హామీలు తీరేలా.. సంక్షేమం సాగేలా..
ABN, Publish Date - Jul 25 , 2024 | 11:56 PM
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేవిధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూపొందినట్లుగా కనిపిస్తోంది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరు గ్యారంటీలకే ప్రాధాన్యం
ఎవుసానికి సై.. మహిళలకు జై..!
ఉమ్మడి మెదక్ జిల్లాకు 40వేల ఇందిరమ్మ ఇళ్లు
పటాన్‌చెరు వరకు మెట్రో రైలు ప్రతిపాదనలు
రీజనల్‌రింగు రోడ్డుకు రూ.1,525 కోట్లు
నీటిపారుదలశాఖకూ భారీగా కేటాయింపులు
జిల్లా మంత్రుల పట్టుదలపైనే ప్రాజెక్టుల భవిత
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూలై 25: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేవిధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూపొందినట్లుగా కనిపిస్తోంది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుకు ఊతంగా నిధుల కేటాయింపు జరిగింది. వ్యవసాయం, నీటిపారుదల, విద్యా,వైద్యంతోపాటు మహిళా సంఘాలకు పెద్దపీట వేశారు. సంక్షేమమే ప్రధాన ఎజెండాగా అనేక అంశాలను పొందుపరిచారు. ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేనప్పటికీ పథకాల వారీగా ప్రయోజనాలు దక్కనున్నాయి.
ఉమ్మడి జిల్లాకు సంబంధించి బడ్జెట్‌లో గత పదేళ్లలో తగిన ప్రాధాన్యత ఉండేది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఇద్దరూ ఈ జిల్లా వాసులే కావడంతో నిధుల కేటాయింపులో ఢోకా లేకపోయింది. బడ్జెట్ నిధులతోపాటు ఎస్‌డీఎఫ్ నిధులలోనూ అగ్రస్థానం కల్పించేవారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న క్రమంలో అందరి దృష్టి ఇటువైపు మళ్లింది. అయితే వివిధ శాఖలకు భారీగానే కేటాయింపులు చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఇంచార్జి మంత్రి కొండా సురేఖలు పట్టుబడితేనే ఈ ప్రాంతంలోని పెండింగ్ పనులు, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతాయి.
మెట్రో రైలు.. రీజనల్ రోడ్డు
సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న పటాన్‌చెరు వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని విస్తరిస్తామని బడ్జెట్ నివేదికలో పేర్కొన్నారు. మియాపూర్ జంక్షన్ నుండి పటాన్‌చెరు వరకు విస్తరిస్తే ట్రాఫిక్ సమస్య నియంత్రణలోకి వస్తుంది. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, నర్సాపూర్ వైపు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ దూరంతోపాటు వ్యయప్రయాసలు తప్పుతాయి. ఇక గజ్వేల్, నర్సాపూర్, తూప్రాన్, సంగారెడ్డి పట్టణాలకు అనుసంధానంగా నిర్మించతలపెట్టిన రీజనల్ రింగు రోడ్డుకు ఈ బడ్జెట్‌లో రూ.1525 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే భూ సేకరణ జరుగుతుండగా.. పనులు ప్రారంభించాల్సి ఉంది.
వ్యవసాయం, మహిళా సాధికారత
వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.72,659 కోట్లు కేటాయించడం విశేషం. రుణమాఫీతోపాటు ఎకరాకు రూ.15వేలు ఇచ్చేలా రైతుభరోసా, ప్రతీ రైతుకూలీకి రూ.12వేలు, సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ తదితర కార్యక్రమాలకు ఈ నిధులు వెచ్చించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రయోజనం చేకూరబోతున్నది. ఇక ఇందిరా మహిళా శక్తి పేరిట తొలిదశలో 5వేల మహిళా స్వయం సహాయక సంఘాలను పారిశ్రామికంగా ప్రొత్సహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 500 మహిళా సంఘాలు ఎంపికయ్యే అవకాశాలున్నాయి.
పేదలకు ఇళ్లపై ఆశలు
నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని బడ్జెట్ నివేదికలో ప్రకటించారు. ఈ లెక్కన ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాలతోపాటు సిద్దిపేట జిల్లాలో విలీనమైన హుస్నాబాద్ నియోజకవర్గం, చేర్యాల, దూళిమిట్ట, కొమురవెల్లి,మద్దూరు, బెజ్జంకి మండలాలకు లబ్ది చేకూరనున్నది. మొత్తంగా 40వేల ఇళ్ల వరకు మంజూరయ్యే అవకాశం ఉంది. ఒక్కో ఇంటికి రూ.5లక్షల చొప్పున లబ్దిదారులకు జమ చేస్తారు. అదే విధంగా గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను చాలాచోట్ల పంపిణీ చేయలేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 8వేల ఇండ్లు ఉంటాయని అంచనా. వీటిని కూడా అర్హులకు పంపిణీ చేసామని తాజాగా ప్రకటించారు.
రూ.22వేల కోట్లలో మన వాటా ఎంతో?
నీటిపారుదలశాఖకు సంబంధించి రూ.22వేల కోట్ల పైచిలుకు నిధులను బడ్జెట్‌లో కేటాయించారు. సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. నిధుల కోసం పట్టుబట్టారు. తాజా బడ్జెట్‌లో ఆ శాఖకు ప్రాధాన్యత దక్కడంతో గౌరవెల్లిని పూర్తి చేయిస్తారనే ఆశలు నెలకొన్నాయి. ఇక సంగారెడ్డి జిల్లాలోని సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల బాధ్యతను మంత్రి దామోదర రాజనర్సింహ పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటిపారుదలకు కేటాయించిన నిధులను ఈ రెండు ప్రాజెక్టులకు సద్వినియోగం చేస్తే అందోలు, నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల రైతులకు మేలు చేకూరుతుంది. మెదక్‌లోని ఘన్‌పూర్ ప్రాజెక్టు ఎత్తుపెంచేందుకు కూడా ప్రతిపాదనలు పంపారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు అనుసంధానంగా కాలువలను నిర్మించాల్సి ఉంది. భూనిర్వాసితుల పరిహారం సైతం చెల్లించాలనే డిమాండ్ ఉంది.
ఈ అంశాలపై తప్పని నిరాశ..
- సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, చేర్యాల పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగా మారుస్తారని ఆయా ప్రాంతాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కొత్త మండలాలు, విలీన ప్రాంతాల చేర్పుల మార్పులకు సంబంధించిన ప్రస్తావన లేకపోయింది.
- రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో ఇకో-టూరిజంను ప్రొత్సహిస్తామని పేర్కొన్నారు. ఇందులో నర్సాపూర్ అడవులకు ప్రాధాన్యత కల్పించలేదు.
- సిద్దిపేట జిల్లాలో పామాయిల్ తోటలు పెద్ద ఎత్తున సాగుచేస్తున్నారు. గత ఏడాది పామాయిల్ కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించగా ఈసారి ఉద్యానవన శాఖ మొత్తానికే రూ.737 కోట్లు కేటాయించారు.
Updated Date - Jul 25 , 2024 | 11:56 PM