వీరభద్రా.. నీ భూమి భద్రమేనా!?
ABN, Publish Date - Jul 29 , 2024 | 11:41 PM
చేర్యాల మండలం షబాషీగూడెంలో కొలువైన వీరభద్రస్వామికి పెద్దచిక్కే వచ్చిపడింది..!! దేవాదాయ, రెవెన్యూశాఖాధికారుల మధ్య సమన్వయం, సమాచారలోపం కారణంగా దేవుడిభూమిపై వివాదం రాజుకుంది.
షబాషీగూడెం ఆలయ భూమిపై వివాదం
1981లో 7.30ఎకరాలు విరాళమిచ్చిన పట్టాదారుడు
దేవాదాయశాఖ రికార్డుల్లోనూ నమోదు
ఇరు శాఖల మధ్య సమన్వయ, సమాచారలోపం
2013లో కూతురు పేరిట పట్టా
ఏడాదిన్నరక్రితం ఆమె వారసుడి పేరిట పట్టామార్పిడి
అక్రమ పట్టారద్దు చేయాలని గ్రామస్థుల ఆందోళన
చేర్యాల, జూలై 29 : చేర్యాల మండలం షబాషీగూడెంలో కొలువైన వీరభద్రస్వామికి పెద్దచిక్కే వచ్చిపడింది..!! దేవాదాయ, రెవెన్యూశాఖాధికారుల మధ్య సమన్వయం, సమాచారలోపం కారణంగా దేవుడిభూమిపై వివాదం రాజుకుంది. స్వామి వారి ఆలయం, భూమి వివరాలు దేవాదాయశాఖ పరిధిలో పొందుపరిచినప్పటికీ భూములను పరిరక్షించుకోవడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడం, రెవెన్యూ అధికారులు సైతం పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించకుండానే పట్టామార్పిడి చేయడంతో అసలుకే ఎసరువచ్చింది. అయితే, అక్రమంగా పట్టా చేయడం తగదని, దేవుడి పేరిట పట్టాదారు పాసుబుక్కులు అందించాలని స్థానికులు ఆందోళన బాట పట్టారు. ఏడాదిన్నరక్రితం అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రా లు సమర్పించడంతో పాటు కోర్టును ఆశ్రయించారు. ఇటీవల పట్టాదారుడి వారసుడు భూమి కొలతలు చేయించి హద్దుల నిర్ధారణకు ఉపక్రమించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేనిభూమిని అక్రమంగా కాజేయాలని యత్నిస్తుండటం తగదని మండిపడుతూ ఆందోళన చేపట్టారు. జరిగిన తప్పిదంపై రెండుశాఖల అధికారులు భిన్న ప్రకటనలు చేస్తుండడంతో అసలు భూమి ఎవరిది....ఎవరికి చెందుతుందన్న అయోమయం నెలకొన్నది.
షబాషీగూడెం శివారులో ఎన్నోయేళ్లక్రితం వీరభద్రుడు, శివాలయం నిర్మించారు. ఆలయానికి ఆదాయవనరులు లేకపోవడంతో ఉప్పల రామ చంద్రయ్యనాగపురి గ్రామరెవెన్యూ పరిధిలో సర్వే నెం.705లో 7.30 ఎకరాల వ్యవసాయభూమిని 1981లో విరాళంగా ఇచ్చాడు. అప్పటికే ఆయన హరిజనుల ఇళ్ల స్థలాల కోసం సుమారు మూడుఎకరాల భూమి అందించాడు. ఆయా భూములపై తన వారసులకు ఎలాంటి హక్కులు ఉండవని పత్రములో రాయించి ఇచ్చాడు. తహసీల్ పహణీ రికార్డులలో 1981 నుంచి 2012వరకు పట్టాదారుడిగా ఉప్పల రామచంద్రయ్య పేరు ఉండగా, కాస్తుకాలంలో ఆలయం అమలు వచ్చినది. కానీ సంబంధిత భూమిని దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం, ప్రస్తుతం భూములకు డిమాండ్ రావడంతో తిరిగి అతడి వారసులు స్వాధీనపరుచుకునేందుకు యత్నిస్తుండటం కలకలం రేపుతుంది.
వైకుంఠధామ నిర్మాణ ంతో బయటపడిన తతంగం
ఉప్పల రామచంద్రయ్య హరిజనులకు, ఆలయానికి భూమిని విరాళంగా ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆలయానికి ఇచ్చిన భూమిని తహసీల్ రికార్డులలో సర్దుబాటు చేయలేదు. 2013లో అప్పటి అధికారులు రామచంద్రయ్య కూతురు ఎలిశాల లక్ష్మి పేరిట పట్టామార్పిడి చేశారు. ఈవిషయం బయటకు పొక్కలేదు. షబాషీగూడెం కాలనీ గతంలో నాగపురి గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. నూతన జిల్లాల నేపథ్యంలో గ్రామపంచాయతీగా ఏర్పడింది. ప్రభుత్వం ప్రతీ గ్రామంలో వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్‌షెడ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంది. షబాషీగూడెంలో ప్రభుత్వస్థలం అందుబాటులో లేకపోవడం, పద్మశాలీ కులస్తులు యేళ్లతరబడిగా శ్మశానవాటికగా వినియోగిస్తుండటంతో గ్రామస్థులంతా కలిసి ఆలయ భూమిలో కొంత మేర కేటాయించాలని భావించారు. దీంతో ఆలయ భూముల్లో వైకుంఠధామం, డంపింగ్‌షెడ్ పనులు చేపట్టారు. అప్పటికీ భూమి విషయాన్ని అధికారులెవరూ గుర్తించలేదు. నిర్మాణ విషయం తెలుసుకున్న ఎలిశాల లక్ష్మి తమ పట్టాభూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం తగదని అడ్డుచెబుతూ కోర్టును ఆశ్రయించారు. తద్వారా నిర్మాణాలు నిలిచిపోయాయి. డిసెంబరు 2022లో సంబంధింత భూమి ఎలిశాల ఆనంద్ పేరిట మార్పిడి చేయడంతో అగ్గిరాజుకుంది. తహసీల్ అధికారులు రూ.లక్షల్లో మామూళ్లు పొంది మార్పిడి చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి.
కొనసాగుతున్న స్థానికుల ఆందోళనలు
ప్రభుత్వ భూములు, ఆలయ భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో పొందుపరిచినప్పటికీ వీరభద్ర ఆలయ భూములను పట్టించుకోకపోవడం, ధరణి పోర్టల్‌లో నమోదు చేయకపోవడంతో సులువుగా పట్టామార్పిడి జరిగింది. ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పట్టా రద్దు చేసి దేవుడి పేరిట పాసుబుక్కులు మంజూరుచేయాలని గ్రామస్థులు కొన్నాళ్లక్రితం తహసీల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పట్టాదారులతో పాటు గ్రామస్థులు కూడా భూమిని కోల్పోకుండా ఉండేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ కూడా పొందారు. కానీ ఆనంద్ ఇటీవల ఏడీతో భూమి కొలతల నిర్వహణకు ఉపక్రమించిన నేపథ్యంలో గ్రామస్థులంతా మరోమారు ఏకమై సర్వే చేపట్టవద్దంటూ ఆందోళన చేపట్టారు. తహసీల్దారుకు వినతిపత్రం అందించారు.
దేవాదాయశాఖ రికార్డుల్లో నమోదైంది
- విశ్వనాథశర్మ, దేవాదాయశాఖ అధికారి
వీరభద్రస్వామి ఆలయంతో పాటు ఉప్పల రామచంద్రం దానపూర్వకంగా ఇచ్చిన ఏడెకరాలముప్పయిగుంటలుభూమి వివరాలు దేవాదాయశాఖ 43 రిజిస్టర్‌లో నమోదైంది. పట్టామార్పిడి జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే పాసుబుక్కుల రద్దుకోసం తహసీల్ కార్యాలయాధికారులకు లేఖ పంపించాం. దేవాలయభూమి పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం.
ఆలయ భూమిని కాపాడుకుంటాం
- వుల్లంపల్లి కరుణాకర్, నాగపురి
ఆలయానికి విరాళంగా ఇచ్చిన భూమిని ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోము. విరాళంగా అందించినప్పుడు దస్తూరి రాసిన వారితో పాటు సాక్షులు ఇప్పటికీ జీవించే ఉన్నారు. స్థానికంగా లే కుండా, ఏనాడూ భూమి గురించిగానీ, ఆలయం గురించి పట్టించుకోనివారు అక్రమంగా భూమిని కాజేయాలని చూస్తున్నారు. గతంలోనే సర్వే చేపట్టినప్పటికీ మోఖాపై భూమి తేలలేదు. తిరిగి ఏడీ ద్వారా సర్వేచేపట్టేందుకు ఎలాంటి ఆస్కారంలేదు. దేవాదాయశాఖ, రెవెన్యూశాఖ అధికారులు చొరవ వహించి దేవుడి భూమి కాపాడాలి.
Updated Date - Jul 29 , 2024 | 11:42 PM