రోడ్డు విస్తరణ పనుల్లో పగిలిన పైపులు
ABN, Publish Date - Oct 09 , 2024 | 11:39 PM
తాగునీటి కోసం ప్రజల అవస్థలు ముండ్రాయిలో ట్యాంకర్‌తో నీటి సరఫరా
నంగునూరు, అక్టోబరు 9: సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వరకు చేపడుతున్న నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని ముండ్రాయి చౌరస్తా వద్ద ఎక్స్‌కవేటర్‌తో రోడ్డు విస్తరణ పనులు చేపడుతుండగా మిషన్ భగీరథ పైపులు పగిలిపోయాయి. దీంతో నీరంతా వృథాగా పోతున్నది. వాటికి మరమ్మతులు చేపట్టడంలోనూ అలసత్వం ప్రదర్శిస్తుండడంతో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పైప్‌లైన్ పగలడంతో పాలమాకుల, నర్మెట్ట, వెంకటాపూర్, మండలంలోని తదితర గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో గ్రామపంచాయతీ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. మరి కొంతమంది తమ వ్యవసాయ బావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. రోడ్డు విస్తరణలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి పనులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు.
Updated Date - Oct 09 , 2024 | 11:39 PM