ఉచిత పశుగ్రాసంపై కార్యాచరణ
ABN, Publish Date - Nov 17 , 2024 | 01:03 AM
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పశుగ్రాస విత్తనాల పంపిణీకి కార్యాచరణ రూపొందిస్తోంది.
ఐదేళ్ల పాటు గడ్డివిత్తనాల పంపిణీకి సమాలోచన
విత్తనాల కోసం ఎనఎల్‌ఎంకు సీడ్ కార్పొరేషన నివేదిక
నల్లగొండ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పశుగ్రాస విత్తనాల పంపిణీకి కార్యాచరణ రూపొందిస్తోంది. ఇటీవల రాష్ట్ర పశుసంవర్ధక, పాడి, పరిశ్రమ అభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి ఉచిత పశుగ్రాస విత్తనాలపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలో కేవలం పశుగ్రాస కొరత వచ్చినప్పుడు మాత్రమే అప్పటికప్పుడు విత్తనాల పంపిణీ చేపట్టినా ప్రయోజనం లేకుండాపోతుంది. దీంతో పశువులను రైతులు విక్రయించే పరిస్థితి దారితీస్తోంది. పశుగ్రాసం లేకపోవడంతో మూగజీవులు ఆకలితో అలమటించిన దాఖాలాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో పశువులకు గ్రాసం కొరత ఉండకుండా చూడటంతో పాటు పాల ఉత్పత్తుల కోసం మేత సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలో అన్నిరకాల పశువులు కలిపి 11 లక్షలకు పైగా ఉండగా, గొర్రెలు, మేకలు 27 లక్షలకుపైగా ఉన్నట్లు సమాచారం. పశువులతో పాటు షెడ్‌లలో పెంచే గొర్రెలు, మేకలకు కూడా పశుగ్రాసం అందిస్తే పశుసంపద పెరగడంతో పాటు రైతులకు కూడా ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వ్యవసాయం తరువాత పాడిపరిశ్రమే రైతులకు అండగా ఉంటుంది. పాల ఉత్పత్తులు పెరిగేందుకు పచ్చిగడ్డి అవసరం ఉన్నందున ఉచిత పశుగ్రాస కార్యక్రమంపై కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ప్రతియేటా ముఖ్యంగా వేసవిలో పశుగ్రాసం లభించక రైతులు ఇతర రాషా్ట్రలకు వెళ్లి అధిక ధరలకు గడ్డిని కొనుగోలు చేసి తెస్తున్నారు. ఎండు గడ్డి కంటే పచ్చిగడ్డి వల్ల పశువులకు ప్రయోజనం చేకూరుతుండగా పాడి పశువుల వల్ల పాల ఉత్పత్తులు గణనీయంగా పెరిగి రైతుల ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడనున్నందున ఉచిత పశుగ్రాసం కోసం కార్యాచరణ సిద్ధమవుతోంది.
ఎనఎల్‌ఎంకు నివేదికలు
కేంద్రంలోని నేషనల్ లైవ్ స్టాక్ మిషన(ఎనఎల్‌ఎం)కు ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులు నివేదికలు అందజేశారు. ఎనఎల్‌ఎంను 2014-15లో ప్రారంభించారు. పశువుల సంపదల పెరుగుదల, గుణాత్మక మార్పులు, ఇతర పశువుల పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న ఎనఎల్‌ఎంతో రాష్ట్రంలోని షీల్డ్ కార్పొరేషన ఒప్పందాలు చేసుకొంది. పశుగ్రాస విత్తనాల లభ్యత ఎలా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఏ మేర పంపిణీ చేయాలి. ఐదేళ్ల పాటు నిరంతరం అంటే ప్రతి ఏడాదిలోని 12నెలల పాటు రైతులు ఎప్పుడు అడిగినా విత్తనాలు అందించాలని ఒప్పందాల్లో పొందుపరిచారు. డిమాండ్ మేరకు పశుగ్రాస విత్తనాల ప్రాసెసింగ్ కోసం యూనిట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. పశు సంపద పెంపుకోసం సాంకేతికంగా కూడా చర్యలు చేపట్టనున్నారు.
పశుసంవర్థక పథకం అమలు కోసం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పశుసంపద, పాల ఉత్పత్తి పెంపునకు జాతీయ పశు సంవర్ధక పథకం అమలు కోసం రాష్ట్రస్థాయి అధికారులు నిర్వహించిన సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఓవైపు పశుగ్రాసం ఉచిత విత్తనాల పంపిణీతో పాటు కొత్తగా గొర్రెలు, మేకల యూనిట్లు, పౌలీ్ట్రకి రుణాలు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధంచేశారు. బ్యాంకర్లతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయా పథకాలకు సబ్బిడీ అందించడం, లబ్ధిదారులకు అవగాహన కల్పించే విషయంపై చర్చించారు. ఇక ఈ పథకాలన్నీ అమలుకోసం తీసుకోవాల్సిన చర్యలను, సిబ్బంది కొరతలను అధిగమించడం వంటి వాటిపై దృష్టి సారించారు. ముఖ్యంగా వరి కోత మిషన్లతోనే అధికంగా వరికోతలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా వరకు గడ్డి నష్టం వాటిల్లుతోంది. ఎండుగడ్డి కొరత పదేపదే వస్తుండటంతో ఆ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అధికారులు సీడ్ కార్పొరేషనతో కలిసి ఎనఎల్‌ఎంకు పంపించిన నివేదిలకు ఆమోదం లభిస్తే ఈ పశుసంవర్ధక పథకం మరింత పటిష్టంగా అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక రైతులు కూడా వరి, మెట్టపంటలతో పాటు పశుగ్రాసం కోసం ప్రత్యేకంగా కొంత భూమిని కేటాయించుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా భూమిలో పశుగ్రాసం పెంచడంతో పాటు పొలాల గట్లపై పశుగ్రాసం పెంచితే పచ్చిమేత కష్టాలను అధిగమించవచ్చని భావిస్తున్నారు.
Updated Date - Nov 17 , 2024 | 01:03 AM