాఠశాలలకు వెళుతున్న సమయంలో కూడా ప్రేమించానంటూ పెళ్లి చేసుకుంటానంటూ వేధిస్తుండటంతో బాధి తురాలు ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంపై బాలిక తండ్రి ఆ యువకుడిని పలుమార్లు మందించినా ఫలి తం లేకుండా పోయింది. దీంతో 10 రోజుల క్రితం ఓ ప్రజాప్రతినిధి, మాజీ కౌన్సిలర్ల సమక్షంలో పంచాయితీని కాలనీలోనే ఏర్పా టు చేశారు. ఆ యువకుడు బాలిక విషయంలోకి రాకుండా చూడాలని చెప్పారు. అయినప్పటికీ ఆ యువకుడి ప్రవర్తనలో మార్పురాకపోగా ఇంకా ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు. ఇక ఆ యువకుడి బాధ ను భరించలేక బాలిక తండ్రి తన తరఫు బంధువుతో మూడు రోజుల క్రితం ఆ బాలికకు నిశ్చితార్థం కూడా చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఓ యువకుడు నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తికి ఈ యువకుడితో పాటు అతని స్నేహితులు ఫోన్‌చేసి బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. దీంతో పాటు నీవు పెళ్లి చేసుకు న్నా ఆ బాలికను వదలబోము అని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని నిశ్చితార్ధం చేసుకున్న వారు బాలిక తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో మనస్తాపం చెందిన ఆయన బుధవారం మధ్యాహ్నం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ యువకుడిని తప్పించే ప్రయత్నం...
అయితే ఓ సామాజిక వర్గానికి చెందిన ఆ యువకుడిని ఓ మాజీ ప్రజాప్రతినిధి ఎలాంటి కేసులు కాకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం తెలిసిన వెంటనే ఆ యువకుడిని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఈ విషయంపై పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ను వివరణ కోరగా రైల్వే పోలీసుల నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు.
Updated Date - Nov 06 , 2024 | 11:30 PM