నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:23 PM
విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేష్ అన్నారు.
- విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేష్
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, నవంబరు (ఆంధ్రజ్యోతి) 29 : విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎదిర, ఏనుగొండలో గల అర్బన్ కేజీబీవీ, తిరుమల హిల్స్‌లోగల గిరిజర గురుకుల డిగ్రీ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ రోజ ఉపాధ్యాయులు అల్పాహరం, భోజనాన్ని రుచి చూశాకే విద్యార్థులకు ఇవ్వాలన్నారు. ఏమైన సమస్యలు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. వంట గదితో పాటు కూరగాయలు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. తాజా కూరగాయలే వండాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి బైకాని బాలుయాదవ్ ఉన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
దేవరకద్ర : మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీడీవో శ్రీనివాస్‌రావు సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ బాలుర 2ను ఎంఈవో బాలరాంతో కలిసి పరిశీలించారు. పాఠశాలకు సరఫరా అవుతున్న బియ్యం, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Updated Date - Nov 29 , 2024 | 11:23 PM