ఆ టేస్టే వేరు
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:41 PM
తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రతీది ఓ ప్రత్యేకం.
- కురుమూర్తి జాతరలో కాల్చిన మటన్ ప్రత్యేకం
- స్పెషల్ మసాలా కలపడమే అందుకు కారణం
- అమరచిత ఆరెకటికల ప్రత్యేక తయారీ
అమరచింత, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రతీది ఓ ప్రత్యేకం. ఉత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులు గుట్ట మీదున్న కాంచన గుహలో కొలువు దీరిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని కిందికి దిగగానే వారికి గుర్తుకొచ్చేది కాల్చిన మటన్. జాతర సందర్భంగా ఇక్కడ ప్రత్యేక మటన్ దుకాణాలు ఏర్పాటవుతాయి. వాటిలో కాల్చిన మటన్ తినేందుకు రాష్ట్రం నుంచే కాక పొరుగునున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారు కూడా ఇష్టపడతారు. కాల్చిన మటన్, మటన్ ఫ్రై ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఎక్కడా లేనంత ప్రత్యేక రుచికరమైన మటన్ ఇక్కడే లభిస్తుంది. అందులో కలిపే ప్రత్యేక మసాలా వల్లే కాల్చిన మటన్‌కు ప్రత్యేక రుచి వస్తుంది.
50 రోజుల ముందే మసాలా తయారీ
కురుమూర్తి జాతరలో కాల్చిన మటన్‌కు తయారీకి వినియోగించే మసాలా తయారీ కూడా ఒక ప్రత్యేకం జాతరలో మటన్ దుకాణాలను తరతరాలుగా అమరచింత ఆరెకటిక కులస్తులే ఏర్పాటు చేస్తున్నారు. మటన్‌లో కలిపే మసాలా తయారీని వారు దసరా నవరాత్రుల అనంతరం నిష్ఠతో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభిస్తారు. దుకాణం ఏర్పాటు చేసే ప్రతీ వ్యాపారి జాతర నెల రోజుల్లో 100 యాటలు (జీవాలను) కోస్తారు. అందుకోసం 150 కిలోల మసాలాను సిద్ధం చేసుకుంటారు. అందుకోసం కారం 35 కిలోలు, అల్లం 30 కిలోలు, ఎల్లిపాయలు 30 కిలోలు, లవంగాలు, యాలకులు షాజీరా, చెంకా, మిరియాలు, తోక మిరియాలు కిలో చొప్పున అవసరం అవుతాయి. అలాగే రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ, బొప్పాయి పూత ఇలా 15 రకాల వస్తువులను మెత్తగా దంచాల్సి ఉంటుంది. ఇలా 15 రకాల దినుసులను కలిపి తయారు చేసిన 150 కిలోల ప్రత్యేక మసాలాను 50 రోజుల వరకు నిల్వ ఉంచుతారు. దీంతో అది మరింత ఘాటుగా మారుతుంది. ఈ మసాలను మటన్ దట్టించి కాల్చుతారు. దీంతో అది ప్రత్యేక రుచిని సంతరించుకుంటుంది.
మసాలాతోనే ప్రత్యేక రుచి
రఘురాం, అమరచింత : కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో మటన్ దుకాణాలను ఏర్పాటు చేయడం అనాదిగా వస్తోంది. ఇందుకోసం కుటుంబ సభ్యులందరం నిష్ఠగా పూజలు చేసి మసాలాను తయారు చేస్తాం. అందుకోసం నాణ్యమైన 15 రకాల దినుసులను వినియోగిస్తాం. ఇలా సిద్ధం చేసుకున్న మసాలాను మటన్‌లో కలిపి కాల్చడం వల్లే అది మరింత రుచికరంగా మారుతుంది.
Updated Date - Nov 05 , 2024 | 11:41 PM