ఇప్పటికే 2.69 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం
ABN, Publish Date - Apr 16 , 2024 | 03:45 AM
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 23 నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 2,69,699 మెట్రిక్ టన్నుల మేరకు కొనుగోళ్లు జరిగాయని వెల్లడించారు. మారుమూల గ్రామాన్ని కూడా వదలిపెట్టకుండా చివరి గింజవరకూ మద్దతు ధరకు
మార్చి 23నే కొనుగోళ్లు ప్రారంభించాం
చివరి గింజ వరకూ కొంటాం
రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు
బీజేపీ, బీఆర్‌ఎస్‌లవి తప్పుడు ఆరోపణలు
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 23 నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 2,69,699 మెట్రిక్ టన్నుల మేరకు కొనుగోళ్లు జరిగాయని వెల్లడించారు. మారుమూల గ్రామాన్ని కూడా వదలిపెట్టకుండా చివరి గింజవరకూ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, ఎమ్మెల్యే మందుల సామ్యేలుతో కలిసి ఉత్తమ్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు, రేషన్ సరఫరాల్లో ప్రభుత్వం సమర్థంగా ముందుకు వెళుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు ఈ ఏడాది జరిగినంత సమర్థంగా గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. గత ఏడాది (2022-23) ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 9న ప్రారంభిస్తే.. ఈ ఏడాది తాము మార్చి 23నే ప్రారంభించినట్లు తెలిపారు. నిరుడు మొత్తం 7031 కేంద్రాలను ఏర్పాటు చేస్తే.. ఈసారి తాము 7149 ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 6919 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. సిద్దిపేటలో గత ఏడాది ఈ సమయానికి ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభం కాలేదని, ప్రస్తుతం 418 కేంద్రాల్లో ధాన్యం కొంటున్నారని మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉంచామన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రాష్ట్రంలోని రైతులు ఒక్క ధాన్యపు గింజను కూడా మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవద్దని సూచించారు. ‘‘నిల్వ ఉన్న యాసంగి ధాన్యాన్ని గత ప్రభుత్వం ఎక్కువగా కొనుగోలు చేసింది. ఆ తర్వాత ధాన్యం పాడవుతుందని చెప్పి అమ్మకానికి పెడితే క్వింటాలుకు రూ.1702 ధర వచ్చింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిటీ వేసి అదే ధాన్యాన్ని అమ్మితే క్వింటాలుకు రూ.2022 చొప్పున వచ్చింది. ధాన్యం వేలం ద్వారా రూ.1110.05 కోట్లు అదనంగా వచ్చాయి’’ అని ఉత్తమ్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో సన్నబియ్యానికి, దొడ్డు బియ్యానికి తేడా లేకుండా వేలంలో అమ్మేశారని ఆరోపించారు. పౌరసరఫరాల శాఖను గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా నడిపిందన్నారు. ప్రతి జిల్లాలో రేషన్ బియ్యం రీసైకిలింగ్ మాఫియా తయారైందని చెప్పారు.
జూన్ 9న ప్రధానిగా రాహుల్ ప్రమాణం
లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 272 సీట్ల కంటే ఎక్కువగా గెలుచుకుంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న ప్రధానమంత్రిగా రాహుల్‌గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి కచ్చితంగా గెలుస్తుందని చెప్పారు. దేశ చరిత్రలో 70 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనన్నారు. వంద హామీలు ఇచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ.. పదేళ్లు అధికారంలో ఉండి కూడా వాటిని అమలు చేయలేదని ఆరోపించారు.
Updated Date - Apr 16 , 2024 | 03:45 AM