నీళ్లొస్తున్నాయ్..
ABN, Publish Date - Aug 05 , 2024 | 11:44 PM
నీళ్లు లేక నిండుకున్న రిజర్వాయర్లకు నిండుదనం రాబోతున్నది. ఆరునెలలుగా వెలవెలబోతున్న జలాశయాలకు పునరుజ్జీవం కలగనున్నది. పంటలు వేసి సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతాంగం ఆశలు తీరనున్నాయి.
మిడ్‌మానేరు నుంచి నీటి ఎత్తిపోత
అనంతగిరి రిజర్వాయర్ మీదుగా జిల్లాకు..
రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌కు జలకళ
అడుగంటిన జలాశయాలకు పునరుజ్జీవం
50 టీఎంసీలు ఎత్తిపోస్తేనే ప్రయోజనం
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఆగస్టు 5 : నీళ్లు లేక నిండుకున్న రిజర్వాయర్లకు నిండుదనం రాబోతున్నది. ఆరునెలలుగా వెలవెలబోతున్న జలాశయాలకు పునరుజ్జీవం కలగనున్నది. పంటలు వేసి సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతాంగం ఆశలు తీరనున్నాయి. సరిపడా వర్షాలు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులంతా కాళేశ్వరం ఎత్తిపోతల వైపే ఎదురుచూశారు. పరిస్థితి విషమిస్తుండడంతో తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సైతం ప్రభుత్వానికి లేఖ రాశారు. మొత్తమ్మీద సర్కారు కరుణించి మిడ్‌మానేరు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నుంచి జిల్లా సరిహద్దులో ఉన్న అనంతగిరి(అన్నపూర్ణ) రిజర్వాయర్‌లోకి జలాలు వచ్చి చేరుతున్నాయి.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లను నిర్మించగా గౌరవెల్లి రిజర్వాయర్ తుదిదశలో ఉంది. ఈ రిజర్వాయర్లలో సుమారు 80 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. వానాకాలంలో ఈ రిజర్వాయర్లలోకి నీటిని ఎత్తిపోస్తే యాసంగి సీజన్‌లోనూ పంటలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. గడిచిన పలు సందర్భాల్లోనూ ఇది రుజువైంది.
మిడ్‌మానేరు టు సిద్దిపేట
గత నాలుగు దఫాలుగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్‌మానేరు ద్వారా జిల్లాలోకి గోదావరి జలాలను ఎత్తిపోశారు. మేడిగడ్డ బ్యారేజి వద్ద ఎత్తిపోతలకు అనుకూలంగా లేకపోవడంతో నీలినీడలు కమ్ముకున్నాయి. ఈసారి సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న రాజరాజేశ్వర మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి వరద నీరు రావడంతో జలకళ సంతరించుకుంది. ఈ రిజర్వాయర్‌గుండానే లోయర్ మానేరు డ్యామ్‌లోకి నీటిని తరలిస్తుంటారు. అటువైపు నీటిని తరలిస్తే జిల్లాలోని రిజర్వాయర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. అందుకే రిజర్వాయర్లలోకి వెంటనే నీటిని ఎత్తిపోయాలనే డిమాండ్లు నెలకొన్నాయి. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సైతం రైతుల విన్నపాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మొదటి దశగా మిడ్‌మానేరు నుంచి నీటిని ఎత్తిపోయడానికి రంగం సిద్దమైంది. ముందుగా జిల్లా సరిహద్దులో ఉన్న అనంతగిరి రిజర్వాయర్‌కు ఎత్తిపోతల ప్రారంభమైంది. ఈ రిజర్వాయర్ గుండా రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లోకి జలాలను తరలిస్తారు.
50 టీఎంసీలు అవసరం
వచ్చే వానాకాలం వరకు సాగు, తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ప్రస్తుతం 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం ఉంది. 3.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న అనంతగిరి రిజర్వాయర్‌లో 0.75 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. 3 టీఎంసీల రంగనాయక సాగర్‌లో 0.67 టీఎంసీలు, 50 టీఎంసీల మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో 8.5 టీఎంసీలు, 15 టీఎంసీల కొండపోచమ్మసాగర్‌లో కేవలం 4.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇవన్నీ పూర్తిస్థాయిలో రైతులకు ప్రయోజనంగా మారాలంటే దాదాపు 50 టీఎంసీలు ఎత్తిపోయాలి. అనంతగిరి, రంగనాయకసాగర్‌లోకి సుమారుగా 6 టీఎంసీలు, మల్లన్నసాగర్‌లోకి 25 టీఎంసీలు, కొండపోచమ్మసాగర్‌లోకి 12 టీఎంసీలు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. మల్లన్నసాగర్ నుంచి శామీర్‌పేట చెరువు మీదుగా హైదరాబాద్‌లో గల ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువుల్లోకి నీటిని తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్, సిద్దిపేటకు తాగునీటి సరఫరా చేసే ప్రణాళిక కూడా సిద్ధమైంది. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు అనుసంధానంగా ఉన్న కాలువల ద్వారా సంగారెడ్డి, హల్దీ కాలువల్లోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇవన్నీ సాధ్యం కావాలంటే రిజర్వాయర్లు నిండుకుండలుగా మారాల్సి ఉంది.
చెరువులు, వాగుల్లోకి తరలించేలా
జిల్లాలో ఇప్పటివరకు సరిపడా వర్షాలు పడిన దాఖలాలు లేవు. ఫలితంగా జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగుల్లోకి నీరు చేరడం లేదు. వర్షాల ద్వారా వచ్చిన వరదలతో ప్రతీసారి చెరువులు, కుంటలు, వాగులు జలకళను సంతరించుకునేవి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. అందుకే రిజర్వాయర్లలోకి నీటిని ఎత్తిపోయగానే ముందుగా చెరువులు, వాగుల్లోకి నీటిని తరలించేలా ప్రయత్నించాలి. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారిన తర్వాత రిజర్వాయర్‌లోనూ పూర్తి సామర్థ్యంతో నీళ్లు ఉండేలా చూడాలి. ఇలా చేస్తేనే ఏడాది పాటు సాగు, తాగునీటి ఇబ్బందులు తలెత్తవు.
Updated Date - Aug 05 , 2024 | 11:44 PM