పారిశుధ్య నిర్వహణపై డీఎల్‌పీవో ఆగ్రహం
ABN, Publish Date - Aug 21 , 2024 | 11:38 PM
కంది, ఆగస్టు 21: ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురితమైన ‘అటకెక్కిన తడి,పొడి చెత్త సేకరణ’ అనే కథనానికి సంగారెడ్డి డీఎల్పీవో అనిత స్పందించారు.
కంది పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు
వారంరోజుల్లో మార్పు కనపడకపోతే చర్యలు
కంది, ఆగస్టు 21: ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురితమైన ‘అటకెక్కిన తడి,పొడి చెత్త సేకరణ’ అనే కథనానికి సంగారెడ్డి డీఎల్పీవో అనిత స్పందించారు. కందిలోని డంపింగ్‌యార్డును, అసైన్డ్ భూమిలో పారబోస్తున్న చెత్తను ఎంపీవో మహేందర్‌రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. డంపింగ్‌యార్డు వద్ద తడి, పొడి చెత్తలను వేరుచేయడం లేదని గుర్తించారు. డంపింగ్‌యార్డులో ఎరువు తయారుచేసిన దాఖలాలు లేవని ఆమె గమనించారు. తడి చెత్తతో ఎరువు తయారు చేయడంలో, ప్లాస్టిక్ కవర్లను నిషేధించడంతో పాటు పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేదని కంది పంచాయతీ కార్యదర్శి విద్యాధర్‌కు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ కంది గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణ జరగడం లేదన్నారు. డంపింగ్‌యార్డు పరిసరాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. పారిశుధ్య నిర్వహణలో లోపం కొట్టొచ్చినట్టు కనపడుతుందన్నారు. తాను మరో వారంరోజుల్లో కందిని సందర్శిస్తానని, పారిశుధ్య నిర్వహణలో మార్పు కనపడకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి విద్యాధర్‌ను డీఎల్పీవో హెచ్చరించారు.
Updated Date - Aug 21 , 2024 | 11:38 PM