చింతలపాలెంలో దిద్దుబాటు చర్యలు
ABN, Publish Date - Oct 26 , 2024 | 12:35 AM
చింతలపాలెంలో అతిసార వ్యాధి నివారణకు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
గ్రామాన్ని సందర్శించిన జిల్లా వివిధ శాఖల అధికారులు
మేళ్లచెర్వు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): చింతలపాలెంలో అతిసార వ్యాధి నివారణకు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బోరు నీటిని త్రాగడం ద్వారా అతిసార వ్యాప్తి చెందిందని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. స్థానికంగా మిషన భగీరఽథ నీరు లభ్యం కాకపోవటంతో గుడిమల్కాపురం గ్రామంలోని భగీరథ పైపుల నుంచి తొమ్మిది ట్రాక్టర్ ట్యాంకుల ద్వారా గ్రామస్థులకు మధ్యాహ్నం నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాన్ని సందర్శించిన వారిలో డీపీవో నారాయణరెడ్డి, మిషన భగీరథ అధికారులు, తహసీల్దార్ సురేందర్‌రెడ్డి, ఎంపీడీవో భూపాల్‌రెడ్డి, వైద్యాధికారి సీతామహాలక్ష్మి, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
చింతలపాలెం మండల కేంద్రంలో బోరు బావి నీటిని తాగటం వల్ల అతిసార వ్యాప్తి చెందిందని డీఎంహెచవో కోటాచలం అన్నారు. శుక్రవారం చింతలపాలెం మండల కేంద్రంలో వ్యాధి ప్రభావిత ప్రాంతంలో జడ్పీ సీఈవో అప్పారావుతో కలిసి గ్రామంలోని బోరు నీటిని పరీక్షల నిమిత్తం వేర్వేరుగా సేకరించారు. గ్రామంలోని 22 తాగునీటి బోర్ల నీటి నమునాలు తీసుకోగా, ఒక్క బోరు మినహా అన్నింట్లోని నీరు కలుషితం అయ్యాయని, దాంతో అతిసార వ్యాప్తి చెందుతుందని డీఎంహెచవో అన్నారు. ఈ నెల 16, 17 తేదీల నుంచి రోజుకు రెండు, మూడు కేసులు నమోదవుతున్నాయని, ఇప్పటి వరకు గ్రామంలో 42 కేసులు నమోదయ్యాయన్నారు. చాలా వరకు గ్రామంలోనే చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమించిన వారిని హుజూర్‌నగర్, సూర్యాపేట ఏరియా ఆసుపత్రులకు తరలించామన్నారు. వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే గ్రామంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి 24గంటల పాటు ఔషధాలు, చికిత్స అందజేస్తున్నామన్నారు.
భరోసా ఇవ్వని అధికారుల పర్యటన
గ్రామంలో గురువారం 19కేసులు నమోదు కావడంతో శుక్రవారం జిల్లా అధికార యంత్రాంగం గ్రామానికి వచ్చింది. వైద్యశిబిరానికి పరీక్షల కోసం నలుగురు రాగా వారిలో ఒకరికి స్వల్ప వ్యాధి లక్షణాలు ఉండటంతో క్యాంప్‌లోనే వైద్యసేవలు అందించారు. గురువారం ఇద్దరు అతిసారతో మృతి చెందారన్న సమాచారంతో వ్యాధిగ్రస్తులు వైద్యశిబిరాన్ని రాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు తరలివెళ్లినట్లు సమాచారం. శుక్రవారం అధికారుల పర్యటనతో గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా మినహా వైద్యఆరోగ్యంపై సరైన భరోసా కల్పించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - Oct 26 , 2024 | 12:35 AM