కాలుష్య కాసారం
ABN, Publish Date - Sep 06 , 2024 | 11:31 PM
నీరు జీవజాతికి ప్రాణాధారం.. ఈ భూమి పై లభించే నీటిలో 0.5శాతం మాత్రమే తాగడానికి పనికి వస్తుందని అధ్యయనాలు చెబుతు న్నాయి.
కృష్ణానది నీటిలో పరిమితికి మించి కొలిఫాం బ్యాక్టీరియా
- 50 ఎంపీఎన్ ఉండాల్సింది 1,400 ఎంపీఎన్‌తో తీవ్రస్థాయిలో..
- దిగువకు వెళ్తున్న కొద్దీ నీరు మరింత కలుషితం
- కొద్దిరోజుల కిందట కేంద్ర జలసంఘం అధ్యయనంలో వెల్లడి
- రెండేళ్ల క్రితం పీసీబీ నివేదికలో 240 ఎంపీఎన్ మాత్రమే..
- తాజాగా తుంగభద్రలో శాంపిళ్లలో భారీగా పెరిగిన శాతం
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నీరు జీవజాతికి ప్రాణాధారం.. ఈ భూమి పై లభించే నీటిలో 0.5శాతం మాత్రమే తాగడానికి పనికి వస్తుందని అధ్యయనాలు చెబుతు న్నాయి. ప్రవాహంలో ఉండే నీరు సాధారణంగా స్వచ్ఛమైన నీటిగా పరిగణిస్తారు. ప్రవాహం వివిధ రకాల నేలల నుంచి వస్తుండటంతో అందులో మినరల్స్ ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం ఉంది. కానీ కొన్నాళ్లుగా నదీ ప్రవాహంలో నీరు కూడా కలుషితమవుతుందని, ప్రధానంగా ఇండియాలో ఈ కాలుష్య స్థాయి తీవ్రంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం నీటి ఆధారంగా నడిచే పరిశ్రమలు నది పరివాహక ప్రాంతాల్లో వెలసి.. కలుషిత నీటిని ప్రవాహంలో వదిలేస్తుండటమేనని తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా రెండు నదులు ఉన్నాయి. కృష్ణా, తుంగభద్ర నదుల ఆధారం గా జలచరాలతోపాటు అనేక రకాల వృక్షసంపద, సామాన్య జీవనానికి తాగునీరు, సాగునీరు అందుతోంది. అలాంటి ఈ రెండు నదుల్లో తీవ్ర స్థాయిలో కలుష్య కారకాలు ఉన్నట్లు నివేదికల్లో తెలుస్తోంది. పరిశ్రమల వ్యర్థాలు కలవడం వల్ల కాపర్, జింక్, కాడ్మియం, నికెల్, క్రోమియం వంటి లోహాల శాతం పెరుగుతోంది. వీటి వల్ల ప్రాణాంతక వ్యాధులు రావడంతో పాటు జలచరాలు, వృక్షసంపదకు కూడా నష్టం వాటిల్లుతోంది. కలుషిత నీటితో సాగుచేసిన మొక్కలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. రెండేళ్ల క్రితం పొల్యుషన్ కంట్రోల్ బోర్డు వివిధ ప్రాంతాల్లో సేకరించిన శాంపిళ్లను పరీక్షించగా.. గద్వాల బ్రిడ్జి ప్రాంతంలో సేకరించిన శాంపిళ్లలో కాలుష్య కారకాలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ సంవత్సరం తుంగభద్ర నదిలో భావపురం వద్ద శాంపిళ్లను కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో సేకరించి పరీక్షించగా.. వాటి తీవ్రత అత్యంత ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది స్థానిక అధికారుల కు, పొల్యుషన్ బోర్డుకు తెలియంది కాకపోయినా.. కాలుష్య కారకాలుగా పరిగణిస్తున్న ఫ్యాక్టరీలపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
తాగు, సాగునీరు కలుషితం..
కృష్ణానది, తుంగభద్ర నదులు ఎగువ రాష్ర్టాల్లో మొదలై.. తెలంగాణ, ఏపీలకు చేరుకుంటాయి. తుంగ భద్ర నది సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలిసి పోతుంది. ఇటు కృష్ణా పరివాహకంతోపాటు తుంగ భద్ర నది నుంచి వస్తున్న నీటిలో వ్యర్థాలు కలవడం ద్వారా నీరంతా కలుషిత మవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. కృష్ణానది నీటితో లక్షలాది ఎకరాల కు తాగునీరు.. లక్షల మందికి తాగునీరు అందుతోంది.. హైదరాబాద్‌కు నీటిని తరలించే ప్రధానమైన పంప్ హౌజ్‌లు కృష్ణానది ఆధారంగానే పనిచేస్తున్నాయి. అలాంటింది కృష్ణానది కలుషితం కావడం.. వాటిని ప్రజలు తాగుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న పలు కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు భారీగా నది లో కలుస్తున్నాయి. లిక్కర్, సబ్బుల ఫ్యాక్టరీలు, అల్క హాల్ ముడిసరుకు తయారయ్యే ఫ్యాక్టరీలు ఈ సరిహద్దుల్లో ఎక్కువగా ఉన్నాయి. పేరుకు కొన్ని ఏపీలో, కొన్ని తెలంగాణలో ఉన్నప్పటికీ కలుషిత వ్యర్థాలన్నీ తుంగభద్రలో కలవాల్సిం దే.. ఈ నదులకు ప్రవా హం తక్కువగా ఉన్న రోజుల్లో పలు ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాలతో నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూ ర్ సోమశిల, మంచాలకట్ట, అమరగిరి వద్ద కృష్ణానది మొత్తం ఆకుపచ్చ రంగులోకి మారుతోంది. సాధార ణంగా కంపెనీల నుంచి వస్తున్న వ్యర్థాలను రీసైక్లింగ్ చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని.. వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను పెట్టాలి. అంత ఖర్చు చేస్తే మిగిలేది తక్కువ ఉంటుందని భావిస్తున్న పలువురు పరిశ్రమ ల నిర్వాహకులు.. నేరుగా సమీపంలో ఉన్న నదుల్లోకి కలుషిత జలాలను వదులుతున్నారు. గతంలో నేరుగా కాలువ ద్వారా వ్యర్థాలను వదలడం వల్ల ఆరోపణలు, విమర్శలు తీవ్రం కావడంతో పరిశ్రమల నిర్వాహకులు అండర్‌గ్రౌండ్‌లో పైప్‌లైన్లు ఏర్పాటు చేసి.. నదీ మధ్య లో ఎక్కడో ఓ చోట వదులు తున్నారు. గతంలో బ్రిడ్జి సమీపంలో పీసీబీ శాంపిళ్లు సేకరించగా.. కొలిఫాం బ్యాక్టీరియా శాతం 50 ఎంపీ ఎన్ కు గాను 240 ఎంపీఎన్ గా నమోదైంది.
1400 ఎంపీఎన్ శాతం..
నీటిలో అసలు కొలిఫాం బ్యాక్టిరియా ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది 50 ఎంపీఎన్ (మోస్ట్ ప్రాపబుల్ నెంబర్)కు దాటకూడదు. కానీ కేంద్ర జలసంఘం తుంగభద్ర నదిలోని భవాపురం వద్ద తీసుకున్న శాంపిళ్లలో 1,400 ఎంపీఎన్ కొలిఫ్యాం బ్యాక్టీరియా నమోదైంది. రెండేళ్ల క్రితం పీసీబీ గద్వాల బ్రిడ్జి సమీపంలో చేసిన శాంపిళ్లలో 240 మాత్రమే నమోదైంది. అంటే తుంగభద్ర నదిలో కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. దిగువకు వెళ్లే కొద్ది ఈ శాతం పెరుగుతోంది. మూసి, తుంగభద్ర నదులు కృష్ణానదిలో కలవడం ద్వారా దిగువన 1,900 వరకు ఎంపీఎన్ నమోదైంది. ఇది చాలా ఆందోళనకరమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు టార్ఫిడిటీ (వ్యర్థాల సాంద్రత) కూడా చాలా ఎక్కువగా ఉంది. టార్ఫిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల నీరు తెట్టల్లాగా పేరుకుపోయి.. రంగు మారుతుంది. సాధారణంగా 1-4 పాయింట్ల వరకు టార్ఫిడిటీ ఉండాలి. తుంగభద్రలో 40శాతం టార్ఫిడిటీ నమోదైంది. డిసాల్వ్‌డ్ ఆక్సీజన్ ( డీఓ) కనీసం 4 మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. తుంగభద్ర వద్ద సేకరించిన శాంపిళ్లలో కేవలం 2.9 మాత్రమే ఉంది. అలాగే బీఓడీ (బయాలాజికల్ ఆక్సీజన్ డిమాండ్) లీటర్ నీటిలో 3 మి.గ్రామలు కంటే తక్కువగా ఉండాలి. బీఓడీ పెరిగితే డీఓ తగ్గుతుంది. దాదాపు కృష్ణా బేసిన్‌లో 13 ప్రాంతాల్లో శాంపిళ్లు సేకరిం చగా.. ఎక్కడ కూడా ఉండాల్సిన స్థాయిలో నాణ్యత లేదని వెల్లడైంది. పరిశ్రమలు, జనసముహాలు చేస్తున్న కాలుష్యాన్ని అరికట్టకపోతే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఉంటాయని నివేదిక తెలియజేస్తోంది.
Updated Date - Sep 06 , 2024 | 11:31 PM