ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రుణమాఫీ.. ఫ్యాక్టరీ పాలు!

ABN, Publish Date - Jul 25 , 2024 | 12:19 AM

వారంతా చెరకు రైతులు! సాగు కోసం ఎలాంటి రుణాలూ తీసుకోకున్నా.. వారి రుణాలు మాఫీ చేస్తున్నట్టుగా బ్యాంకుల నుంచి సందేశాలు వచ్చాయి! దీంతో వారంతా కంగు తిన్నారు. ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.

రైతులకు తెలియకుండా వారి పేరిట రుణాలు

మాఫీ సందేశాలు చూసి అవాక్కైన రైతన్నలు

ఇది చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్వాకం

అని తెలుసుకుని ఫ్యాక్టరీ ముందు ఆందోళన

న్యాయం చేయాలని సర్కారుకు విజ్ఞప్తి

నారాయణఖేడ్‌/మనూరు, జూలై 24: వారంతా చెరకు రైతులు! సాగు కోసం ఎలాంటి రుణాలూ తీసుకోకున్నా.. వారి రుణాలు మాఫీ చేస్తున్నట్టుగా బ్యాంకుల నుంచి సందేశాలు వచ్చాయి! దీంతో వారంతా కంగు తిన్నారు. ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. సాగుకు ముందు చక్కెర కర్మాగారంతో వారు చేసుకున్న ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని.. ఫ్యాక్టరీ యాజమాన్యమే బ్యాంకుల నుంచి రుణలు తీసుకున్నట్టు తెలిసింది! దీంతో బుధవారం వారంతా ఆ కర్మాగారం ఎదుట ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం అతిమ్యాల్‌లో జరిగింది ఘటన. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మాగి చక్కెర కర్మాగారానికి.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పరిధిలోని రైతులు చెరకును సరఫరా చేస్తారు. ఈ మేరకు కర్మాగారం యాజమాన్యంతో ఒప్పందాలు చేసుకుంటారు. అప్పుడు కర్మాగారం యాజమాన్యం ఆ రైతులకు పంట సాగు కోసం చెరకు విత్తనం, ఎరువులు, ఇతర క్రిమిసంహారక మందులను సరఫరా చేస్తుంది. ఇందుకు సంబంధించిన డబ్బును.. చెరకు సరఫరా అనంతరం రైతుల నుండి రికవరీ చేసుకుంటుంది. ఈమేరకు రైతులతో ఒప్పందం చేసుకునే క్రమంలోనే కర్మాగారం యాజమాన్యం వారితో బ్యాంకు రుణపత్రాలపైన కూడా సంతకాలు చేయిస్తుంది. ఈ క్రమంలోనే.. వారి పేరిట రుణాలు తీసుకుంది. ఇటీవల సర్కారు రైతు రుణమాఫీలో భాగంగా తొలి విడత రూ.లక్ష లోపు రుణాలను బ్యాంకులకు చెల్లించిన నేపథ్యంలో.. నిజామాబాద్‌లోని నాందేవ్‌వాడ యూనియన్‌ బ్యాంకు శాఖ నుంచి పలువురు రైతులకు రెండు రోజులుగా రుణమాఫీ అయినట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. మనూరు మండలం అతిమ్యాల్‌ గ్రామంలోని 120 మంది రైతులకు, నారాయణఖేడ్‌డివిజన్‌ పరిధిలో దాదాపు 500మందికి పైగా ఇలా సందేశాలు రావడంతో ఆరా తీయగా.. కర్మాగారం యాజమాన్యం రైతుల పేరిట రుణాలు తీసుకుందన్న విషయం తెలిసింది. దీంతో వారు బుధవారం ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై మాగి చక్కెర కర్మాగారం జీఎం వెంగల్‌రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. రైతులతో ఒప్పందం చేసుకునే క్రమంలో రుణ పత్రాలపై కూడా సంతకాలు తీసుకుని, వారికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఇందుకోసం బ్యాంకు నుంచి రైతుల పేరిట రుణం తీసుకుని.. వారు చెరకు సరఫరా చేసిన తర్వాత, వారి నుంచి రికవరీ చేసిన సొమ్మును బ్యాంకుకు చెల్లిస్తామని వివరించారు. రైతుల పేరిట తీసుకున్న రుణాలు మాఫీ అయిన నేపథ్యంలో.. దీనిపై తమ యాజమాన్యం బ్యాంకర్లతో చర్చిస్తుందని.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు.

ఆ సొమ్ము మాకు ఇవ్వాలి

- మల్లిఖార్జున్‌ , అతిమ్యాల

మేం రుణం తీసుకోకున్నా.. మాఫీ అయినట్లు నిజామాబాద్‌ యూనియన్‌ బ్యాంక్‌ నుంచి మెసేజ్‌ వచ్చిది. కర్మాగారం వారు మాతో అగ్రిమెంట్‌పై సంతకాలు తీసుకుని, వారు రుణం తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. దీంతో మాకు రుణమాఫీ ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రభుత్వం ఈ రుణమాఫీ సొమ్మును మా ఖాతాలకు బదిలీ చేయాలి.

మాఫీ సందేశం చూసి అవాక్కయ్యా

- నర్సింహులు, అతిమ్యాల్‌

నిజామాబాద్‌లోని నాందేవ్‌వాడ యూనియన్‌ బ్యాంకులో నేనేమీ రుణం తీసుకోలేదు. నాకున్న మూడెకరాల్లో చెరకు పండించి సరఫరా చేయడానికి చక్కెర కర్మాగారంతో ఒప్పందం చేసుకున్నానంతే. ఇప్పుడు నాకు.. ఆ బ్యాంక్‌ నుంచి రుణమాఫీ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. ఆ సందేశం చూసి అవాక్కయ్యా.

Updated Date - Jul 25 , 2024 | 12:19 AM

Advertising
Advertising
<