కొనుగోళ్లేవి?
ABN, Publish Date - Nov 12 , 2024 | 11:28 PM
గతేడాది వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడితే.. ఈ ఏడాది దండిగా వర్షాలు కురిసి.. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోడానికి రైతులు అరిగోస పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. పేరుకు ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభిస్తున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు మాత్రం చేపట్టడం లేదు.
ఆశించిన మేర జరగని ధాన్యం సేకరణ
పచ్చి వడ్లను పొలం వద్దే కొంటున్న దళారులు
క్వింటాలుకు రూ.2,000 నుంచి రూ.2,200 మాత్రమే ధర
కర్ణాటకలోని రాయిచూర్ మార్కెట్‌కు తరలుతున్న వడ్లు
దిగుమతుల అగ్రిమెంట్లకు మిల్లర్ల ససేమిరా
ప్రభుత్వం పౌరసరఫరాల పాలసీని మార్చడంతో ఇబ్బందులు
మహబూబ్‌నగర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): గతేడాది వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడితే.. ఈ ఏడాది దండిగా వర్షాలు కురిసి.. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోడానికి రైతులు అరిగోస పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. పేరుకు ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభిస్తున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు మాత్రం చేపట్టడం లేదు. ఫలితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారు. కర్ణాటక సరిహద్దుల్లోని రైతులు రాయిచూర్‌కు తరలిస్తున్నారు. ఈ సీజన్ నుంచి సన్న ధాన్యం సేకరణపై రూ.500 బోనస్ ప్రకటించినప్పటికీ.. అసలు కొనుగోళ్లే చేపట్టకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీన్ని అదునుగా చేసుకున్న దళారులు.. రైతుల పొలం వద్దనే కొనుగోలు చేస్తూ, సన్న ధాన్యానికి రూ.2,000 నుంచి రూ.2,200 వరకు ధర ఇస్తున్నారు. దీనివల్ల రైతులు సన్న ధాన్యంపై ఒక్కో క్వింటాలుకు రూ.600 నుంచి రూ.800 వరకు కోల్పోతుంటే, దొడ్డు రకాలు సాగు చేసిన వారు రూ.200 నుంచి రూ.300 వరకు నష్టపోతున్నారు. కొంతమంది రైతులు రోడ్లపై ఆరబెట్టగా, మరికొందరు సేకరణ కేంద్రాలకు తెచ్చి ఎప్పుడు కొంటారా? అని ఎదురుచూస్తున్నారు.
కర్ణాటకకు తరలుతున్న ధాన్యం
గతంలో నుంచి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న రైతులు ధాన్యాన్ని రాయిచూర్ మార్కెట్‌కు తరలించడం సర్వసాధారణమే. అప్పట్లో ఇక్కడ ఇచ్చే ధర కంటే ఎక్కువ వస్తుండటం, డబ్బులు వెంటనే ఇస్తుండటంతో అమ్మేవారు. కానీ ప్రస్తుతం మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ.. ధాన్యాన్ని కర్ణాటక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంకా పూర్తి స్థాయిలో వరి కోతకు రాలేదు. ముందుగా వేసుకున్న పంట మాత్రమే వస్తోంది. కానీ, అప్పటివరకు కొనుగోలు కేంద్రాల్లో సేకరణ వేగం పెంచకపోతే రైతులు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో అత్యధికంగా వరిసాగులోకి వచ్చింది. దాదాపు 13 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే అందులో సగమైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
పాలసీలో మార్పులే కారణం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం అప్పులు తెచ్చి, సేకరించిన ధాన్యాన్ని ఎలాంటి పూచికత్తు లేకుండా మిల్లర్లకు అప్పగిస్తుంటే.. వారు సమయానికి సీఎంఆర్ అప్పగించడం లేదు. పైగా గోల్‌మాల్ చేస్తున్నారని భావించి, కొన్ని మార్పులు చేసింది. దీని ప్రకారం డీఫాల్ట్ మిల్లులకు జరిమానాలు విధించగా, ధాన్యం కేటాయించే మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. అలాగే మిల్లింగ్ ధరలను కూడా పెంచింది. క్వింటాల్ ధాన్యంపై ఇవ్వాల్సిన బియ్యాన్ని తగ్గించడ లేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైస్‌మిల్లర్లు అగ్రిమెంట్లు చేసుకోవడానికి ఎక్కడా ముందుకు రావడం లేదు. ఉదాహరణకు జోగుళాంబ గద్వాల జిల్లాలో 61 రైస్ మిల్లులు ఉండగా, అందులో 11 మిల్లులు డీఫాల్ట్ కింద ఉన్నాయి. 20 రైస్ మిల్లుల నుంచి సీఎంఆర్ పెండింగ్‌లో ఉంది. 30 మిల్లులకు క్లియరెన్స్ ఉన్నప్పటికీ వాటికి బ్యాంకు గ్యారంటీలు అడుగుతున్నారు. అలాగే సీఎంఆర్ పెండింగ్ ఉన్న 20 మిల్లులకు సెక్యూరిటీ డిపాజిట్‌తోపాటుపాటు 25 శాతం ఫైన్ అడుగుతున్నారు. దీంతో రైస్ మిల్లర్లు ముందుకు రాక, అగ్రిమెంట్లు జరగడం లేదు. ఇక్కడ ఇప్పటివరకు 59 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. నారాయణపేట, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌లో కూడా అగ్రిమెంట్లు కావడం లేదు. అగ్రిమెంట్లు అయితేనే రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే అవకాశం ఉంది. లేకపోతే సేకరించిన ధాన్యం కల్లాల్లోనే మిగిలిపోనుంది.
ఆలస్యం చేస్తే రైతులు ఆగం..
పౌరసరఫరాల పాలసీని మార్చే క్రమంలో ఆ మంత్రిత్వశాఖ ఆలస్యం చేయడమే కొనుగోళ్లలో జాప్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సీజన్ ముంచుకొస్తున్న దశలో పాలసీలో మార్పులు చేయడంతో మిల్లర్లు అందుకు ఒప్పుకోవడానికి చాలా సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ మార్పుల ప్రకారమే నడుచుకుంటుందని తేల్చిచెబుతుండటంతో పాటు బ్యాంకు గ్యారంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు, జరిమానాలపై వెనక్కి తగ్గడం లేదు. ఎలాగూ రైతుల నుంచి ఒత్తిడి వస్తే తమనే పిలిచి ధాన్యం కేటాయిస్తారనే భావనతో మిల్లర్లు కూడా మొండికేస్తున్నారు. అటు దళారుల రంగ ప్రవేశంతో రైతులు మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అధికార వ్యవస్థ మొత్తం సామాజిక ఆర్థిక, రాజకీయ, కుల సర్వేతోపాటు.. ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారిస్తారా? లేదా అనేది వేచిచూడాలి. ఇప్పటికే రైతుబంధు రాకపోవడం, రుణమాఫీ అమలులో నెలకొన్న ఆటంకాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రైతాంగం.. కొనుగోళ్ల అవస్థలతో రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని పలువురు భావిస్తున్నారు.
Updated Date - Nov 12 , 2024 | 11:28 PM