మున్సిపల్ ఆదాయానికి గండి
ABN, Publish Date - Jul 27 , 2024 | 11:48 PM
జోగిపేట, జూలై 27: అందోలు-జోగిపేట మున్సిపాలిటీ ఆదాయంలో భారీ గండి పడింది. వేలం పాటదారులు కుమ్మక్కైౖ, నామమాత్రపు అద్దెకే పాటపాడి బల్దియాకు రావాల్సిన ఆదాయానికి గండికొట్టారు.
షాపింగ్ కాంప్లెక్స్ వేలం పాటలో మాయాజాలం
కుమ్మక్కైన పాటదారులు
నామమాత్రపు ధరలకే దక్కించుకున్న వైనం
జోగిపేట, జూలై 27: అందోలు-జోగిపేట మున్సిపాలిటీ ఆదాయంలో భారీ గండి పడింది. వేలం పాటదారులు కుమ్మక్కైౖ, నామమాత్రపు అద్దెకే పాటపాడి బల్దియాకు రావాల్సిన ఆదాయానికి గండికొట్టారు. అందోలు-జోగిపేట మున్సిపాలిటీకి జోగిపేటలోని గాంధీపార్కక వద్ద 12 దుకాణాలతో కూడిన షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది. ఇందులో 9వ దుకాణానికి మరమ్మతులు ఉండగా.. మిగిలిన 11 దుకాణాలకు శనివారం బల్దియా సమావేశ మందిరంలో వేలం పాటలు నిర్వహించారు. సాక్షాత్తు చైర్మన్ మల్లయ్య, కమిషనర్ తిరుమల సమక్షంలోనే వేలం పాటదారులు నామమాత్రపు ధరలకే వేలం పాడడంతో అంతా అవాక్కయ్యారు.
శుక్రవారమే కుమ్మక్కు
కాగా వేలంపాట విషయంలో పాటదారులంతా... శుక్రవారమే కుమ్మక్కైయ్యారు. పైరవీకారులు కొందరు మధ్యవర్తిత్వం చేసి... పట్టణ శివార్లలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పాటదారులను పిలిచి సమావేశం నిర్వహించారని సమాచారం. ఎక్కువకు పాడి మున్సిపాలిటీకి లాభం కల్పించడం ఎందుకు నామమాత్రపు ధరలకు పాడుకుని వచ్చే ఆదాయం మనమే పంచుకుందామని పాటదారులకు సర్దిచెప్పడం విశేషం.
ప్రతీ పాటదారునికి రూ.25 వేలు
బిడ్లు వేసిన ప్రతీ పాటదారుడికి కనీసం రూ.25 వేలు దక్కేలా పైరవీకారులు పథక రచన చేశారు. కొన్ని దుకణాలకు 10 మందికిపైగా బిడ్లు రావడం, మరికొన్నింటికి నలుగురే రావాలని పథకం వేశారని తెలిసింది. ఎక్కువమంది పాటదారులున్న చోట దుకాణం దక్కించుకోవాలనుకున్న పాటదారుడు.. తాను కాకుండా మిగిలిన పాటదారులకు ఒక్కొక్కరికీ రూ.25 వేలు చెల్లించాలని నిర్ణయం జరిగింది. దాని ప్రకారం.. 9 మందికి రూ.2.25 లక్షలు చెల్లించారని సమాచారం. ప్రతిసారి కేవలం రూ.100 చొప్పున పెరుగుతూ.. అసలు దుకాణదారుడు అనుకున్న ఫిగర్ రాగానే, మిగతావారంతా పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే ఆయా షాప్‌లలో వ్యాపారాలు సాగిస్తున్నవారు, సెటప్ అయిన తమ వ్యాపారానికి ఇబ్బంది కలుగకూడదని ఏకంగా రూ.3 లక్షలు చెల్లించినట్లు సమాచారం.
షాప్ నెంబర్-2కు అధిక పోటీ
ఇదిలా ఉంటే.. 11 దుకాణాలలోని 2 నెంబరు దుకణానికి మాత్రమే వేలం పాటదారులు రింగ్ కాలేకపోయారు. ఈ దుకాణానికి ఎనిమిది మంది పోటీపడగా, అత్యధికంగా రూ.19,300లకు అరుణ్ తేజ్‌గౌడ్ అనే బిల్డర్ పాటపాడి దక్కించుకున్నాడు. మిగతా దుకాణాలన్నీ సర్కారు వారి పాట రూ.10 వేలకు కొంచెం అటుఇటుగానే పాడారు. షాప్ నెంబర్-2 మినహాయిస్తే.. అత్యధికంగా బిడ్ పాడిన ధర కేవలం రూ.10,900 (షాప్‌నెంబర్ -1) కావడం గమనార్హం.
పాటదారుల స్థానంలో.. ఇతరుల బిడ్డింగ్
నిబంధనల మేరకు ఒక్కో వ్యక్తి ఎన్ని దుకణాలకైనా వేలంపాటలో పాల్గొనవచ్చు. ఒకటి కంటే ఎక్కువ దుకాణాలు పొందకూడదు. కానీ ఓ వ్యక్తి నిబంధనలకు రెండు దుకాణాలను దక్కించుకోవడం గమనార్హం. వేలం పాటకు డీడీలు చెల్లించిన వ్యక్తే పాల్గొనాలి. కానీ అతనికి బదులుగా, వారి కుటుంబసభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. ఇది ఒక ఎత్తైతే.. వేలంపాటదారుల సంతకాలను కూడా వారే పెట్టడం విశేషం. 1వ వార్డు కౌన్సిలర్ డాకూరి శివశంకర్, 17వ వార్డు కౌన్సిలర్ చిట్టిబాబులు మాత్రమే అధిక ఆదాయం రావాలని పట్టుబట్టారు. కానీ అటు చైర్మన్ కానీ, ఇటు కమిషనర్ కానీ ఏమాత్రం స్పందించకపోవడం విడ్డూరం. ఏకంగా కౌన్సిలర్ల కుటుంబసభ్యులే, తమ కుటుంబంలోని ఇతర సభ్యుల పేర్లపై బిడ్లు వేసి పాల్గొనడం మరీ దారుణం. మూడేళ్ల క్రితం ప్రతీ దుకాణానికి రూ.6 వేలను సర్కారు వారి పాటగా నిర్ణయించారు. అత్యధికంగా రూ.20,500కు బిడ్ కాగా, ఈసారి సర్కారు వారి పాట రూ.10 వేలకు పెరిగినా వేలంలో కేవలం ఒక్కషాపు మినహా మిగతావన్నీ సర్కారువారి పాటకు కొంచెం అటుఇటుగా పాడడం గమనార్హం.
దుకాణాలు దక్కించుకున్నవారు
షాప్ నెంబర్ -1 తుపాకుల క్రిష్ణ రూ.10,900, షాప్ నెంబర్-2 అరుణ్ తేజ్‌గౌడ్ రూ.19,300, షాప్ నెంబర్-3 సునేరియా వివేక్ రూ.10,600, షాప్ నెంబర్-4 అర్థం లక్ష్మి రూ.10,500, షాప్ నెంబర్-5 జట్ల లక్ష్మి రూ.10,700, షాప్ నెంబర్-6 వుల్వల శ్రావణి రూ.10,400, షాప్ నెంబర్-7 సునేరియా వివేక్ రూ. 10,700, షాప్ నెంబర్-8 రాంప్రసాద్ రూ.10,200, షాప్ నెంబర్-9 (ఎవరూ పాడలేదు), షాప్ నెంబర్-10 తుపాకుల నాగరాజు రూ.10,300, షాప్ నెంబర్-11 సోమ సీనయ్య రూ.10,300, షాప్ నెంబర్-12 హన్మంత్‌గారి లావణ్యరూ.10,300 వేలకు పాడారు.
Updated Date - Jul 27 , 2024 | 11:48 PM