నత్తనడకన ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులు
ABN, Publish Date - Aug 31 , 2024 | 11:34 PM
హుస్నాబాద్, ఆగస్టు 31: హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
మంత్రి పొన్నం శంకుస్థాపన చేసి ఆరునెలలు..
ఇంకా పూర్తి కాని పనులు
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
హుస్నాబాద్, ఆగస్టు 31: హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో శంకుస్థాపన జరిగి ఆరునెలల గడుస్తున్నా ఇప్పటికీ 50 శాతం పనులు కూడా పూర్తికాలేదు. మరో ఆరునెలలు గడిచినా పూర్తయ్యే అవకాశాలు కనబడటం లేదని జరుగుతున్న పనులను చూస్తే అవగతమవుతుంది. ఈ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.2 కోట్లు మంజూరు చేయడంతో నాలుగు దశాబ్దాల తర్వాత దీనికి మహర్దశ రాబోతుందని ఈ ప్రాంత ప్రజలు సంతోషపడ్డారు. శిథిలావస్థకు చేరిన ఈ బస్టాండ్ రూపురేఖలు మారబోతున్నాయని సంబురపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మార్చి 8న ఈ పనులకు శంకుస్థాపన చేశారు. మార్చి 21వ తేదీ నుంచి పనులు షురూ చేశారు. అప్పటి నుంచి పనులు మందకొడిగానే జరుగుతున్నాయి.
40 ఏళ్ల తర్వాత పూర్తి దశలో ఆధునీకరణ..
హుస్నాబాద్ బస్టాండ్‌ను 1984 జూన్ 17న అప్పటి ఎమ్మెల్యే స్వర్గీయ బొప్పరాజు లక్ష్మీకాంతారావు కృషితో నాటి రాష్ట్ర రావాణాశాఖ మంత్రి సంగంరెడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. అప్పుడు మూడువరకు ఫ్లాట్ ఫామ్‌లుండేవి. తదనంతరం పలుమార్లు రిపేర్లు చేశారు. మళ్లీ 14 ఆగస్టు 2017న రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. దీనికి రూ.33.59 లక్షలు మంజూరు చేశారు. అప్పుడు అందులో ఉన్న హోటల్ గదులను తొలగించి విశాలంగా చేసి ఆధునీకరించారు. ప్రస్తుతం బస్టాండ్‌లో 8 ప్లాట్ ఫామ్‌లుండగా అదనంగా మరో మూడు ఫ్లాట్ ఫామ్‌లు నిర్మిస్తున్నారు. 40 ఏళ్ల తర్వాత బస్టాండ్‌ను పూర్తిస్థాయిలో ఆధునీకరించుటకు నిధులు మంజూరు కాగా.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతుండటంతో ఇక్కడి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికుల ఇబ్బందులు..
బస్టాండ్ ఆధునీకరణ పనులకు రూ.2 కోట్లు మంజూరు కాగా.. తూర్పు వైపు ఒక ప్లాట్ ఫాం, పడమర వైపు రెండు ప్లాట్ ఫామ్‌లు నిర్మించాల్సి ఉంది. అదనంగా నిర్మిస్తున్న రెండు ప్లాట్‌ఫామ్‌ల వైపు టాయ్‌లెట్స్‌ను నిర్మాణం చేస్తున్నారు. బస్టాండ్ ముందు ఎలివేషన్ చేయాల్సి ఉంది. గ్రానైట్, రేయిలింగ్ వంటి పనులతో ఆధునీకరించాల్సి ఉండగా ఇంకా ఈ పనులు ప్రారంభం కాలేదు. బస్టాండ్ ఆవరణలో సీసీ నిర్మాణం సగం మాత్రమే చేసి మిగతాది నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటివరకు ప్లాట్‌ఫామ్‌కు తీసిన గోతులతో ప్రయాణికులు ప్రమాదాల బారినపడ్డారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశిస్తున్నా గడువులోపు పూర్తి చేస్తామని అంటున్నారని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఈ పనులు వేగంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Aug 31 , 2024 | 11:34 PM