జోరుగా మైనింగ్ దందా
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:22 PM
మండలంలో ఇసుక, ఎర్రమట్టి దందా జోరుగా సాగుతోంది.
ప్రధాన వాగులు, ప్రభుత్వ గుట్టల నుంచి తరలుతున్న ఇసుక, ఎర్రమట్టి
- పట్టించుకోని మైనింగ్, పోలీసుశాఖ
గట్టు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : మండలంలో ఇసుక, ఎర్రమట్టి దందా జోరుగా సాగుతోంది. ప్రధాన వాగులు, గుట్టలను కేంద్రంగా చేసుకుని ఇసుక మాఫియా తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారు. మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకోకుండా యథేచ్చగా రాత్రీ పగలు తవ్వకాలు జరుపుతున్నా మైనింగ్, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంతో వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిస్తున్నారు. ఈ సారి కురిసిన వర్షాల వల్ల వాగుల్లో భారీ మొత్తంలో ఇసుక నిల్వలు చేరడంతో ఇసుకాసురుల కన్ను వాగులపై పడింది. ఇప్పటికే సగం వాగులను ఖాళీ చేయడంతో తమ బోరు బావుల్లో నీరు ఇంకిపోతుందని చుట్టు పక్కల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తన్నారు.
ప్రధాన వాగులే లక్ష్యం..
ప్రధానంగా లింగాపురం వాగు, గొర్లఖాన్‌దొడ్డి వాగు, చాగదోణ, ఇందువాసి మధ్యన గల పొలిమేర వాగు, చిన్నోనిపల్లి రిజర్వాయర్‌లోని వాగు, ముచ్చోనిపల్లి వాగు, మల్లంపల్లి సమీపంలో ఉన్న వాగులతో పాటు ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి ప్రతీ రోజు ఇసుకను తరలిస్తున్నారు. లింగాపురం నుంచి చిన్నోనిపల్లి, అంతంపల్లి, బోయలగుడ్డం, లింగాపురం, చాగదోణ, మిట్టదొడ్డి, కొత్తపల్లి, మల్లంపల్లి, బల్గెర, ఇందువాసి, తుమ్మలపల్లి, ఛమన్‌ఖాన్‌దొడ్డి, ముచ్చోనిపల్లి, ఆలూరు, రాయపురం, గట్టు పెంచికలపాడు, తప్పెట్లమోర్సు గ్రామాలతో పాటు అయిజ వంటి పట్టణాలకు ఇసుకను తరలిస్తూ ట్రాక్టర్ల యాజమానులు సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రభుత్వ గుట్టలోనే ఎర్రమట్టి తవ్వకాలు
మండలంలో ఎర్రమట్టి గుట్టలు ఉండటంతో మాఫియా కన్ను ఇక్కడి గుట్టలపై పడింది. చిన్నోనిపల్లి పునరావాస కేంద్రం వద్ద గల ప్రభుత్వానికి చెందిన ఎర్రగట్టు, కొత్తపల్లి దగ్గర గల తెల్లతిప్పగట్టు, ఆలూరు దగ్గర రిజర్వ్ ఫారెస్టును ఆనుకొని ఉన్న ఉన్న గుట్టలు, 107 ప్యాకేజీ కాల్వల వెంబడి ఉన్న కాల్వ గట్టు వెంట మట్టిని, ముచ్చోనిపల్లి రిజర్వాయర్‌లోని ముంపు భూముల మట్టిని తవ్వుతూ టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండీ కొడుతున్నా మైనింగ్ శాఖ దృష్టి సారించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Updated Date - Nov 14 , 2024 | 11:22 PM