ఎన్‌ఐసీ చేతికి ధరణి నిర్వహణ
ABN, Publish Date - Oct 23 , 2024 | 05:59 AM
ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మ్యానిఫెస్టో హామీని అమల్లోకి తీసుకొచ్చింది.
విదేశీ సర్వీస్ ప్రొవైడర్ టెర్రాసిస్ నుంచి విముక్తి
ధరణి సమస్యలకు త్వరలోనే పరిష్కారం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మ్యానిఫెస్టో హామీని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ విదేశీ సంస్థ టెర్రాసిస్ చేతిలో ఉన్న ధరణి నిర్వహణ బాధ్యతను స్వదేశీ సంస్థ ఎన్‌ఐసీ (నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్)కి అప్పగించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ బాధ్యతను జాతీయ సమాచార సంస్థ (ఎన్‌ఐసీ) నిర్వహిస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. త్వరలో ధరణి సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని తెలిపారు. ‘‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు ఎలాంటి ముందుచూపు లేకుండా హడావుడిగా తొందరపాటు నిర్ణయాలతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణకు చెందిన 1.56 కోట్ల ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు టెర్రాసిస్ అనే విదేశీ సర్వీస్ ప్రొవైడర్‌కు తాకట్టు పెట్టారు. ఈ సంస్థ ఒడిసాలో పని చేసి విఫలమైంది. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ధరణి పోర్టల్‌ను దానికి అప్పగించారు. లక్షల మంది రైతుల సాగు భూముల రికార్డులను కేసీఆర్, కేటీఆర్ ఏకపక్షంగా విదేశీ కంపెనీ చేతిలో పెట్టారు.
దాంతో, ఐదేళ్లపాటు ధరణితో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు’’ అని మండిపడ్డారు. ధరణి పేరిట జరిగిన దగాతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోయిందని, ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను బీఆర్‌ఎస్ సర్కారు సమాధి చేసిందని విమర్శించారు. ఆనాటి ప్రభుత్వ పెద్దల దాష్టీకానికి ప్రజలు అనుభవించిన బాధలు అన్నీ ఇన్నీ కావని, కాంగ్రెస్ పాలనలో ఈ సమస్యలకు చరమగీతం పాడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం విదేశీ సర్వీస్ ప్రొవైడర్ చేతిలో ఉన్న ధరణి పోర్టల్‌ను ఎన్‌ఐసీకి అప్పగించామన్నారు. తద్వారా, భూములకు పూర్తి రక్షణ లభించినట్లైందన్నారు. లక్షలాది మంది రైతులు సమస్యల నుంచి గట్టున పడతారని, అన్ని సమస్యలకు త్వరలోనే పరిష్కారాలు లభిస్తాయని అన్నారు.
Updated Date - Oct 23 , 2024 | 05:59 AM