బతుకుదెరువు కోసం వెళ్తే.. చిన్నారిని చిదిమేసిన వీధి కుక్కలు
ABN, Publish Date - Jul 17 , 2024 | 11:28 PM
మిరుదొడ్డి, జులై17: బతుకుదెరువు కోసం నగరానికి వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. పుట్టిన గ్రామాన్ని విడిచి పని వెతుక్కుంటూ మహానగరానికి వెళ్లిన కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది.
కుటుంబంలో విషాదం
మిరుదొడ్డి, జులై17: బతుకుదెరువు కోసం నగరానికి వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. పుట్టిన గ్రామాన్ని విడిచి పని వెతుక్కుంటూ మహానగరానికి వెళ్లిన కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. ముక్కు పచ్చలారని పసికందును వీధి కుక్కలు తీవ్రంగా గాయపరిచి పొట్టనపెట్టుకున్నాయి. తల్లి ఒడిలో హాయిగా నిద్రించాల్సిన చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు గొండెలవిసేలా రోదించారు. తమ బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు నీరుగారిపోయాయి. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో కుక్కకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన నిహాన్ (18నెలలు) అంత్యక్రియలు బుధవారం మిరుదొడ్డిలో ముగిశాయి. మిరుదొడ్డి పట్టణానికి చెందిన వెంకటలక్ష్మి, భరత్‌లు బతుకు దెరువు కోసం నెల క్రితమే జవహర్‌నగర్ వలస వెళ్లారు. ఇంటి బయట ఆడుకుంటున్న వారి కుమారుడు నిహాన్‌ను మంగళవారం వీధికుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిలో గాయాలపాలై, చికిత్స పొందుతున్న నిహాన్ అదే రోజు రాత్రి మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని మిరుదొడ్డికి తీసుకుని వచ్చి అంత్యక్రియలు జరిపారు.
కుటుంబానికి న్యాయం చేయాలి
జవహర్‌నగర్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కలదాడిలో చనిపోయిన చిన్నారి విహాన్ కుటుంబానికి అండగా ప్రజాసంఘాలు, బీజేపీ, బీఆర్‌ఎ్‌సతో పాటు పలువురు హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్యాలయం బుధవారం ఎదుట ఆందోళనకు దిగారు. మున్సిపల్ అఽధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి కుక్కల బారిన పడ్డాడని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రూ. 20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, డబుల్‌బెడ్‌రూం లేదా ప్లాట్ అందించాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మేడ్చల్ కలెక్టర్‌కు నివేదిక అందించామని, తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి రూ. 50 వేలు అందించేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తాజ్ మోహన్‌రెడ్డి తెలిపారు. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేయర్ శాంతి, డిప్యూటీ మేయర్ శ్రీనివా్‌సలు మాట్లాడుతూ చిన్నారి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 50 వేలు అందిస్తామని, కుటుంబంలోని ఒకరికి మున్సిపల్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ప్లాంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
Updated Date - Jul 17 , 2024 | 11:28 PM