అటకెక్కిన తడి, పొడి చెత్త సేకరణ
ABN, Publish Date - Aug 20 , 2024 | 11:55 PM
కంది, ఆగస్టు 20: సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన కంది గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణ అటకెక్కింది.
అసైన్డ్‌భూమిలో చెత్త డంపింగ్
అంటురోగాలకు అడ్డాగా మారిన వైనం
ఆస్పత్రుల చుట్టూ పరుగులు
అలంకారప్రాయంగా డంపింగ్‌యార్డులు
విజృంభిస్తున్న దోమలు, క్రిమి, కీటకాలు
కంది, ఆగస్టు 20: సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన కంది గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణ అటకెక్కింది. చెత్త సేకరణ రిక్షాలను మూలనపడేశారు. తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుల్లో వేరుచేసి ఎరువులు తయారు చేయాలని గతంలో చెప్పిన అధికారుల మాటలు నీటి మూటలయ్యాయి. పంచాయతీ ట్రాక్టర్‌తో సేకరించిన చెత్తను తీసుకెళ్లి గ్రామ శివారులోని అసైన్డ్‌భూమిలో ఇష్టారాజ్యంగా పారబోస్తున్నారు. అంతేగాక కందిలోని హోటళ్లు, దాబాల్లో మిగిలిన ఆహార వ్యర్థాలను డంపింగ్‌యార్డు పక్కనే పారబోస్తున్నా.. పంచాయతీ అధికారులకు నిమ్మకు నీరెత్తడం లేదు. సీజనల్ వ్యాధులపై ఉన్నతాధికారులు గంటల తరబడి సమావేశాలు పెట్టి పంచాయతీ అధికారులను ఆదేశిస్తున్నా.. వీరు మాత్రం ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి శ్రద్ధ చూపటం లేదని స్పష్టమవుతున్నది. మరోపక్క పరిశుభ్రత విషయంలో ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని తెలుస్తున్నది. ఇందుకు కారణం ఉన్నతాధికారులు గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడమే అని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మంగళవారం కంది పీహెచ్‌సీ విషజ్వరాలు సీజనల్ వ్యాధులతో కిక్కిరిసిపోయారు.
ఆరు బయటనే వ్యర్థాల పారబోత
కందిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పక్కన ఉన్న డంపింగ్‌యార్డు ఉన్నది. అయితే దాంట్లో కాకుండా పక్కన ఆరు బయటనే ప్లాస్టిక్ డబ్బాలు, డ్రమ్ముల్లో తీసుకొచ్చి ఆహార వ్యర్థాలను పారబోస్తున్నారు. ఆహార వ్యర్థాలు ఎక్కువగా ఉంటే ఆ పక్కనే మట్టితో కప్పెట్టేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భరించలేని దుర్గంధం వెదజల్లుతున్నది. ఆహార వ్యర్థాలు ఉంచిన డబ్బాలపైన ఎలాంటి మూతలు లేకపోవడం, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేదలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు.
అసైన్డ్‌భూమిలో చెత్త
కంది గ్రామంలో సేకరించిన చెత్తను ఇప్పటికీ కంది శివారులోని అసైన్డ్ భూమిలో పారబోస్తున్నారు. ఆ చెత్తంతా ప్లాస్టిక్ కవర్లతో నిండి ఓ గుట్టలాగా కనిపిస్తున్నది. ఇలా పెద్ద కుప్పలాగా అయిన చెత్తను నెలరోజులకు ఒకసారి తగలబెడుతున్నారు. అసైన్డ్ భూమి పక్కనే, రిజిస్ట్రేషన్ కార్యాలయం, మైనార్టీ గురుకుల పాఠశాల కూడా ఉన్నది. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, చెత్తను ఇక్కడ పారబోయొద్దని ఉపాధ్యాయులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం శూన్యం.
నిరుపయోగంగా డంపింగ్‌యార్డు
నాలుగేళ్ల క్రితం దాదాపు రూ.రెండున్నర లక్షలతో నిర్మించిన డంపింగ్‌యార్డు ఇప్పుడు నిరుపయోగంగా మారింది. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తతో ఎరువులు తయారు చేయాలని ఆదేశించిన ఉన్నతాధికారుల మాటలు ఆచరణలో అమలుకావడం లేదు. ఇప్పటివరకు ఒక్కరోజు కూడా చెత్తను ఉపయోగించి ఎరువును తయారు చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఇప్పుడు డంపింగ్‌యార్డు చుట్టూ చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో నిండి వీధి కుక్కలకు అడ్డాగా మారింది.
సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం..
పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది కొరత, ఇతరత్రా సమస్యలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు రోజువారీగా వివరాలను ఉన్నతాధికారులకు చెబుతున్నాం. ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యమందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అత్యవసర మనిపిస్తేనే హైదరాబాద్, బీదర్ తదితర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన సేవలందించేలా కృషి చేస్తున్నాం. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
- డాక్టర్ శ్రీధర్, ఆస్పత్రి సూపరింటెండెంట్
Updated Date - Aug 20 , 2024 | 11:55 PM