అడ్డొస్తున్న అహం.. అందని న్యాయం..
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:23 PM
సీనియర్ పోలీస్ ఆఫీసర్లుగా చెలామణి అవుతున్న కొందరి తీరు పోలీస్ శాఖకు అప్రతిష్ట తెచ్చిపెడుతోంది. బాధితుల కన్నీళ్లకు వారి మనసులు కరగడం లేదు. న్యాయం కోసం ఠాణా మెట్లెక్కినవారిని చెప్పులరిగేలా తిప్పుకోవడం, లేదంటే కౌంటర్ కేసులు పెట్టి బలవంతంగా రాజీ చేయడం, అదీ కుదరకుంటే పెట్టిన కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారుతోంది.
పోలీస్ స్టేషన్‌లలో సమస్య పరిష్కారం కాక ఎస్పీల వద్దకు బాధితులు
ఎస్పీలు మళ్లీ పీఎస్‌లకే అప్పగింత
తమను కాదని బాస్ వద్దకు వెళ్తారా? అని బాధితులపై సీనియర్ పోలీసుల ఆగ్రహం
కౌంటర్ కేసులు పెట్టిస్తున్న కొందరు పోలీసులు
స్టేషన్ చుట్టూ తిరుగుతున్న బాధితులు
ఎస్పీల ఆదేశాలు బుట్టదాఖలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌లను శాసిస్తున్న వైట్ కాలర్
మహబూబ్‌నగర్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సీనియర్ పోలీస్ ఆఫీసర్లుగా చెలామణి అవుతున్న కొందరి తీరు పోలీస్ శాఖకు అప్రతిష్ట తెచ్చిపెడుతోంది. బాధితుల కన్నీళ్లకు వారి మనసులు కరగడం లేదు. న్యాయం కోసం ఠాణా మెట్లెక్కినవారిని చెప్పులరిగేలా తిప్పుకోవడం, లేదంటే కౌంటర్ కేసులు పెట్టి బలవంతంగా రాజీ చేయడం, అదీ కుదరకుంటే పెట్టిన కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారుతోంది. కింది స్టేషన్‌లలో న్యాయం జరుగకపోతే బాస్‌ల దగ్గరికి వెళ్లగా.. మళ్లీ కిందికే పంపాల్సి రావడంతో మమ్మల్ని కాదని ఉన్నతాధికారుల దగ్గరికెళ్తే ఏమీ కాదని కొందరు సీనియర్‌లకు అహం అడ్డొస్తోంది. దాంతో బాధితులకు న్యాయం జరుగకపోగా కొన్ని సందర్భాలలో కౌంటర్ కేసులను ఎదరుర్కోవాల్సి వస్తోంది. పోలీసులతో వచ్చిన పంచాయితీ ఎందుకని కొందరు రాజీ కుదుర్చుకుంటుంటే.. మరికొందరు కోర్టులను, మానవహక్కుల సంఘాలను ఆశ్రయిస్తున్నారు. కింది స్టేషన్‌లలో న్యాయం జరుగకపోతే తమను సంప్రదించాలని ప్రతీ సోమవారం ఆయా జిల్లాల ఎస్పీలు బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. సమస్యలు విని వెంటనే పరిష్కరించాలని ఆయా స్టేషన్‌లకు పంపిస్తున్నా, అవి ఈమేరకు పరిష్కారం అవుతున్నాయో క్రాస్ చెక్ చేసుకోవడం లేదు. దాంతో సోమవారం తీసుకుంటున్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయి. ఒకసారి ఎస్పీలను కలిసిన బాధితులు మళ్లీ వారి దగ్గరికి వెళ్లే సాహసం చేయక, చివరికి వైట్ కాలర్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పలువురు పోలీస్ అధికారులు సివిల్ కేసులపై చూయిస్తున్న ఆసక్తి.. సామాన్యులకు కేసులపై చూపకపోవడం గమనార్హం.
వనపర్తి జిల్లాలోని ఓ సర్కిల్ పరిధిలో స్కీంల పేరుతో పొదుపు చేసిన సొమ్మును కస్టమర్లకు ఇవ్వకుండా ఎగ్టొట్టినందుకు ఓ బాధితుడు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పలుమార్లు పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరుగకపోవడంతో జిల్లా బాస్‌ను కలిశారు. బాస్ సంబంధిత అధికారిని ఆదేశించి, నెల రోజులు దాటినా ఇప్పటికీ సంబంధిత స్టేషన్ అధికారులు కేసులు పెట్టకపోగా, బాధితులెందరున్నారో అందరినీ తీసుకువస్తేనే చర్యలు తీసుకుంటానని చెప్పడంతో బాధితుడు నోరెళ్ళబెట్టాడు. వారిని తీసుకురాలేక, అవసరాల కోసం పోగు చేసుకున్న సొమ్మురాక వేసారుతున్నాడు.
మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ సంస్థలో మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు. .ఈయనను అదే సంస్థలో పనిచేసే కొందరు ఉద్యోగంలోంచి తొలగించే ప్రయత్నం చేయగా, అతను వినకపోవడంతో అందరూ కలిసి కిడ్నాప్ చేశారు. వారి చెర నుంచి తప్పించుకుని వచ్చిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలిసిన కిడ్నాపర్లు ఓ మహిళతో తనను వేధింపులకు గురిచేశాడని కౌంటర్ కేసు పెట్టించారు. ఇరువురిపైనా కేసులు నమోదుకావడంతో ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా కేసును పెండింగ్‌లో ఉంచారు. కిడ్నాప్‌నకు గురైన బాధితుడు తనను కిడ్నాప్ చేసి, హత్యకు ప్లాన్ చేశారని కిందిస్థాయి పోలీస్ అధికారుల చుట్టూ తిరిగి, చివరకు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ నుంచి స్టేషన్‌కు ఫిర్యాదు పంపించి రెండు నెలలవుతున్నా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ మండలానికి చెందిన రైతు తాను కొనుగోలు చేసిన పొలంలో పంట సాగు చేశాడు. దాయాదులు ఇది తమ పొలం అంటూ వేసిన పంటను పాడు చేశారు. దాంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, వదిలేశారు. ఆ తరువాత కూడా దాయాదులు ఆ పొలంలో ఎలాంటి పనులూ చేయకుండా ఆటంకాలు కలిగిస్తున్నారు. ఈ విషయమై బాధిత రైతు పదేపదే పోలీసుల చుట్టూ తిరిగినా చర్యలు లేకపోవడంతో చివరికి ఎస్పీని ఆశ్రయించారు. నెలదాటినా ఇప్పటివరకు కనీసం వారిని పోలీసులు పిలిచి మాట్లాడలేదంటే జిల్లా బాస్‌ల ఆదేశాలను ఏమేర పాటిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది.
పీఎ్‌సలలో న్యాయం జరగకనే ఎస్పీల వద్దకు
బాధితులెవరైనా కింద స్థాయి పోలీస్ స్టేషన్‌లలో న్యాయం జరుగడం లేదని నిర్ధారణకు వచ్చిన తరువాతనే , సర్కిల్ అధికారి, డీఎస్పీ, ఆ తరువాత ఎస్పీలను కలుస్తారు. ప్రతీ సోమవారం ఎస్పీలు ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా సమస్యలను స్వీకరిస్తున్నారు. ఎస్పీలే నేరుగా ఫిర్యాదులు తీసుకుని, సమస్యలు వింటున్నారంటే తమకు తప్పక న్యాయం జరుగుతుందని బాధితులు నమ్ముతారు. అయితే బాస్‌లు బాధితుల సమస్యలను ఓపిగ్గానే వింటున్నారు. వాటి పరిష్కారం కోసం అధికారులకు లిఖితపూర్వక లేదా మౌకిక ఆదేశాలు ఇస్తున్నారు. కానీ.. ఎస్పీల నుంచి మళ్లీ స్టేషన్‌లకే ఆ ఫిర్యాదులు వెళ్తుండటంతో సమస్య ఎక్కడ మొదలైందో మళ్లీ అక్కడికే చేరుతోంది. దాంతో తమను కాదని పైస్థాయి అధికారులను కలుస్తారా? అని కొందరు సీనియర్ పోలీసుల ఇగో హర్ట్ అవుతోంది. అక్కడికి వెళ్లినా మళ్లీ మావద్దకే వచ్చేదంటూ వారు పలు ఫిర్యాదులను పక్కన పెడుతున్నారు. మరికొందరైతే తమ మాట వినలేదంటూ నిందితులనే పిలిచి వారిచేత కౌంటర్ ఫిర్యాదు చేయించి, కౌంటర్ కేసులు పెడుతున్నారు. దీంతో బాధితుడు కాస్త నిందితుడుగా మారుతున్నాడు. అన్ని కేసుల్లో ఇలానే ఉండదు. ఎస్పీలు ఆదేశించిన చాలా కేసులను పలువురు అధికారులు పరిష్కరిస్తున్నా, కొందరు మాత్రం ఇగోకు తీసుకోవడం వల్ల బాధితులకు తిప్పలు తప్పడం లేదు.
ఫిర్యాదులపై బాస్‌లు దృష్టి సారించాలి
తమ వద్దకు వచ్చిన బాధితులందరికీ న్యాయం చేస్తున్నామనే ఎస్పీలు భావిస్తున్నారు. అయితే తమ వద్దకు వచ్చిన ఫిర్యాదులపై కింది స్థాయిలో బాధితులకు ఏమేర న్యాయం జరిగిందో ఫోన్ చేసి, క్రాస్ చెక్ చేసే సిస్టమ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఇదివరకు కొంతమంది అధికారులు కార్యాలయ సిబ్బందిచేత బాధితులకు ఫోన్ చేయించి, మీ ఫిర్యాదు పరిష్కారం అయిందా? అని అడిగి వివరాలు సేకరించేవారు. ఈ రిపోర్ట్‌ను ఎస్పీలకు అందజేసేవారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో అధికారులకు భయం ఉండేది. ఇప్పుడు ఇలాంటి సిస్టమ్ లేకపోవడంతో పోలీస్ స్టేషన్ అధికారుల నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా మారింది. బాధితులు ఒకసారి ఎస్పీలను కలిశాక రెండోసారి మళ్లీ వారిని కలిసేది చాలా తక్కువ. ఎస్పీలను కలిసిన తరువాత కూడా న్యాయం జరుగలేదంటే పోలీస్ వ్యవస్థ ఇంతే అన్న నిర్ణయానికి వచ్చి సర్దుకుపోతుంటారు. కొందరైతే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. అందుకే ఎస్పీలు తమ వద్దకు వచ్చిన ఫిర్యాదులను నెలకోసారి ర్యాండమ్‌గా ఏమేర పరిష్కారం అయ్యాయో ఓ విభాగం ఏర్పాటు చేసి, క్రాస్ చెక్ చేయిస్తే బాధితులకు న్యాయం జరగడంతోపాటు పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది.
Updated Date - Nov 05 , 2024 | 11:23 PM