బేతవోలు పీఏసీఎస్ సీఈవో, క్యాషియర్ తొలగింపు
ABN, Publish Date - Sep 12 , 2024 | 12:21 AM
మండలంలోని బేతవోలు ప్రాథమిక సహకార సంఘంలో రైతులకు వ్యవసాయ రుణాల మంజూరులో జరిగిన అవకతవకలపై పీఏసీఎస్ సీఈవో, క్యాషియర్‌ను తొలగిస్తూ పాలకవర్గం తీర్మానం చేసింది. సహకార సంఘంలో అవకతవకలపై కోదాడ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు మంగళవారం ప్రాథమిక విచారణ నిర్వహించారు.
చిలుకూరు, సెప్టెంబరు 11: మండలంలోని బేతవోలు ప్రాథమిక సహకార సంఘంలో రైతులకు వ్యవసాయ రుణాల మంజూరులో జరిగిన అవకతవకలపై పీఏసీఎస్ సీఈవో, క్యాషియర్‌ను తొలగిస్తూ పాలకవర్గం తీర్మానం చేసింది. సహకార సంఘంలో అవకతవకలపై కోదాడ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు మంగళవారం ప్రాథమిక విచారణ నిర్వహించారు. 2021లో రైతుల రుణాల మంజూరు రికార్డులను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ షరీఫ్, షేక్ బాషామియా, షేక్ రుక్ముద్దీన్‌తో పాటు పోలేనిగూడెం గ్రామానికి చెందిన తోనం నరేష్ తదితర రైతుల పేర్లతో అధికారులు రుణాలు స్వాహా చేసినట్టు తేలిచింది. అయితే పూర్తిస్థాయి విచారణ కోసం రికార్డులు పరిశీలించాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే దీనికి బాధ్యులైన సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార బ్యాంకు చైర్మన్, అధికారులు బేతవోలు సహకార సంఘ చైర్మన్‌ను ఆదేశించారు. దీంతో పాలకవర్గ అత్యవసర సమావేశం నిర్వహించి, అవినీతికి పాల్పడిన సీఈవో పాషా, 2021లో క్యాషియర్‌గా పనిచేసిన వాజిద్ అలీని విధుల నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు. సంఘ కార్యకలాపాల నిర్వహణ కోసం ఇన్‌చార్జీగా సీఈవోగా బత్తిన కన్నయ్య, క్యాషియర్‌గా నజీర్‌ను నియమించారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై చట్టపరంగా చర్యలు తీసుకుని, డబ్బు రికవరీ చేస్తామని సంఘం చైర్మన్ బజ్జూరి రవీందర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో డైరెక్టర్లు తాళ్లూరి ప్రసాద్, బజ్జూరి సత్యనారాయణరెడ్డి, మద్ది సుదర్శన్‌రెడ్డి, అనంతు ప్రమీల, సోక్లా, మరియమ్మ, దొంగరి గోపాల సత్యనారాయణ పాల్గొన్నారు.
Updated Date - Sep 12 , 2024 | 12:21 AM