వైభవంగా గోకులాష్టమి
ABN, Publish Date - Aug 27 , 2024 | 11:07 PM
వర్గల్, ఆగస్టు 27: వర్గల్ మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో గోకులాష్టమి వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు.
రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామికి విశేష పంచామృతాభిషేకాలు, లక్ష పుష్పార్చన
వర్గల్, ఆగస్టు 27: వర్గల్ మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో గోకులాష్టమి వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితుడు వేదాంతం మురళీధరచార్యుల నేతృత్వంలో ఉదయం రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వద్ద భగవద్గీత పారాయణం, విష్ణుసహస్రనామ పారాయణం, ఆరాధన, బాలభోగంతో పాటు తదితర పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ యాగశాలలో సుదర్శన హవనం, పూర్ణాహుతి చేశారు. వేడుకల సందర్భంగా ఆలయ మండపలంలో లక్ష పుష్పార్చనతో పాటు వివిధరకాల పండ్ల రసాలతో కూడిన పంచామృతంతో శత కలశాభిషేకం చేశారు. ప్రత్యేక పర్వదినం సందర్భంగా దేవతామూర్తులకు 51 రకాల స్వీట్లతో నివేదన సమర్పించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ నిర్వాహకులు ప్రొద్దటూరి రాజులుగుప్తా, గజ్వేల్ మాజీ ఏఎంసీ చైర్మన్ టేకులపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వేడుకల అనంతరం వేణుగోపాలస్వామివారిని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతాజ్ఞాన భజనమండలి సభ్యులతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యమైంది.
Updated Date - Aug 27 , 2024 | 11:07 PM