జంతువులను హింసిస్తే కఠిన చర్యలు
ABN, Publish Date - Aug 16 , 2024 | 11:11 PM
సంగారెడ్డి టౌన్, ఆగస్టు 16: జంతువులను హింసిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు.
జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
సంగారెడ్డి టౌన్, ఆగస్టు 16: జంతువులను హింసిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ జంతువుల పట్ల ప్రేమతో ఉండాలన్నారు. మూగ జీవులను హింసించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అక్కడక్కడ కుక్కల బెడద ఉందని, వాటి సంఖ్యను తగ్గించడానికి యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) వంటి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకోసం జిల్లాలో కుక్కల సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 43,751, మున్సిపాలిటీల్లో 17,770 కుక్కలను గుర్తించినట్లు తెలిపారు. వీటిని ఏసీబీ కేంద్రాలకు తరలిస్తామన్నారు. ఇంట్లో చెత్తను మున్సిపాలిటీ వాహనాల్లోనే వేయాలని, బయట పారేయకూడదని, అలా చేస్తే కుక్కలు చెత్త వేసిన ప్రాంతాల్లో చేరతాయన్నారు. వాటి ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. దాబా, హోటళ్లు, మాంసం దుకాణాల యపమానులు చెత్తను రోడ్ల పక్కన వేయకూడదని సూచించారు. కుక్కలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని, చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు తోడు తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో పశు సంవర్ధకశాఖ జేడీ వసంతకుమారి, డీఈవో వెంకటేశ్వర్లు, డాక్టర్లు రవీందర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 16 , 2024 | 11:11 PM