నేనంటే నేను..!
ABN, Publish Date - Aug 13 , 2024 | 11:53 PM
ఈనెల 12 సోమవారం రోజున జిల్లా ఇంటర్ విద్యాధికారి హోదాలో రవీందర్‌రెడ్డి సిద్దిపేటలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి అక్కడి ప్రిన్సిపాల్, అధ్యాపకులతో మాట్లాడారు.
జిల్లాలో ఇద్దరు ఇంటర్ విద్యాధికారులు
ఒకరికి డైరెక్టర్.. ఇంకొకరికి కోర్టు ఉత్తర్వులు
ఇద్దరి నడుమ ‘కుర్చీ’ పంచాయితీ
జూనియర్ కాలేజీల్లోనూ వేర్వేరుగా తనిఖీలు
తలలు పట్టుకుంటున్న ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు
ఇంతకూ జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎవరో?
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఆగస్టు 8 : ఈనెల 12 సోమవారం రోజున జిల్లా ఇంటర్ విద్యాధికారి హోదాలో రవీందర్‌రెడ్డి సిద్దిపేటలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి అక్కడి ప్రిన్సిపాల్, అధ్యాపకులతో మాట్లాడారు.
13 మంగళవారం రోజున జిల్లా ఇంటర్ విద్యాధికారి హోదాలోనే హిమబిందు దుబ్బాకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులతో సమీక్షించారు.’
హోదా ఒక్కటే.. కానీ అధికారులు ఇద్దరు. ఈ విచిత్రమైన పరిస్థితి సిద్దిపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. (డీఐఈవో) జిల్లా ఇంటర్ విద్యాధికారి హోదాలో ఎవరికి వారు తనిఖీలు చేస్తుండడంతో కళాశాలల ప్రిన్సిపాళ్లు తలలు పట్టుకుంటున్నారు.
సవాల్‌గా ‘డీఐఈవో కుర్చీ’
సిద్దిపేట జిల్లా ఇంటర్ విద్యాధికారిగా పనిచేసిన సూర్యప్రకాశ్‌రావు జూన్ 30న ఉద్యోగ విరమణ పొందారు. అప్పుడు జిల్లాలోని బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న హిమబిందును సీనియర్‌గా భావించి జూలై 1న డీఐఈవోగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ప్రిన్సిపాళ్ల బదిలీలు జరిగాయి. హిమబిందు బెజ్జంకి నుంచి సిద్దిపేట బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు. అప్పటి వరకు డీఐఈవోగా ఆమెనే కొనసాగారు. కరీంనగర్ నుండి కోహెడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీపై వచ్చిన రవీందర్‌రెడ్డి సీనియారిటీ జాబితాలో ముందున్నారని ఆయనకు డీఐఈవోగా ఇన్‌చార్జి బాధ్యతలు కల్పిస్తూ ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 6న ఉత్తర్వులు రాగా 8న ఆయన డీఐఈవోగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఉత్తర్వులను సవరించాలని అప్పటిదాకా ఇన్‌చార్జి డీఐఈవోగా కొనసాగుతున్న హిమబిందు కోర్టును ఆశ్రయించారు. తననే డీఐఈవోగా కొనసాగించాలని విన్నవించడంతో కోర్టు నుంచి ఆమెకు ‘స్టేటస్ కో’ ఉత్తర్వులు వచ్చాయి.
ఇటు ఆఫీసుకు.. అటు తనిఖీలకు
ఇంటర్మీడియట్ డైరెక్టర్ ఉత్తర్వుల ఆధారంగా రవీందర్‌రెడ్డి, కోర్టు ఉత్తర్వులతో హిమబిందు ఎవరికి వారే డీఐఈవోగా కొనసాగడం ఆ రంగంలోని వారికి సంకట పరిస్థితిని తెచ్చిపెడుతోంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించానని ఇటు రవీందర్‌రెడ్డి.. జూలై నుంచి ఇలాగే కొనసాగుతున్నానని హిమబిందు ఇద్దరూ అదే హోదాతో పిలిపించుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. రవీందర్‌రెడ్డి డీఐఈవో కార్యాలయంలోని కుర్చీలో కూర్చుంటుండగా.. హిమబిందు అదే కార్యాలయంలోని మరో కుర్చీలో ఎదురుగా కూర్చుంటున్నట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల తనిఖీల సందర్భాల్లోనూ ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు సైతం మిన్నకుండిపోతున్నారు. ఇద్దరికీ వేర్వేరు ఉత్తర్వులు ఉండడం.. వాటిపై ఇంటర్ విద్యకు సంబంధించిన ఉన్నతాధికారులు సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో వారు కూడా తనిఖీలకు సహకరిస్తున్నారు.
తుది నిర్ణయం ఎవరి వైపో?
హిమబిందు కోర్టు ను ఆశ్రయించడంతో సదరు స్టేటస్ కో ఉత్తర్వులను ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంటర్మీడియట్ డైరెక్టర్‌తో పాటు రవీందర్‌రెడ్డికి చేరవేశారు. దీనిపై నేడు తుది తీ ర్పు వెలువడనున్న ది. తాను స్థానికంగా ఉన్న కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నానని, డీఐఈవోగా పనిచేసిన అనుభవం ఉందని, తనకే అనుకూల తీర్పు వస్తుందనే ధీమాతో హిమబిందు ఉన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని 14 జిల్లాలకు సీనియర్ ప్రిన్సిపాళ్లను డీఐఈవో ఇన్‌చార్జులుగా నియమిస్తూ ఇంటర్ విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు, సీనియారిటీ దృష్ట్యా తానే కొనసాగుతానని రవీందర్‌రెడ్డి భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం గురించి ఆ శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ఈ ఇద్దరి కుర్చీ పంచాయితీకి ఎలాంటి ముగింపు పలుకుతారో వేచిచూడాలి.
Updated Date - Aug 13 , 2024 | 11:53 PM