ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మరసం... సాహిత్య ప్రవాహం..

ABN, Publish Date - Sep 28 , 2024 | 11:45 PM

ప్రజా ఉద్యమాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, విప్లవ రచయితల సంఘం ఇచ్చిన ప్రేరణతో కొంతమంది కవులు, రచయితలు ఏర్పాటు చేసుకున్న సంఘమే మరసం.

మంజీర రచయితల సంఘం 10వ వార్షికోత్సవం సందర్భంగా సిద్దిపేటలో కవులు, రచయితల ర్యాలీ (ఫైల్‌)

మంజీర రచయితల సంఘానికి 38 ఏళ్లు

సామాజిక ఉద్యమాలతో ప్రజాక్షేత్రంలోకి..

తెలంగాణ పోరాటానికి వెన్నుదన్ను

కవులు, గాయకులు, రచయితలను తీర్చిదిద్దిన ఘనత

నేడు సిద్దిపేట విపంచి హాల్‌లో వార్షికోత్సవం

హాజరవుతున్న ప్రముఖ కవులు, సాహితీవేత్తలు

‘‘మంజీర రచయితల సంఘం మాది

కన్నీటి వ్యధలన్నీ కథలుగా సృజియించి

శ్రమశక్తి విజయాల కవితలై వెలయించు

చైతన్య సాగర తరంగం మాది’’

...అంటూ సాహిత్య పరిమళాలను సామాజిక ఉద్యమాల కోసం వెదజల్లిన ఘనత మంజీర రచయితల సంఘానిది. ‘మ.ర.స.ం’గా ఆవిర్భవించి మెతుకుసీమ తనువంతా స్పృశించి చైతన్యాన్ని రేకెత్తించిన సాహితీ సంస్థ ఇది. 1986లో పురుడుపోసుకొని 38 ఏళ్లపాటు ప్రజా ఉద్యమాలు, ప్రత్యేక పోరాటాలు, సామాజిక, విప్లవ భావజాల ప్రదర్శనలో మమేకమైన వేదిక ఇది. నేడు సిద్దిపేటలోని విపంచి టౌన్‌హాల్‌లో వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, సెప్టెంబరు 28: ప్రజా ఉద్యమాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, విప్లవ రచయితల సంఘం ఇచ్చిన ప్రేరణతో కొంతమంది కవులు, రచయితలు ఏర్పాటు చేసుకున్న సంఘమే మరసం. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అభ్యుదయ భావాలు కలిగిన కవులందరినీ ఒక వేదిక మీదకు తెచ్చి సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలనే సంకల్పంతోనే ఈ సంఘం ఆవిర్భవించింది. 1986లో మొట్టమొదటి మరసం సభ సిద్దిపేటలో జరిగింది. నాటి కార్యక్రమానికి సాహితీవేత్త, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి హాజరయ్యారు. అప్పటి నుంచి సాహిత్య మంజీరా ప్రవాహం ప్రారంభమైంది. మంజీరా నదికి ఏడుపాయలు ఉన్నట్లే మంజీర రచయితల సంఘానికీ ఉమ్మడి జిల్లాలో ఏడు శాఖలను ఏర్పాటు చేశారు.

సామాజిక ఉద్యమాల్లో కీలకంగా..

నాడు ఉమ్మడి మెదక్‌ జిల్లాను పట్టిపీడించిన మద్యపానంపై ‘మరసం’ గ్రామగ్రామాన చైతన్యాన్ని నింపింది. రాత్రి సమయంలో నాటక ప్రదర్శనలు నిర్వహించి మద్యపానంతో జరిగే అనర్థాలను కళ్లకు కట్టారు. తాగుడుకు బానిసైనవారి కళ్లను తెరిపించే ప్రయత్నం చేసింది మరసం. కవులు, రచయితలే వేషాలు ధరించి సామాజిక రుగ్మతలను తరిమికొట్టడంలో భేష్‌ అనిపించుకున్నారు. వరకట్న వ్యతిరేక ప్రదర్శనలు, అమెరికా యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా, అశ్లీల సంస్కృతిని నిరసిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా రైతుల ఆత్మహత్యలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలను ఆగం చేయవద్దంటూ నాటకాలతో కనువిప్పు కలిగించిన సంఘమే మరసం. గుట్కాలు, పాన్‌మసాలా వ్యసనాలకు వ్యతిరేకంగా కవితలు, పాటలతో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.

స్వరాష్ట్ర పోరాటంలో...

‘‘నాగేటి సాల్లల్ల నా తెలంగాణ.. నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ’’ అనే పాటతో స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసిన రచయిత నందిని సిధారెడ్డి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ ఇద్దరూ మంజీర రచయితల సంఘం సభ్యులే. మరసం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న నందిని సిధారెడ్డి సామాజిక ఉద్యమాలతో పాటు తెలంగాణ పోరాటంలోనూ తనదైన పాత్ర పోషించారు. మరసం ప్రభావంతోనే తెలంగాణ రచయితల వేదిక సైతం ఏర్పాటైంది. తెలంగాణ ధూంధాం ద్వారా తన ఆటపాటతో హోరెత్తించిన రసమయి బాలకిషన్‌కు ఈ సంఘమే ప్రేరణ. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతతోపాటు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టడంలో ‘మరసం’ సభ్యుల పాత్ర అనిర్వచనీయం. ‘తెలంగానం’ పేరిట తెలంగాణ పాటలు ప్రాచుర్యం పొందడంలోనూ ఈ సంఘం కీలకమైంది. నాగేటి సాల్లల్ల ఆడియో క్యాసెట్‌ను ఆవిష్కరించారు.

సభా వివాహాలతో ఆదర్శం

వివాహ వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో వరకట్న రహితంగా ‘మరసం’ ఆధ్వర్యంలో సభావివాహాలు జరిగాయి. మంత్రాలు, డప్పుచప్పుళ్లు, వరకట్నాల ప్రస్తావన లేకుండానే వధూవరులను ఒక్కటి చేసిన ఘనత ‘మరసం’కు దక్కుతుంది. మాజీ ఎమ్మెల్యే, దివంగత సోలిపేట రామలింగారెడ్డి ,సుజాత వివాహంతో ఈ సభావివాహాలకు శ్రీకారం చుట్టారు. ఆనాడు ప్రజాకవి కాళోజీతోపాటు సాహిత్యకారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఇది ఉమ్మడి మెదక్‌ జిల్లాతోపాటు తెలంగాణ వ్యాప్తంగా నూతన ఒరవడికి నాంది పలికింది. నందిని భగవాన్‌రెడ్డి, వజ్రమ్మల వివాహాన్ని డాక్టర్‌ సి.నారాయణరెడ్డి జరిపించగా, బయ్యారం రాంరెడ్డి, పద్మల వివాహాన్ని ఎంటీ ఖాన్‌ చేతులమీదుగా జరిపించారు.

సామాన్యులకూ చేరువయ్యే కవిత్వం

సాధారణంగా కవితలను, కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే సాహిత్యంపై కొంత అవగాహన ఉండాలి. కానీ మరసం ద్వారా వెలుగులోకి వచ్చిన పలు కవితా సంపుటాలు అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. అందుకే త్వరగా జనంలోకి చొచ్చుకెళ్లి ప్రజలను ఆకర్షించడమేగాకుండా చైతన్యవంతులను చేశాయి. తెలంగాణ యాసలో వచ్చిన సంపుటాలు సైతం తట్టిలేపాయి. ఉనికి, భూమిస్వప్నం, సంభాషణ, ప్రాణహిత, నేల తడవని వాన, సంతకం, వరదగూడు, నెమలికన్ను, పునాస, వడిసెల, పానాది, గోరుకొయ్యలు, వయోలిన్‌ రాగమో, వసంత మేఘమో, సెలవింక అనే కవితా సంపుటాలు.. వ్యాస మంజీర, కదలిక, ఎడుపాయలు, మొగులైంది, పాట సంతకం అనే సంకలనాలు మరసం నుంచే వెలువడ్డాయి.

నేడు 38వ వార్షికోత్సవం

దాశరథి, ఆరుద్ర, బిరుదురాజు రామరాజుల శతజయంతి సందర్భంగా ‘మరసం’ 38వ వార్షికోత్సవ సమావేశాన్ని నేడు ఉదయం 10 గంటల నుంచి సిద్దిపేటలోని విపంచి టౌన్‌హాల్‌లో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొంటారు. ప్రముఖ కవి, కబీర్‌ సమ్మాన్‌ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి హాజరై ప్రసంగించనున్నారు. ఆరుద్ర సాహిత్య స్ఫూర్తి అనే అంశంపై నందిని సిధారెడ్డి, దాశరథి కవితా చైతన్యంపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, బిరుదురాజు రామరాజుపై సి.కాశీం ప్రసంగాలు ఉంటాయని మరసం అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి తెలిపారు.

Updated Date - Sep 28 , 2024 | 11:45 PM