విద్యాభివృద్ధికి కృషి చేస్తా
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:25 PM
నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం కోసం కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు.
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
బాలానగర్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం కోసం కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులందరికీ షూలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అందజేస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో విద్యార్థుల బాధలను గమనించి షూస్ ఇస్తున్నానని వివరించారు. రూ.70 కోట్లు నిధులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయిస్తానన్నారు. పాఠశాల సమయం అయిపోయిన తరువాత విద్యార్థుల కోసం ప్రధాన కూడలి వద్ద ఒక కానిస్టేబ్‌లును పెట్టాలని ఆదేశించారు. రోడ్డు పనులు పూర్తి అయిన తరువాత ఆర్టీసీ బస్సులను వేయిస్తానని హామీ ఇచ్చారు. రాజాపూర్ మండలానికి ఇంటర్ కళాశాల మంజూరైందని, విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా రాణించాలన్నారు. బాలికల ఉన్నత పాఠశాలకు విద్యార్థుల కోరిక మేరకు గ్రౌండ్ లెవల్, కంపౌండ్ వాల్ మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు.
Updated Date - Dec 02 , 2024 | 11:25 PM