మనకూ ఓ హైడ్రా
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:29 AM
హైడ్రా తరహాలో ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్న సీఎం ప్రకటనతో జిల్లాల్లో ఆ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం ఆదేశాలతో ఏర్పాటుకు రంగం సిద్ధం!
ఆక్రమణదారుల గుండెల్లో వణుకు
‘హైదరాబాద్ పట్టణ పరిరక్షణ కోసం తీసుకువచ్చిన హైడ్రా(హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ సంస్థ) వంటి వ్యవస్థలను జిల్లాలోనూ తీసుకువస్తాం, కలెక్టర్ పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేసి ఆక్రమణ తొలగింపునకు కృషి చేస్తాం’
- ఖమ్మం జిల్లాలో మీడియాతో సీఎం రేవంతరెడ్డి
చౌటుప్పల్ టౌన, సెప్టెంబరు 4: హైడ్రా తరహాలో ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్న సీఎం ప్రకటనతో జిల్లాల్లో ఆ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా కలెక్టర్ల పర్యవేక్షణలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నిస్తామని సీఎం రేవంతరెడ్డి పేర్కొనడంతో అందుకు సం బంధించి కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ఆక్రమణదారుల గుండెల్లో వణుకు పుడుతోంది. పట్టణంలోని ఊరచెరువు, నాగులకుంట, పలునాలాలు ఆక్రమణకు గురయ్యాయి. వీటిలో పెద్దపెద్ద భవనాలు వెలిశాయి. యదేశ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. ఆక్రమణలకు సీఎం ప్రకటనతో అడ్డుకట్ట పడుతుందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల వారీగా హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అన్నిరకాల ఆక్రమణలను తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేయడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఊరచెరువు, నాగులకుంటల్లో అక్రమనిర్మాణాలు
చౌటుప్పల్‌లోని ఊరచెరువు, నాగులకుంటలో అక్రమనిర్మాణాలు సాగుతున్నాయి. ఊర చెరువు అలుగు వద్ద అక్రమ నిర్మాణాలు చెరువు కట్టకు ప్రమాదకరంగా మారాయి. మూడేళ్లకిందట రెండు, మూడు పర్యాయాలు కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండి అలుగు పోసేందుకు అక్రమ నిర్మాణాలు తీవ్ర ఆటంకంగా మారాయి. ఒక దశలో చెరువు కట్ట తెగిపోతుందన్న భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. అలుగుకు దిగువతో పాటు ఎగువన చెరువులో సైతం అక్రమ నిర్మాణాలు వెలిశాయి. చివరకు చెరువు కట్టను కూడా ఆక్రమించి అక్రమ నిర్మాణాలను చేపట్టారు. మొత్తంగా ఊర చెరువు ప్రమాదంలో పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రమా దవశాత్తు చెరువు కట్ట తెగితే చౌటుప్పల్ పట్టణం సగం వరకు కొట్టుకుపోవడం ఖాయమంటున్నారు. అదే జరిగితే పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నాగులకుంట సైతం అక్రమ నిర్మాణాలకు నిలయంగా మారింది. మూడు నుంచి నాలుగు ఎకరాల మేరకు ఆక్రమణకు గురైంది. నాగులకుంటలో చుట్టుఅక్రమ నిర్మాణాలతో నిండింది. కట్టపై కూడా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. చెరువు, కుంటల్లోని శిఖం భూములతో పాటు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలోని అక్రమ నిర్మాణాలు వెలిశాయి.
ఫ రెవెన్యూ రికార్డుల ప్రకారంగా సర్వే నెంబరు 363లో ఊరచెరువు శిఖం భూమి 33.37 ఎకరాల భూమి ఉంది. ఈ చెరువుకు ఎఫ్‌టీఎల్ పట్టా భూమిలో ఉండగా, దానికి అదనంగా 30 మీటర్ల వెడల్పుతో చుట్టురా బఫర్‌జోన ఉంటుంది. అదే విధంగా సర్వే నెంబరు 322లో నాగులకుంట శిఖం భూమి 11.32 ఎకరాల్లో ఉంది. ఈ భూమికి శిఖం భూమి వెంట ఎఫ్‌టీఎల్ ఉంటుంది. ఈ భూమికి చుట్టూరా 9 మీటర్ల వెడల్పుతో బపర్‌జోన ఉంటు ంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూములకు చుట్టుపక్కల సర్వే నెంబర్లు వేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. ఇలాంటి అక్రమ కట్టడాలకు గ్రామపంచాయతీ అధికారులు ఇంటి నెంబర్లు వేసి తోచినంత దండుకున్నారన్న ఆరోపణలున్నాయి.
హైడ్రా కోసం ఎదురుచూస్తున్న ప్రజలు
హైడ్రా వంటి వ్యవస్థ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. చెరువు, కుంటలతో పాటు నాలాలు, బఫర్‌జోనలు, ఎఫ్‌టీఎల్‌లను ఆక్రమించి చేపట్టిన అక్రమ కట్టడాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ భూములు, భూదానభూములు, సీలింగ్ భూములు ఆక్రమణకు గురయ్యాయి. చివరకు ఇండోర్ స్టేడియంతో పాటు గాంధీపార్క్ స్థలాన్ని సైతం కబ్జాచేయడంతో కుంచించుకుపోయాయి.
ఇరవై ఏళ్లలో మూడుసార్లు
వరద
చౌటుప్పల్ పట్టణంలోని తంగడపల్లి రోడ్డు, చిన్న కొండూరు రోడ్డులోని నాలాలను ఆక్రమించి నిర్మాణాలను చేశారు. దీంతో వర్షాల సమయంలో వరద సజావుగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 2005, 2020, 2021లలో కురిసిన భారీ వర్షాలకు పట్టణంలోని సగభాగం జలమయమైంది. 2005 అక్టోబరు 28, 29 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు వారం రోజుల వరద నీరు జాతీయ రహదారిపై పారగా, 10 రోజుల పాటు ఆర్టీసీ బస్‌స్టేషనలోకి బస్‌లు వెళ్లలేదు. అదేవిధంగా 2020, 2021లలో కురిసిన భారీవర్షాలకు పట్టణం జలమయమైంది. అనేక కాలనీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు నీటమునిగాయి. చెరువు అలుగు వద్ద చేసిన అక్రమ నిర్మాణాలతో పాటు నాలాల ఆక్రమణతో వరద నీరు ముందుకు సజావుగా వెళ్లలేక ఇళ్లలోకి చేరింది. గాంధీ పార్క్‌లో చేరిన వరద నీటిని బయటకు పంపించేందుకు మునిసిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అదేవిధంగా హ్యాండ్లూమ్ మార్కెట్ వీధిలోకి చేరిన వరదతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. చెరువు తూం వద్ద నుంచి దిగువ భాగానికి వెళ్లే నీటి కాల్వను కుదించి అక్రమ నిర్మాణాలను చేపట్టారు. రోజుల తరబడి వరద నీటితో పట్టణ ప్రజలు తీవ్రఇబ్బందులను ఎదుర్కొన వలసి వచ్చింది.అండర్‌గ్రౌండ్ ఇళ్ల యజమానుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ సమస్య అంతా నాలాల ఆక్రమణతోనే తలెత్తింది. వచ్చిన నీరు వచ్చినట్టుగానే వెళ్లి పోతే ఈ పరిస్థితి ఉండేది కాదు.
పూర్తి అధికారాలిస్తే
ఆక్రమణలను తొలగిస్తాం
హైదరాబాద్‌లో హైడ్రాకు ఇచ్చిన విధంగానే జిల్లా స్థాయి కమిటీకి పూర్తి అధికారాలు ఇచ్చిన పక్షంలో అన్నిరకాల ఆక్రమణలను తొలగిస్తామని జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసే కమిటీలో అన్నిశాఖల అధికారులను నియమించాలని, అలాచేసిన పక్షంలో ఆక్రమణల తొలగింపు సునాయాసంగా జరుగుతుందన్నారు. సీఎం రేవంతరెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమం భవిష్యత తరాలకు ఎంతో మేలు చేయనుందని, అందుకు ప్రజలు కూడ స్వాగతించడం హర్షనీయమన్నారు.
Updated Date - Sep 05 , 2024 | 12:29 AM