ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మూసీ మురిసేలా ప్రక్షాళిస్తాం

ABN, Publish Date - Oct 19 , 2024 | 12:40 AM

కాలుష్య కాసారంగా మారిన మూసీ నదిని పునరుజ్జీవింపజేయడం తక్షణ కర్తవ్యమని ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు. మూసీ ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సఫలం అయితేనే ఉమ్మడి జిల్లా మూసీ పరివాహక రైతాంగ కన్నీటి బాధలు తీరుతాయని అంటున్నారు.

నల్లగొండ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాలుష్య కాసారంగా మారిన మూసీ నదిని పునరుజ్జీవింపజేయడం తక్షణ కర్తవ్యమని ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు. మూసీ ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సఫలం అయితేనే ఉమ్మడి జిల్లా మూసీ పరివాహక రైతాంగ కన్నీటి బాధలు తీరుతాయని అంటున్నారు. ఒకవైపు మురికి నీరు, మరో వైపున పరిశ్రమల వ్యర్ధాల కలయికతో మూసీ నీరు విషతుల్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో మూసీ పరివాహకంలో ఈ నీటితోనే సేద్యం చేసి పండిన పంటని ఇక్కడ అమ్ముకోలేని, తినలేని దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ నది పునరుజ్జీవానికి రాజకీయలకతీతంగా అందరూ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. మూసీ పరివాహక ప్రజల కష్టాలపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసంశనీయమని , సామాజిక బాధ్యతగా పత్రిక విషయాలని వెల్లడించడం అభినందనీయమని పలువురు నేతలుపేర్కొన్నారు. హైదరాబాద్‌ మహానగర మురుగునీరు, మూసీనది వెంట ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడల నుంచి వచ్చే వ్యర్థరసాయనాలతో మూసీ విషతుల్యంగా మారింది. ఈ నీరు ప్రవహించే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భూములు కాలుష్యపూరితం కాగా, ఇక్కడ పండే పంటల్లో కూడా వాటి అవశేషాలు ఉండటంతోపాటు, ఈ నీటిని తాగిని వారికి ప్రాణాంతక రోగాలు సోకుతున్నాయి. నీటిని తాగిన పశువులు సైతం రోగాలబారిన పడుతున్నాయి. తాజాగా మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడంతో మూసీపరివాహకం ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈసారైనా మూసీకి పట్టిన కాలుష్యపీడ విరగడవుతుందని రైతులు ఆశిస్తున్నారు.

గోదావరి జలాలను మూసీకి తరలిస్తాం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భారీ నీటిపారుదలశాఖ మంత్రి

మూసీ నదిని పునరుజ్జీవింపచేయడం ద్వారా ఈ నది నీటితో నల్లగొండ జిల్లాలోని ఆయకట్టుకు స్వచ్ఛమైన నీటిని అందిస్తాం. మూసీనదిలోకి గోదావరి జలాలను తీసుకొస్తాం. అందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. మూసీ నది కింద జిల్లాలో ఉన్న బునాదిగాని కాల్వ పునరుద్ధరణకు రూ.266.65కోట్ల నిధులు కేటాయించాం. అదేవిధంగా పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వలకు కూడా రూ.211 కోట్ల నిఽధులిస్తాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూసీ నదిని జీవనదిగా మార్చి కాల్వల ద్వారా , ప్రాజెక్టు ద్వారా సుమారు 1.40లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం. మూసీ పరివాహక రైతులకు ఉపశమనం కలిగించేలా ఈ ప్రాజెక్టు చేపట్టాం. ఉమ్మడి జిల్లాలో మూసీ పరివాహక రైతులకు స్వచ్ఛమైన జలాలందించడమే అంతిమ లక్ష్యంగా కార్యాచరణ కొనసాగిస్తాం.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో నల్లగొండ రైతులకు ఉపశమనం : కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి

మూసీ నది కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆ బాధ ఇక్కడి జనాలకి తెలుసు. ఆ కాలుష్యం నీళ్లను వాడి, తాగి ఇక్కడి జనం క్యాన్సర్‌, ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు. మూసీ ప్రక్షాళన కోసం నేను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొట్లాడితే అప్పటి కేసీఆర్‌ సర్కార్‌ పట్టించుకోలేదు. భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు కూడా మూసీ ప్రక్షాళనను నమో గంగా తరహాలో చేపట్టాలని కేంద్రాన్ని కోరా. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టాం. దీనికి రాజకీయాలకతీతంగా అందరూ సహకరించాలి. ఈ ప్రాజెక్టుపై రాజకీయాలు చేయవద్దు. దీన్ని అడ్డుకోవాలని చూస్తున్న ప్రతిపక్ష నాయకులు కొన్నాళ్లు మూసీ పరివాహకంలో నివసిస్తే వారికి బాధలు అర్థమవుతాయి. ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నించినా కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీని పునరుజ్జీవింపజేసి నల్లగొండ జిల్లా ప్రజల బాధలు తీరుస్తుంది. అప్పటివరకు మేం విశ్రమించేది లేదు. నల్లగొండ రైతులకు న్యాయం చేయడమే నా జీవితకాల ఆకాంక్ష. అందుకోసం ఎంతవరకైనా పోరాడతా.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టాల్సిందే

రాజకీయాల కోసం అడ్డుకుంటే ప్రజలు క్షమించరు

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు దుర్మార్గపూరితంగా వ్యవహరించడం సరికాదని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి హితవు పలికారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవం ఇప్పటికిప్పుడు చేపట్టిందేమీ కాదని, 1999లో ప్రధానిగా వాజపేయి ఉన్నప్పటి నుంచి కొనసాగుతుందన్నారు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో కూడా రూ.18వేల కోట్ల మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు కొనసాగిందని గుర్తుచేశారు. ఈ విషయాలన్నింటినీ విస్మరించి ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రమే ఈ ప్రాజెక్టు చేపట్టి దోచుకుంటున్నట్లు ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. మూసీ నది కాలుష్యంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఈ ప్రాంతంలో పండే పంటలు, కూరగాయలను ఇక్కడే విక్రయించుకోలేని, తినలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం మూసీ పునరుజ్జీవంపై కొంత పట్టుదలతో వ్యవహరిస్తున్నందుకు అభినందిస్తున్నానని తెలిపారు. మూసీ ప్రాజెక్టుని ఉద్దేశపూర్వంగా అడ్డుకుంటే ప్రతిపక్షాలపై ఉద్యమించేందుకు నల్లగొండ జిల్లా ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు. మునిసిపల్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ చాలా తెలివిగలవారనడంలో సందేహం లేదని, కానీ ఆయన హయాంలోనే హైదరాబాద్‌ మహానగరంలో 50 అంతస్థుల భవనాలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని, వాటి నిర్మాణంలో వచ్చే మట్టి, ఇతర వ్యర్థాలు ఎక్కడ పోస్తున్నారో హైడ్రా పరిశీలించాలని సూచించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును నందనవనం పేరుతో 1998-99లోనే అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిందన్నారు. అందులో భాగంగా హస్తినాపురంలో మూసీ ఆక్రమణదారులకు ఇళ్లు కూడా కేటాయించారని, రూ.350 కోట్లతో నాలుగు ఎస్‌టీపీలను కూడా నిర్మించారని గుర్తు చేశారు. మంచి పని చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని, నిర్వాసితులకు పరిహారాలు, పునరావాసం విషయంలో సూచనలుంటే చేయాలే తప్ప పూర్తిగా విమర్శలు చేయడం సరికాదని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీ నదిని జీవనదిగా మార్చే ప్రాజెక్టును కొనసాగించాలని మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి సూచించారు.

మూసీ ప్రక్షాళన చారిత్రక అవసరం: వేముల వీరేశం, నకిరేకల్‌ ఎమ్మెల్యే

నార్కట్‌పల్లి: మూసీ ప్రక్షాళన చారిత్రక అవసరం. మూసీ ప్రక్షాళన జరిగితే హైదరాబాద్‌ మినహాయించి మొత్తంగా లాభపడేది నల్లగొండ జిల్లా ప్రజానీకమే. నిజాం కాలం నాడు జీవధారగా ఉన్న మూసీ నది ఇపుడు విషతుల్యమైంది. గతంలో ఫ్లోరిన్‌ మహమ్మారిబారిన పడిన నల్లగొండ జిల్లా ప్రజల ఆర్తనాదాలను ఢిల్లీ నడివీధుల్లో గొంతెత్తి అరిచినా ఎవ్వరూ పట్టించుకోలేదు. తదుపరి పాలకులు చేపట్టిన కొన్ని సంస్కరణల ఫలితంగా తాత్కాలిక ఉపశమనం పొందడమే తప్ప పూర్తిగా రూపుమాపలేకపోయాం. ఈ పరిస్థితుల్లో మూసీ నది రూపంలో మరో పెను ప్రమాదం నల్లగొండ జిల్లాను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇంటికి కాలినడకన రాకపోకలు సాగించే సమయంలో దాహార్తి తీర్చుకునేందుకు మూసీ నది చెలిమల నీటిని తాగేవారు. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. జిల్లాలో 20 శాతం మాత్రమే కృష్ణా జలాలతో పంటలు సాగవుతుండగా, మిగతా 80శాతం పంటలు మూసీ నీటితోనే సాగవుతున్నాయి. దీంతో మూసీ నీటితో పండించిన పంటలు కొనేపరిస్థితి లేదు...చాపలు తినే పరిస్థితి లేక ప్రజల ఉపాఽధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూసీ నీరు కృష్ణా నదిలో కలిసి ఆ నీటిని సైతం విషతుల్యం చేస్తోంది. మూసీ ప్రక్షాళన జరిగి కృష్ణానీటితో అనుసంధానిస్తే భవిష్యత్‌లో జల అద్భుతాలు సాక్షాత్కారమవుతాయి.

రోగాలు నయం చేసిన నీరు రోగాల పాల్జేస్తోంది

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

మోత్కూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఒక నాడు రోగాలు నయమయ్యేందుకు తాగిన మూసీ నీరు నేడు విషతుల్యమై ఆ నీటితో పండిన పంటలు, అందులో పెరిగిన చేపలు తిన్న ప్రజలు, నీరు తాగిన పశుపక్షాదులు రోగాలబారిన పడుతున్నాయని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు. శుక్రవారం ’ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, అనంతగిరి కొండల్లో ప్రారంభమైన మూసీ నీరు స్వచ్ఛమైదన్నారు. ఆ నీటిని ఒకప్పుడు టీబీ రోగం నయం అయ్యేందుకు తాగమనే వారన్నారు. మూసీ పరివాహకం ఆక్రమణలకు గురై అందులోకి మురుగు నీరు, పరిశ్రమల కాలుష్యపు నీరు వదలడం, వ్యర్థాలు వేయడంతో విషతుల్యమైందన్నారు. ఆ నీటితో పంట పండించిన రైతు తన పంటను తానే తినలేని దుస్థితి ఉందన్నారు. మూసీ పరివాహక ప్రాంత గ్రామాల్లో తాగునీరు కూడా విషతుల్యమైందన్నారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో మూసీ ప్రక్షాళన చేయాలనుకున్నా అది ముందుకు సాగలేదన్నారు. కేసీఆర్‌ హయాంలో మూసీ ప్రక్షాళనకు ఓ కమిటీ వేసి దానికి చైర్మన్‌ను నియమించి, రూ.వెయ్యికోట్లు కేటాయించినప్పటికీ చిత్తశుద్ధి లేక పనులు చేయలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పునర్జీవానికి కంకణం కట్టుకుని, మూసీ పరివాహక ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం, హైదరాబాద్‌ను మురికికూపం నుంచి కాపాడి సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రక్షాళన చేపట్టారన్నారు. సీఎం ఆలోచనను లక్షలాది మంది హర్షిస్తున్నారన్నారు. వంద కాదు 200 శాతం మూసీ ప్రక్షాళన అవసరమన్నారు. మూసీ ప్రక్షాళన పూర్తయితే సీఎం రేవంత్‌రెడ్డికి మంచి పేరొచ్చి ప్రజలు ఆయన వెంటే ఉంటారని, ఎన్ని మాయ మాటలు చెప్పినా నమ్మరన్న దుగ్ధతో కేటీఆర్‌, హరీ్‌షరావు, ఈటల తదితరులు ఈ పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన వద్దనడం వారి అవగాహనారాహిత్యానికి పరాకాష్ట అన్నారు. మూసీ ప్రక్షాళన చేసి, గోదావరి జలాలు మూసీలోకి వదిలితే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఈ తరం వారేకాదు భావితరాల వారు కూడా సీఎం రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటారన్నారు. మూసీ ప్రక్షాళనకు రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని, ప్రజలు సైతం మద్దతు తెలపాలన్నారు.

మూసీ ప్రక్షాళనకు అందరూ సహకరించాలి : కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే

ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో హైదరాబాద్‌ ఎంతగా అభివృద్ధి చెందిందో... మూసీ నదిని ప్రక్షాళన చేస్తే ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మూసీ ప్రక్షాళన చేస్తే రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటలతో మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మూసీ రివర్‌ బెడ్‌పై ఉన్న ఇళ్లు పోతున్న వారికి బాధ ఉంటుంది. ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. మూసీ ప్రక్షాళనకు సహకరించాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూసీ నదితో అందరికీ మేలు జరుగుతుంది.

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టాల్సిందే : చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ

మూసీ నది పునరుజ్జీవ ప్రాజె క్టు కోటి మంది జనాలకు ఉపయుక్తమయ్యే పథకం. దీన్ని రాజకీయ కోణంలో ప్రతిపక్షాలు అడ్డుకోవడం సమంజసం కాదు. ఈ ప్రాజెక్టును అడ్డుకుంటే ఉమ్మడి జిల్లాలోని రైతులంతా ఉద్యమిస్తారని హెచ్చరిస్తున్నాం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఈ పథకాన్నిచేపట్టిన విషయం గుర్తుంచుకోవాలి. ఉమ్మడి జిల్లాలోని మూసీపరివాహక ప్రాంత రైతులకు నష్టం కలిగిస్తే సహించేది లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టకపోయినా, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టినందుకు సీఎం రేవంత్‌రెడ్డిని, ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం దురదృష్టకరం.

Updated Date - Oct 19 , 2024 | 12:40 AM