అకాల వర్షాలతో రైతుల్లో గుబులు
ABN, Publish Date - Oct 18 , 2024 | 01:12 AM
ఆకాల వర్షాలతో రైతులు గుండెల్లో దడ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా నాలుగైదు రోజులుగా ఓ మోస్తరుతోపాటు చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అయితే వరి పంట చేతికొచ్చింది. పలు ప్రాంతాల్లో కోతల దశలో ఉండగా, మరికొన్ని చోట్ల వరికోతలు ప్రారంభమయ్యాయి.
ఓ వైపు వరికోతలు, మరోవైపు వర్షాలు
భారీ వర్షాలు కురిస్తే చేతికొచ్చిన పంట నేలపాలు
ఆందోళనలో రైతులు
యాదాద్రి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆకాల వర్షాలతో రైతులు గుండెల్లో దడ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా నాలుగైదు రోజులుగా ఓ మోస్తరుతోపాటు చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అయితే వరి పంట చేతికొచ్చింది. పలు ప్రాంతాల్లో కోతల దశలో ఉండగా, మరికొన్ని చోట్ల వరికోతలు ప్రారంభమయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతంలో కోతలు పూర్తయి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా ఆకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. చేతకొచ్చిన ధాన్యం నేలపాలవుతోందని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో బుధవారం సగటున 14.5మిల్లీమీటర్ల వర్షపాతం, గురువారం సగటున 3.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుర్కపల్లి మండలంలో 14మి.మీ, ఆలేరులో 5మి.మీ, మోటకొండూరులో 1.1మి.మీ, యాదగిరిగుట్టలో 1.6మి.మీ, భువనగిరిలో 6.7మి.మీ, బొమ్మలరామారంలో 6.1మి.మీ, చౌటుప్పల్‌లో 1.3మి.మీ, నారాయణపూర్‌లో 9.2మి.మీ, వలిగొండలో 1.2మి.మీ, ఆత్మకూరులో 1.3మి.మీ, మోత్కురులో 2.5మి.మీ, అడ్డగూడూరులో 6.7మి.మీ, గుండాలలో 1.8మి.మీ వర్షపాతం నమోదైంది. నిత్యం వర్షాలు కురుస్తుండటంతో వరికోతలు ముందుకు సాగడంలేదు. కోత దశలో ఉన్న వరిని సైతం యంత్రాలు కోయలేకపోతున్నాయి. భారీ వర్షాలు కురిసిన పక్షంలో పంటను కోసేందుకు కనీసం వారం రోజులు పడుతుంది. తడిచిన పంట ఆరడంతో పాటు పొలంలో నీరు కూడా ఇంకిపోవాలి. దీంతో చేతికొచ్చిన ధాన్యం నేలపాలవుతుందినే ఆందోళనలో రైతులు ఉన్నాయి. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 2.80లక్షల ఎకరాల వరకు వరి సాగైంది. మొత్తం 5లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా.
ధాన్య కొనుగోళ్లకు సన్నాహాలు
మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు పలు చోట్ల వరికోతలు పూర్తయి కేంద్రాలకు ధాన్యాన్ని రైతులు తరలించేందుకు సన్నాహా లు చేస్తున్నారు. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టారు. వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను తెరిచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైతులు మాత్రం వెంటనే కేంద్రాలను ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. జిల్లాలో మొత్తం 323 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. వీటిలో ఐకేపీ 90 కేంద్రాలు, పీఏసీఎస్ 220తో పాటు మరో 13 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వర్షాలు కురుస్తున్నందున కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ఉండేందుకు 3,567 టార్పాలీన్లు సిద్ధంగా ఉంచారు. తేమశాతం చూసే యాంత్రాలు 323, కాంటాలు 476, ప్యాడీ క్లీనర్లు 228 వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే కోతలు పూర్తయ్యే చోట్ల వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - Oct 18 , 2024 | 01:13 AM