సన్నధాన్యమంతా మిర్యాలగూడకే!
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:26 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైస్‌మిల్లులకు సన్నధాన్యం పోటెత్తుతోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భారీగా సన్న ధాన్యం మిర్యాలగూడకు వస్తుండడంతో ఇదే అదునుగా మిల్లర్లు ధర తగ్గిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి భారీగా వస్తున్న ధాన్యం
ఇదే అదునుగా ధర తగ్గిస్తున్న మిల్లర్లు
ప్రస్తుతం ధాన్యమంతా నాన్ ఆయకట్టు నుంచే
సాగర్ ఆయకట్టు ధాన్యం వస్తే ఒత్తిడి పెరిగే అవకాశం
నల్లగొండ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతిప్రతినిఽధి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైస్‌మిల్లులకు సన్నధాన్యం పోటెత్తుతోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భారీగా సన్న ధాన్యం మిర్యాలగూడకు వస్తుండడంతో ఇదే అదునుగా మిల్లర్లు ధర తగ్గిస్తున్నారు. దీంతో రైతు లు ఆందోళనలకు దిగుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న ధాన్యం విక్రయిస్తే మద్దతు ధరతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా, రైతులు మా త్రం నేరుగా మిల్లులకే ధాన్యం తీసుకొస్తుండటంతో మిర్యాలగూడలో మిల్లుల వద్ద రద్దీ పెరిగింది. ప్రస్తుతానికి నాన్‌ఆయకట్టు ధాన్యమే రోజుకు మూడువేల ట్రాక్టర్ల వరకు వస్తోంది. మరో వారంలో సాగర్ ఆయకట్టులో కోతలు ప్రారంభమైతే ఆరువేల ట్రాక్టర్ల వరకు ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, మద్దతు ధర దక్కాల న్నా మిల్లుల వద్ద కొనుగోళ్లపై అఽధికార యంత్రాంగం నిత్యం పర్యవేక్షణ చేయాలని, టోకె న్ల విధానంలో లోపాలు లేకుండా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ధాన్యం ట్రాక్టర్లు బారులు
ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి సూర్యాపేట జిల్లాలో జరుగుతున్నా, ఆధునిక టెక్నాలజీ, అధిక మిల్లింగ్ సామర్థ్యం కలిగిన రైస్‌మిల్లులు మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. జిల్లాలో అత్యధిక ధాన్యం ప్రధానంగా సన్నధాన్యం మిర్యాలగూడ మిల్లులకే వస్తోంది. సూర్యాపేట జిల్లాలో మిల్లుల్లో ఆధునిక టెక్నాలజీ లేకపోవడం, మిల్లింగ్ సామర్థ్యం స్వల్పంగానే ఉండడంతో అనివార్యంగా ఈ రెండు జిల్లాల ధాన్యం మిర్యాలగూడ మిల్లులకే వస్తోంది. దీంతో వానాకాలం సన్నధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు ఆడిందే ఆటగా మారింది. నల్లగొండ జిల్లాలో ప్రధానంగా మిర్యాలగూడ డివిజన్‌లో ఉన్న 120కి పైగా మిల్లుల్లో అత్యాధునిక సాంకేతికత, మిల్లింగ్ సామర్థ్యం కలిగిన రైస్‌మిల్లులు 84 వరకు ఉన్నాయి. వాటిల్లో ఒక్క రోజులో ఒక్కో మిల్లులో కనీసం 1,500 మెట్రిక్‌టన్నుల ధాన్యం వరకు మిల్లింగ్ చేయవచ్చు. అదే సూర్యాపేట జిల్లాలో 100 వరకు మిల్లులు ఉండగా, 54 వరకు మాత్రమే పార్‌బాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. వాటికి నల్లగొండ జిల్లాలోని మిల్లుల టెక్నాలజీ, మిల్లింగ్ సామర్థ్యం లేకపోవడంతో అక్కడి సన్నధాన్యమంతా మిర్యాలగూడ మిల్లులకే వస్తోంది. అందుకే ఈ సీజన్‌లో మిర్యాలగూడ మిల్లుల వద్ద విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో మొత్తం 12.68లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా, మొత్తం 29.28లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తోందని అంచనా. అందులో సన్నధాన్యం 16.08లక్షల మెట్రిక్‌టన్నులు కాగా, 13.20లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం ఉంది. సన్నధాన్యం అత్యధికంగా సూర్యాపేట జిల్లా నుంచి 9లక్షల మెట్రిక్ టన్నులు, నల్లగొండ జిల్లా నుంచి 6.40లక్షల మెట్రిక్‌టన్నులు, యాదాద్రి జిల్లా నుంచి 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అంచనావేశారు.
ఆయకట్టు ధాన్యమొస్తే ఎలా?
నాన్ ఆయకట్టు ప్రాంతాలైన నల్లగొండ, దేవర కొండ, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, సూర్యాపేట, భువనగిరి ప్రాంతాల నుంచి ఇప్పటికే మిర్యాలగూడ ప్రాంతానికి ధాన్యం ట్రాక్టర్ల రాక భారీగా ఉంది. ఆదివారం ఒక్కరోజే మూడువేలకు పైగా ట్రాక్టర్లలో ధాన్యం వచ్చింది. ఇప్పుడే ధాన్యం ఎక్కువగా వస్తుండడంతో మిల్లుల వద్ద రద్దీ పెరిగి రైతులకు ధర తగ్గిస్తున్నారనే ఆందోళన కనిపిస్తుంటే, వచ్చేవారం నుంచి నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలైన సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి ధాన్యం వస్తే కొనుగోళ్లలో ఇబ్బందులు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన రైతుల్లో ఉంది.
నిరంతర పర్యవేక్షణతోనే..
సన్నధాన్యం విక్రయాల్లో రైతులకు అన్యాయం జరగకుండా మద్దతు ధర దక్కాలంటే మిల్‌పాయింట్ల వద్ద ధాన్యం కొనుగోళ్లపై అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయం, మార్కెటింగ్ శాఖాధికారులతో సంయుక్తంగా టోకెన్ విధానం అమలు చేయడంతోపాటు, మిల్లుల్లో రిజిస్టర్ల నిర్వహణ, రద్దీ లేకుండా ఎప్పటికప్పుడు కాంటాలు వేయడం, ధర కోత విధించకుండా చూసేందుకు పర్యవేక్షణ కమిటీలను తక్షణం అమలులోకి తేవాల్సి ఉంది. రెవెన్యూ, సివిల్‌సప్లయిస్, మార్కెటింగ్, పోలీసుల భాగస్వామ్యంతో ఉండే ఈ కమిటీలు ప్రతిరోజూ మిల్లులను తనిఖీచేసి కొనుగోళ్లను పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు. ప్రధానంగా ఆదివారం, పండగ రోజులు, సెలవు దినాల్లో మిల్లుల్లో వర్కర్లు లేరని, గుమస్తాలు రాలేదని సాకులు చెబుతూ మిల్లర్లు ఉన్నట్లుండి కాంటాలు నిలిపివేస్తున్నారని, ముందస్తు సిండికేట్ ప్రకారం ఒక రోజు కొన్ని మిల్లుల్లో ధాన్యం కొనుగోలుచేసి, ఇంకో రోజు ఇంకోన్ని మిల్లుల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఆదివారం ఈ విషయం తేలిందని, దీన్ని పరిగణనలోకి తీసుకొని మిల్లుల సామర్థ్యంమేరకు టోకెన్లు కేటాయించిన ధాన్యానికి కాంటాలు వేసేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మిల్‌పాయింట్ల వద్ద ఇప్పటికే సుమారు రెండులక్షల మెట్రిక్‌టన్నుల వరకు ధాన్యం వచ్చి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Updated Date - Nov 12 , 2024 | 12:26 AM