మొక్కు‘బడి’గా..
ABN, Publish Date - Mar 14 , 2024 | 11:58 PM
‘మన ఊరు - మన బడి’ కథ కంచికేనా?
సర్కారు స్కూళ్లల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాల కల్పన మిథ్యేనా?
రెండేళ్లు గడిచినా తొలి విడతకే దిక్కులేదు
కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకం గతేంటో?
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మార్చి 14 : గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం మొక్కుబడిగానే మారింది. అప్పటి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభినప్పటికీ అమలులో చిత్తశుద్ధి కనబరచలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎంపికైన పాఠశాలలకు నిధులు సకాలంలో వస్తాయో రావో అన్న మీమాంసతో ఈ పథకం మొక్కు‘బడి’గా మారింది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌స్థాయి స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. రెండేళ్ల కిందట ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన తొలి విడత ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించినట్లే కనిపిస్తుంది.
రెండేళ్ల క్రితం ప్రారంభం
జనవరిలో 2022 అప్పటి ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే సంగారెడ్డి జిల్లాలో తొలి విడతగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పాఠశాలల్లో తరగతి గదులు, ప్రహరీ, వంట గది, డైనింగ్‌హాలుతో పాటు లైబ్రరీ, లేబరేటరీ, టాయిలెట్లు, తాగునీటి వసతి, విద్యుత్తు తదితర కనీస వసతులను కల్పించాల్సి ఉన్నది. ఇందు కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చడంతో పాటు దాతల నుంచి విరాళాలు సేకరించాలని కూడా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
ముందుకు రాని కాంట్రాక్టర్లు
సంగారెడ్డి జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన 1262 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో తొలి విడతగా 441 ప్రభుత్వ పాఠశాలలకు చోటు దక్కింది. అదే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నాటికి వసతులను కల్పించాలని డెడ్‌లైన్ విధించుకున్నది. అయితే ఇప్పటికి రెండేళ్లు గడిచినా తొలి విడత ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో పనులు పూర్తికాలేదు. ఇక రెండో విడత, మూడో విడత ప్రభుత్వ పాఠశాలలో పనుల పూర్తి గురించి ఆలోచించే స్థితిలో జిల్లా యంత్రాంగం లేదని పేర్కొనవచ్చు. తొలి విడత ఎంపిక చేసిన పాఠశాలలో 333 పాఠశాలల్లో రూ.30 లక్షల లోపు అంచనాలతో పనులను మంజూరు చేశారు. వీటిలో నాలుగు పాఠశాలల్లో పనులను ప్రారంభించలేదు. ఇక రూ.30 లక్షలకుపైగా అంచనాలతో 108 పాఠశాలల్లో పనులు మంజూరయ్యాయి. ఇందులో ఆరు పాఠశాలల్లో పనులను ప్రారంభించనే లేదు. స్కూళ్లలో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు కానీ, స్కూళ్ల నిర్వహణ కమిటీ కాని ముందుకు రావడం లేదు. తాము పనులు చేపట్టినా సకాలంలో బిల్లుల చెల్లింపు జరగదేమోనన్న ఆందోళనతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అధికార వర్గాలు తెలిపాయి.
తొలి విడతలో 41 పాఠశాలల్లోనే పనులు
మొత్తం మీద 441 పాఠశాలల్లో చేపట్టిన వివిధ పనుల్లో 179 పాఠశాలల్లోనే కొంతమేర పూర్తయ్యాయి. మిగిలిన 262 ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. పాఠశాలలకు అవసరమైన గ్రీన్‌చాక్ బోర్డులు, డ్యూయల్ డెస్క్‌లు, కుర్చీలు, టేబుళ్లు కూడా పూర్తిస్థాయిలో అందలేదు. పాఠశాల ప్రహరీ గోడలో విద్యాప్రాముఖ్యత, జాతీయ నేతల గురించి తదితర అంశాలపై వేయించాల్సిన పెయింటింగ్ పూర్తి చేయించలేదు. 441 ప్రభుత్వ పాఠశాలల్లో 41 పాఠశాలల్లోనే చెప్పుకోదగ్గ స్థాయిలో పనులు పూర్తి అయ్యాయి. ఇలా పూర్తయిన అన్ని రకాల పనులతో పాటు అసంపూర్తిగా వదిలేసిన పనులకు ఇప్పటివరకు ప్రభుత్వం రూ.76 కోట్లు చెల్లించడం గమనార్హం. ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం సమీక్షిస్తుందా లేదా వేచి చూడాలి. దీనిపై విద్యాశాఖ వర్గాలకు స్పష్టత కొరవడింది.
Updated Date - Mar 14 , 2024 | 11:58 PM