మృతిచెంది మూడునెలలైనా న్యాయం జరగట్లేదు
ABN, Publish Date - Aug 31 , 2024 | 11:41 PM
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 31: తమ తల్లి మృతిచెంది మూడునెలలైనా.. తమకు న్యాయం చేయడం లేదని కుటుంబీకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళనకు దిగారు.
ఉద్యోగం ఇవ్వడం లేదంటూ ‘మున్సిపల్’ ఎదుట ఆందోళన
తల్లి ఫొటోతో బైఠాయించిన కుటుంబీకులు
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 31: తమ తల్లి మృతిచెంది మూడునెలలైనా.. తమకు న్యాయం చేయడం లేదని కుటుంబీకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. ఓవైపు మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరుగుతుండగా కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. మెదక్ పట్టణానికి చెందిన అయితారం దుర్గమ్మ మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తూ మే నెలలో మృతిచెందిందని కుమారులు ప్రభాకర్, గణేష్ తెలిపారు. అనంతరం తమకు రావాల్సిన ప్రయోజనాలు రాలేదని, ఈ విషయంలో మున్సిపల్ అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. కార్యాలయంలో సంప్రదిస్తే స్పందన లేదని, నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి మృతి అనంతరం ప్రయోజనాలతో పాటు ఉద్యోగం పెద్ద కుమారుడు ప్రభాకర్‌కు ఇవ్వాలని కుటుంబసభ్యులు రాసి ఇచ్చినా.. చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఏమన్నంటే కలెక్టర్ కార్యాలయానికి లేఖ రాశామని.. అక్కడ చూసుకోవాలని ఓ అధికారి అలసత్వ సమాధానమిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మృతికి ముందు అనారోగ్యానికి గురవడంతో సుమారు రూ.6 లక్షలు ఖర్చు చేశామని.. అందుకు సంబంధించి కాగితాలు ఇవ్వడం లేదని, ప్రశ్నిస్తే మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని అధికారులు దుర్భాషలాడుతున్నారని వాపోయారు.
తమ వద్ద పెండింగ్ లేదు
అయితారం దుర్గమ్మ మృతి అనంతరం కుటుంబీకులకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో అన్ని చర్యలు తీసుకున్నామని కమిషనర్ జానకీరాంసాగర్ తెలిపారు. ఇప్పటికే కొన్ని ఫైళ్లు ఖజనా కార్యాలయానికి, మరికొన్ని ఫైళ్లు కలెక్టర్ కార్యాలయానికి పంపడం జరిగిందన్నారు. వీటిపై అదనపు కలెక్టర్ సంతకాలు కూడా పూర్తయ్యాయని వివరించారు. అనవసరంగా మృతురాలి కుటుంబీకులు ప్రతిరోజు మున్సిపల్ సిబ్బందితో దుర్భాషలాడుతున్నారని కమిషనర్ తెలిపారు. తమ వద్ద వారికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఎటువంటి పెండింగ్ ఫైళ్లు లేకపోగా, వాటి కోసం తమ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని వివరణ ఇచ్చారు.
Updated Date - Aug 31 , 2024 | 11:41 PM