అందని ఆరోగ్య మిషన్ నిధులు
ABN, Publish Date - Nov 12 , 2024 | 10:59 PM
జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు అందకపోవడంతో ప్రజారోగ్యం కుంటుపడుతోంది.
- అరకొరగా ప్రజారోగ్య సేవలు
- ఇబ్బందులు పడుతున్న రోగులు
అయిజ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు అందకపోవడంతో ప్రజారోగ్యం కుంటుపడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతీ సంవత్సరం వచ్చిన నిధులను ఆరోగ్య శాఖకు కేటాయిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. జిల్లా ఆసుపత్రికి రూ.4.50 లక్షలు, ప్రతీ పీహెచ్‌సీకి రూ.1.75 లక్షలు కేటాయిస్తుండగా, జిల్లాలో 10 పీహెచ్‌సీలు ఉన్నాయి. కాగా, సంవత్సర కాలంగా ఈ నిధులు రావటం లేదు. ఆరోగ్య మిషన్ నిధులతో శిశుమాతృ మరణాల రేటు తగ్గించటం, పారిశుధ్యం మెరగు పరచటం, అంటు వ్యాధుల నివారణ, అసంక్రామిక వ్యాధులపై దృష్టి సారించటం, మలేరియా, డెంగీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం, మరణాల రేటు తగ్గించటం, కుష్టు, క్షయ వ్యాధి నివారణకై పనిచేయటం, పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించటం, సార్వత్రిక వ్యాధి నిరోధక సేవలు అందించటం, వ్యక్తిగత పరిశుభ్రత పెంపొందించటం, కీటక జనిత వ్యాధుల నివారణకై పనిచేయటం, కుటుంబ సంక్షేమం, గర్శిణుల ఆరోగ్యం, బాలింతల సంరక్షణకై పనిచేయాల్సి ఉంది. ఆరోగ్య మిషన్ నిధులు ఏడాదిగా అందని కారణంగా కార్యక్రమాల అమలు అంతంత మాత్రంగానే సాగుతోంది.
కొనసాగని కుటుంబ నియంత్రణ శిబిరాలు
నిధుల లేమి కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగటం లేదు. శిబిరాలు ఏర్పాటు చేయటం లేదు. అసరమైన వసతులు, శస్త్ర చికిత్సలు చేసుకున్న మహిళలకు రూ.800, పురుషులకు రూ.1100 ప్రోత్సాహం కింద అందజేసేవారు. నిధుల లేమి కారణంగా రెండేళ్లుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరాలు జరగటం లేదు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సందర్భంగా మందుల కొనుగోలు కోసం ఒక్కో కేసుకు రూ.1600 ఖర్చు చేసేవారు. భోజనం ఖర్చు రోజు రూ.100 ఖర్చు చేయాల్సి ఉంది. సాధారణ ప్రసవానికి మూడు రోజులు, శస్త్ర చికిత్స జరిగితే ఏడు రోజులు రూ.100 చొప్పున చెల్లించేవారు.
Updated Date - Nov 12 , 2024 | 10:59 PM