సొంతింటి కల నెరవేరేదెప్పుడో..
ABN, Publish Date - Aug 22 , 2024 | 11:34 PM
పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. గత ప్రభుత్వ హయాంలో సొంత స్థలంలో ఇల్లు కుట్టకుంటే రూ. 3లక్షలు ఇస్తామని పేర్కొనడంతో పాటు కొందరికి ప్రొసిడింగ్ ఆర్డర్లను ఇచ్చింది. కొత్త ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించినా మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో సాయం ఎప్పుడు అందుతుందోనని జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
కట్టుకుంటే రూ.5 లక్షలిస్తామన్న సర్కారు..
జిల్లాలో 2,36,014 ‘ఇందిరమ్మ’ దరఖాస్తులు
కొందరికి గత ప్రభుత్వహయాంలో ప్రొసిడింగ్ కాపీలు
ఉన్న ఇల్లు కూల్చుకుని కిరాయి ఇళ్లలో
సాయం కోసం లబ్ధిదారుల ఎదురుచూపు
సిద్దిపేట రూరల్, ఆగస్టు 22 : పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. గత ప్రభుత్వ హయాంలో సొంత స్థలంలో ఇల్లు కుట్టకుంటే రూ. 3లక్షలు ఇస్తామని పేర్కొనడంతో పాటు కొందరికి ప్రొసిడింగ్ ఆర్డర్లను ఇచ్చింది. కొత్త ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించినా మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో సాయం ఎప్పుడు అందుతుందోనని జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
ప్రజాపాలనలో జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం 2,36,014 మంది ధరఖాస్తులు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం కోసం 556, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కోసం 3,775 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ఇంటి నిర్మాణానికి సరిపడా స్థలం ఉన్నా ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.3లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణానికి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. లబ్ధిదారులు ఇంటి పనులు ప్రారంభించి బేస్‌మెంట్, పిల్లర్ల స్థాయి వరకు నిర్మాణ పనులు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రొసిడింగ్‌లను రద్దు చేసింది. దీంతో జనవరిలో ఆయా మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట లబ్ధిదారులు ఆందోళనలు చేపట్టి నిరసన తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. అందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినప్పటికీ మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఆర్థిక సహాయం నేటికీ అందక లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రొసీడింగ్ కాపీలను అందుకున్న లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను చేపట్టారు. ఉండడానికి ఇల్లు లేక కిరాయి ఇల్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు దృష్టిసారించి ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ పథకం కింద ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.
ఆర్థిక సహాయం అందించాలి
- బేజగం అఖిల, గుర్రాలగొంది
ఇందిరమ్మ పథకంలో భాగంగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని సొంత స్థలంలో ఇంటి పనులు మొదలు పెట్టాం. పిల్లర్లను నిర్మించాం. ఆర్థిక పరిస్థితులు సరిగా లేక నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశాం. ఉండేందుకు కిరాయికి ఇల్లు దొరకడం లేదు. ఇంటి నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి.
గుడిసెలో ఉంటున్నాం
- చెప్యాల రాజమణి,ఇర్కోడు
ఇల్లు లేకపోవడంతో ఖాళీ స్థలంలో గుడిసె వేసుకుని పిల్లలతో కలిసి ఉంటున్నాం. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు కట్టుకునేందుకు లిస్టులో పేరు వచ్చింది. ఉన్న కాసిన్ని పైసలతో బెస్‌మెంట్ వరకు కట్టుకున్నం. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజురు చేసి ఆదుకోవాలి.
Updated Date - Aug 22 , 2024 | 11:34 PM