నిలిచిన అభివృద్ధి పనులు
ABN, Publish Date - Nov 23 , 2024 | 11:08 PM
గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై పెను ఆర్థిక భారం పడుతోంది.
అలంపూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై పెను ఆర్థిక భారం పడుతోంది. మండలంలోని ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు రూ.నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అప్పులు తెచ్చి మరీ అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేకాధికారులకు బాధ్యతలు అప్పగించారు. వారు గ్రామాలకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారే తప్ప.. గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. దీనికి తోడు పంచాయతీల్లో ఖజానా లేకపోవడంతో కార్యదర్శులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇటీవల బదిలీపై వెళ్లిన కార్యదర్శులకు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రాకపోవడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. గ్రామాల్లో నిధులు కొరత కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని పలువురు పేర్కొంటున్నారు. దీంతో మురుగు కాల్వలో చెత్తాచెదారం పెరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు మెడికల్ లీవ్‌పై వెళ్లడంతో ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శుల మెడకు ఆర్థిక ఉచ్చు బిగిసుకుంటుంది. ఇప్పటికే లక్షల కొద్ది అప్పులు తెచ్చి గ్రామాలకు ఖర్చు పెట్టామని, ఇక నుంచి ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నామని పలువురు కార్యదర్శులు మనోవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తేనే మాపై ఆర్థిక భారం తగ్గుందని తెలిపారు.
Updated Date - Nov 23 , 2024 | 11:08 PM