వంతెన.. ఇంతేనా..!?
ABN, Publish Date - Aug 20 , 2024 | 11:57 PM
వర్షానికి కొట్టుకపోయిన మట్టి వర్షాకాలం వచ్చిందంటే తప్పని తిప్పలు మరమ్మతులు చేయించాలని వేడుకోలు
వర్గల్, ఆగస్టు 20: వర్షకాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామానికి వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. ఉన్న ఒక్క మార్గం వర్షంతో ఉంటుందా కొట్టుకుపోతుందా తెలియని దుస్థితి, ఆ మార్గంలో వంతెన నిర్మించాలని పలుమార్లు ప్రజలు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఎదో తూతూ మంత్రంగా తాత్కలివంగా మార్గాని సరిచేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు. మండలంలోని దండుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చందాపూర్ గ్రామంలో సుమారు 20 కుటుంబాలు ఉంటున్నాయి. ఆ గ్రామానికి వెళ్లాలంటే బోర్రగూడెం నుంచి మట్టి రోడ్డు ద్వారా వెళ్లాలి. బోర్రగూడెం చందాపూర్ మార్గంలో కాలువ ఉండడంతో ఆ కాలువలో సిమెంట్ పైపులను వేసి వాటిపై మట్టిని పోశారు. వర్షం పడినప్పుడల్లా కాలువపై వేసిన మట్టి కొట్టుకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామ ప్రజలది ప్రతీ వర్షాకాలంలో ఇదే పరిస్థితి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మరోసారి బోర్రగూడెం చందాపూర్ గ్రామాల నడుమ ఉన్న మార్గంలో వేసిన మట్టి వరదకు కొట్టుకపోయింది. కాలువపై వేసిన పైపులు చెల్ల చెదురైయ్యాయి. దీంతో చందాపూర్ గ్రామానికి వెల్లలేని దుస్థి. గత ప్రభుత్వం బోర్రగూడెం చందాపూర్ మార్గంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు అయినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని స్థానికులు చెబుతున్నారు. గతంలో రెండు మూడు సార్లు సొంత డబ్బులతో కాలువ వద్ద మట్టి పోయించి మార్గాని సరి చేసుకున్నామని గ్రామస్థులు తెలిపారు. వర్షకాలం వచ్చిందంటే ఆ గ్రామం ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు మట్టి వరద నీటిలో కొట్టుకపోయింది. మరమ్మతులు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Updated Date - Aug 21 , 2024 | 07:28 AM