ప్రతీ పనికో రేటు!
ABN, Publish Date - Sep 28 , 2024 | 11:47 PM
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు 28: విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిన పనులకూ ఉమ్మడి జిల్లాలో కొందరు కార్యదర్శులు ధరలు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పంచాయతీ కార్యదర్శులపై ఆరోపణలు
పట్టణాల పరిసర గ్రామాల్లో హవా
పాలకవర్గాలు లేకపోవడంతో ఇష్టారాజ్యం
అనుమతులు, మ్యుటేషన్లకూ మామూళ్లు
తాజాగా ఏసీబీకి చిక్కిన సెక్రెటరీ
మరికొందరిపైనా ఏసీబీకి ఫిర్యాదులు?
‘ఇల్లు, విద్యుత్ కనెక్షన్ పేరు మార్పు కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా రూ. 25వేలు ఖర్చవుతుందని చెప్పిన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై వేటుపడింది. రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.’
‘ఝరాసంగం మండలం మాచునూరులో గ్రామ కంఠంలోని ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు వేసి వాటిని తమ కుటుంబ సభ్యుల పేరిట కేటాయించిన పంచాయతీ కార్యదర్శి, ఎంపీఈవోలపై వేటు పడింది. ఇటీవల అధికారులు విచారణ చేసి నిజమని తేలడంతో ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు.’
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు 28: విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిన పనులకూ ఉమ్మడి జిల్లాలో కొందరు కార్యదర్శులు ధరలు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది చిత్తశుద్ధితో తమ గ్రామాల అభివృద్ధి కోసం శ్రమిస్తుండగా.. మరికొందరేమో అడ్డదారుల్లో సంపాదనకు అలవాటుపడి అవితీనికి పాల్పడుతున్నారు. తమ అధికారాలను అడ్డం పెట్టుకొని అక్రమాలకు దారులు వేస్తున్నారు.
కార్యదర్శుల హవా..
పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్, పటాన్‌చెరు, జహీరాబాద్, మెదక్, తూప్రాన్, మనోహరాబాద్, సిద్దిపేట అర్బన్, గజ్వేల్, నర్సాపూర్, హత్నూర, మాసాయిపేట, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని పలు గ్రామాల కార్యదర్శులపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణాలకు సమీపంలో ఉండడం, పరిశ్రమలు విస్తరించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా జరగడంతో భూములకు డిమాండ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో కొత్త ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పుట్టగొడుగుల వలె వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణానికి ఎన్‌వోసీలు, ఇతర అనుమతులు ఇవ్వాలంటే కార్యదర్శులు ’నాకేంటి’ అని అంటున్నారు. ఓనర్‌షిప్ సర్టిఫికెట్లు, కొత్త విద్యుత్ మీటరు, బర్త్, డెత్ సర్టిఫికెట్లకు కూడా ధరలు నిర్ణయిస్తున్న కార్యదర్శులు ఉన్నారు.
అవినీతిపరులపై ఫిర్యాదులు..
ఇప్పటికే కొండాపూర్ పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతని బాటలోనే మరికొందరిపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇవ్వనిదే మ్యారేజ్, బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేయరని, పింఛన్ల పేరిట డబ్బులు అడుగుతున్నారని, ఏ పనికైనా ఒక రేటు కడతారని పలువురు కార్యదర్శుల గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. కార్యదర్శులపై ఫిర్యాదులు వచ్చినా మొక్కుబడిగా స్వీకరిస్తున్నారని జిల్లా స్థాయి అధికారులపైనా ఆరోపణలు లేకపోలేదు. కొన్ని గ్రామాల్లో కార్యదర్శులను జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు సైతం ప్రొత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదనే నెపంతో ఇటీవల కొందరు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇలా ఏసీబీ చేతిలో పలువురు కార్యదర్శుల అవినీతి చిట్టా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక్కొక్కరిది ఒక్కోతీరు
పంచాయతీ కార్యదర్శుల్లో కొందరి అక్రమాల మూలంగా అందరిపైనా నిందలు పడుతున్నాయనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి చాలా గ్రామాల్లో నిధుల కొరత మూలంగా కార్యదర్శులు తమ సొంతంగా మరమ్మతు పనులు చేయిస్తున్నారు. అప్పులు తెచ్చి గ్రామాలకు ఖర్చు చేసి ఆ తర్వాత బిల్లులు పొందుతున్నారు. ఇంకొందరైతే గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, గ్రామంతోపాటు తమకూ పేరు రావాలని కష్టపడుతున్నారు. ఉదయం చెత్తసేకరణ నుండి రాత్రి వీధి దీపాలు వెలిగేవరకు తమ ముద్ర కనిపించేలా వ్యవహరిస్తున్నారు. కార్యదర్శుల్లో యువతీయువకులే ఎక్కువగా ఉండడంతో ఒక లక్ష్యంతో కృషి చేస్తున్నారు. కానీ కొంతమంది అవినీతికి పాల్పడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రత్యేకాధికారులకూ పట్టింపు లేనందున ఇక కార్యదర్శులే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. కొందరేమో అక్రమాలకు అలవాటుపడుతూ అదనపు ఆదాయం పొందుతుండగా.. మరికొందరేమో తమ జేబుల్లో నుండే గ్రామాలకు వెచ్చిస్తూ నెట్టుకొస్తున్నారు.
Updated Date - Sep 28 , 2024 | 11:47 PM